టెన్త్ ఫెయిల్ విద్యార్థులకు అలర్ట్.. సప్లిమెంటరీ పరీక్షల తేదీలు ఇవే
పదోతరగతి సప్లిపెంటరీ పరీక్ష తేదీలను అధికారులు వెల్లడించారు.
దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్రంలో 91.31 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. ఇంటర్మీడియట్ తరహాలోనే టెన్త్ ఫలితాలలోనూ బాలికలే పై చేయి సాధించారు. బాలికలు 93.23 శాతం, బాలురు 89.42 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలికలు, బాలుర కంటే 3.81% అధికముగా ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు మంగళవారం ఉదయం బషీర్ బాగ్ లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం టెన్త్ రిజల్ట్ విడుదల చేశారు. గతేడాదితో పోలీస్తే ఈఏడాది పాస్ పర్సంటేజ్ భారీగా నమోదైంది. ఫలితాలను http://results.bse.telangana.gov.in, http://results.bsetelangana,org, bse.telangana.gov.in వెబ్‌సైట్స్ ద్వారా పొందవచ్చని అధికారులు తెలిపారు.
జూన్ 3 నుంచి అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు:
టెన్త్ పరీక్షల్లో ఫెయిల్ అయిన విద్యార్థుల కోసం జూన్ 3 నుంచి 13 వరకు పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నారు. ఈ మేరకు పరీక్షల టైమ్ టేబుల్ ను విద్యాశాఖ సెక్రటరీ బుర్రా వెంకటేశం విడుదల చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు సంబంధింత పాఠశాలల్లో మే 16వ తేదీ లోపు పరీక్ష ఫీజు చెల్లించాలని తెలిపారు.
15 రోజుల పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్:
రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్ కోసం ఇవాళ్టి నుంచి 15 రోజుల్లోగా విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు. రీ కౌంటింగ్ కు రూ.500, రీ వెరిఫికేషన్ కు రూ. వెయ్యి రుసుము నిర్ణయించారు.
నిర్మల్ ఫస్ట్ వికారాబాద్ లాస్ట్:
టెన్త్ ఫలితాలలో నిర్మల్ జిల్లా అన్ని జిల్లాల కంటే 99.5 శాతం ఉత్తీర్ణత సాధించి ప్రథమ స్థానంలో నిలిచింది. సిద్దిపేట 98.65 శాతంతో రెండో స్థానంలో, రాజన్న సిరిసిల్ల జిల్లా 98.27 శాతంతో మూడు స్థానంలో నిలిచింది. 65.10 శాతం పాస్ పర్సంటేజ్ తో వికారాబాద్ జిల్లా రాష్ట్రంలోనే చివరి స్థానంలో నిలిచింది. జిల్లాల వారీగా పాస్ పర్సంజేట్ లో ఫస్ట్ అండ్ లాస్ట్ కేటగిరీలో గతేడాది ఫలితాలే ఈసారి రిపీట్ అయ్యాయి. గతేడాది కూడా నిర్ణల్ జిల్లా రాష్ట్రంలో టాప్ లో ఉండగా వికారాబాద్ చివరి స్థానంలో నిలిచింది. ఇక 3,927 స్కూల్స్‌లో 100 శాతం ఉత్తీర్ణత నమోదు కాగా, ఆరు స్కూల్స్‌లో జీరో శాతం పాస్ పర్సంటేజ్ నమోదైంది. ప్రైవేట్ విద్యార్థుల ఉత్తీర్ణత శాతము 49.73 శాతం నమోదు కాగా తెలంగాణ గురుకుల పాఠశాల విద్యార్థుల్లో 98.71 శాతం ఉత్తీర్ణత సాధించారు.