గెరిల్లాగా మారిపోయిన రైతు.. ఆనందంలో గ్రామస్తులు! (వీడియో)

కోతి అంటే అల్లర, చిల్లర. కోతి వచ్చిందంటే నానా హంగామా చేయనిదే వెళ్లదు. అడవులను వదిలిన కోతులు జనవాసాల్లో చేరి అలజడులను సృష్టిస్తున్నాయి.

Update: 2022-10-11 14:09 GMT

దిశ, వెబ్‌డెస్క్ : కోతి అంటే అల్లర, చిల్లర. కోతి వచ్చిందంటే నానా హంగామా చేయనిదే వెళ్లదు. అడవులను వదిలిన కోతులు జనవాసాల్లో చేరి అలజడులను సృష్టిస్తున్నాయి. ఇళ్లపై, పంటలపై, పళ్ల తోటలపై దాడులు చేస్తూ తీవ్ర నష్టాన్ని కలిగిస్తున్నాయి. చేతికి వచ్చిన పంటలపై మూకుమ్మడిగా దాడి చేసి నాశనం చేస్తున్నాయి. వీటిని నివారించాలని అధికారులకు, ప్రజాప్రతినిధులకు మొరపెట్టుకున్నా.. ఫలితం లేకపోవడంతో ఓ రైతు తన పంటను కాపాడుకోవడం కోసం వినూత్నంగా ఆలోచించి సక్సెస్ అయ్యాడు. కోతిముకలు మళ్లీ తన చేను దరి చేరకుండా చేశాడు. అందరికీ స్ఫూర్తిగా నిలుస్తున్న ఈ రైతు ఏం చేశాడో తెలుసుకుందాం రండి.

సూర్యాపేట జిల్లా మోతె మండలం కొత్తగూడెం గ్రామానికి చెందిన రైతు భూపాల్ రెడ్డి ఈ ఏడాది పది ఎకరాల్లో పత్తిపంటను సాగుచేశాడు. అయితే గ్రామంలో కోతుల బెడద ఎక్కువగా ఉండటంతో ఇళ్లపైనే కాకుండా వ్యవసాయ పొలాలు, చేన్లపై పడి విధ్వంసం సృష్టిస్తున్నాయి. వాటిని తరమాలని ప్రయత్నించినా.. మూకుమ్మడిగా మనుషులపై దాడికి దిగుతున్నాయి. దీంతో కొండంగిలను తీసుకువచ్చి కోతులను పంపాలని చూసినా ఫలితం లేకపోయింది. కోతుల బెడదను ఎలా నివారించాలని భూపాల్ రెడ్డి యూట్యూబ్‌లో సెర్చ్ చేశాడు. అందులోని ఓ విధానం నచ్చి దానిని అమలు చేసి కోతులను తరిమేశాడు.

భూపాల్ రెడ్డి రూ.4,500 వెచ్చించి ఆన్‌లైన్‌లో గెరిల్లాడ్రెస్‌ను కొనుగోలు చేశాడు. ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఆ డ్రెస్‌ను ధరించి పత్తి చేనులో అరుస్తూ అటూ ఇటూ తిరగడం ప్రారంభించాడు. ఎలుగుబంటి డ్రెస్‌లో ఉన్న భూపాల్ రెడ్డిని చూసిన కోతులు.. నిజంగానే గెరిల్లా వచ్చిందనే భ్రమలో ఆ చేను వైపు రావడం మానేశాయి. ప్రస్తుతం భూపాల్ రెడ్డి ఐడియా సక్సెస్ కావడంతో తోటి రైతులు సైతం ఆ డ్రెస్ వేసుకుని కోతులను తరుముతున్నారు. మరోవైపు కోతుల బెడదను నివారించిన భూపాల్ రెడ్డిని గ్రామస్తులు అభినందిస్తున్నారు.


Similar News