KTR E race : దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్ అంశంపై అసెంబ్లీలో చర్చ పెట్టాలి : సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ లేఖ

దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్(Formula-E race)అంశంపై రాష్ట్ర శాసనసభ(Assembly)లో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)లేఖ రాశారు

Update: 2024-12-18 10:20 GMT

దిశ, వెబ్ డెస్క్ : దమ్ముంటే ఫార్ములా-ఈ రేస్(Formula-E race)అంశంపై రాష్ట్ర శాసనసభ(Assembly)లో చర్చ పెట్టాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్(KTR)లేఖ రాశారు. ఫార్ములా-ఈ రేస్ వ్యవహారంలో మీ ప్రభుత్వం కొన్ని నెలలుగా గత బీఆర్ఎస్ ప్రభుత్వం మీద, ముఖ్యంగా నా మీద అనేక నిరాధార అరోపణలు చేస్తున్నదని మండిపడ్డారు. ఈ విషయం మీద ఈ వారం మీ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ సమావేశంలో గంటన్నర సేపు చర్చ కూడా జరిగినట్టు వార్తా కథనాలు వచ్చాయన్నారు. నాపైన కేసులు నమోదు చేస్తారని, గవర్నర్ ఆమోదం వచ్చిందని రకరకాల లీకుు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి మీడియాకు ఇస్తున్నారని కేటీఆర్ పేర్కొన్నారు.

ఈ అంశం మీద నాలుగు గోడల మధ్య చర్చ కన్నా రాష్ట్ర శాసన సభలో నాలుగు కోట్ల మంది ప్రజల ముందు చర్చ జరగితే నిజానిజాలు ఏమిటో అందరికీ తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్ నగరానికి మంచి జరగాలనే సదుద్దేశంతో గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒక ఒప్పందం చేసుకుందని గుర్తు చేశారు. 2023లో రేస్ విజయవంతంగా జరిగిందన్నారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ. 700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేసిందన్నారు. 2024లో మరో దఫా రేస్ జరగవలసి ఉండగా మీ ప్రభుత్వం వచ్చిన వెంటనే దాన్ని ఏకపక్షంగా రద్దు చేయడం జరిగిందన్నారు. అప్పటి నుండి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేసి, ఇందులో ఏదో అక్రమాలు జరిగిందనే అపోహలు సృష్టించే ప్రయత్నం మీ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం అంతా పారదర్శకంగా జరిగిందని, రేస్ నిర్వాహకులకు చెల్లింపులు కూడా పారదర్శకంగానే జరిగాయని ఇదివరకే నేను వివరంగా చెప్పడం జరిగిందన్నారు. అయినా మీ ప్రభుత్వం మాత్రం దుష్ప్రచారం మానడం లేదని, రాష్ట్ర ప్రజలకు నిజాలేమిటో తెలుసుకునే హక్కు ఉన్నదన్నారు. కనుక మీరు శాసనసభలో ఈ అంశంపై చర్చ పెట్టాలని నేను డిమాండ్ చేస్తున్నానని, దీనిపైన శాసనసభలో సవివరమైన చర్చ జరిగితే నిజానిజాలేమిటో నిగ్గుతేలుతాయని లేఖలో కేటీఆర్ పేర్కొన్నారు. 

Tags:    

Similar News