ఇదెక్కడి విడ్డూరం.. ఓ వైపు ‘దళితులకు పెద్దపీట’.. మరోవైపు రోడ్డు మీదకు ఈడ్చి..!
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో శాంతిభద్రతలు కల్పించి న్యాయాన్ని కాపాడాల్సిన అధికారులే కొత్త సమస్యలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు. స్థానికంగా పనిచేస్తున్న గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు, పోలీసులు కొందరి చెప్పుచేతల్లో పనిచేస్తూ […]
దిశ, జగిత్యాల: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలంలో శాంతిభద్రతలు కల్పించి న్యాయాన్ని కాపాడాల్సిన అధికారులే కొత్త సమస్యలు సృష్టించి ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. దీనిపై గ్రామ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు, తెలంగాణ జనసమితి జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి మండిపడ్డారు. శుక్రవారం మధ్యాహ్నం బుగ్గారం మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడ్డారు.
స్థానికంగా పనిచేస్తున్న గ్రామస్థాయి, మండల స్థాయి అధికారులు, పోలీసులు కొందరి చెప్పుచేతల్లో పనిచేస్తూ ప్రజలను నానా ఇబ్బందులకు, అన్యాయాలకు గురిచేస్తున్నారని విమర్శించారు. అధికారులు, ఉద్యోగులు, పోలీసులు చట్టపరిధిలో పనిచేయాలి కానీ, చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకొని ఇష్టారాజ్యంగా ఏక పక్ష నిర్ణయాలకు దిగడం సబబు కాదన్నారు.
ఇటీవల బుగ్గారంలో జరుగుతున్న పరిస్థితులపై అధికారులే పూర్తి బాధ్యులని, ప్రజల్లో అనేక అనుమానాలు కూడా కలుగుతున్నాయన్నారు. రైతు వేదికకు రంగులు పూసిన ఘటనలో దోషులను ఎందుకు పట్టుకోలేకపోతున్నారని పోలీసులు ప్రశ్నించారు. ఇందుకు కారణంగా వందలాది మంది పోలీస్ సిబ్బందితో, పోలీస్ ఉన్నతాధికారులు సైతం మూడు, నాలుగు రోజులు భారీ బందోబస్తు పెట్టాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందన్నారు. అలాగే, బుగ్గారం శివారులోని 516 సర్వే నంబర్‌లో నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణిల భూమిలోనే బృహత్ పల్లె ప్రకృతి వనం నిర్మించ తలపెట్టడం సబబు కాదన్నారు. అధికారులు, ఉన్నతాధికారులు ముందస్తుగా వారికి చట్టపరమైన నోటీసులు ఎందుకు జారీ చేయలేకపోయారని అనుమానాలను వ్యక్తం చేశారు. 516 సర్వే నంబర్‌లో 36 మందికి పట్టా పాసుపుస్తకాలు ఉంటే కేవలం ఈ ముగ్గురు మహిళా రైతులనే ఎందుకు టార్గెట్ చేశారని ప్రశ్నించారు.
నిజంగా ప్రభుత్వానికి భూమి అవసరం ఉంటే 36 మంది రైతులకు నోటీసులు జారీ చేసి నిర్ణయం తీసుకోవాలి కదా అని అడిగారు. గ్రామస్థాయి అధికారులు, మండల రెవెన్యూ అధికారులు, మండల పరిషత్ అధికారులు, పోలీసులు మూకుమ్మడిగా ఈ ముగ్గురు మహిళా రైతు కుటుంబాలపై జులుం ప్రదర్శించడం, మహిళలపై తీవ్రంగా విరుచుకుపడటం, పసి పిల్లలను కూడా తీవ్ర భయబ్రాంతులకు గురిచేయడం వారి పంట పొలాల్లో నుండి వారినే ఎలాంటి ఉత్తర్వులు లేకుండా బలవంతంగా కిడ్నాప్ విధానంలో అరెస్టులు చేయడం సబబుకాదన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో, ప్రజలను కాపాడాల్సిన అధికారులే ఇలా వ్యవహరించడంలో ఆంతర్యం ఏమిటని చుక్క గంగారెడ్డి సంబంధిత అధికారులను ప్రశ్నించారు. బాధితులకు అండగా నిలబడి తగు న్యాయం కోసం మహిళా కమీషన్‌ను, బాలల హక్కుల సంఘం (కమిషన్)ను, మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయిస్తామన్నారు. సమావేశంలో బాధిత మహిళా రైతులు నగునూరి సంధ్య, నగునూరి జ్యోతి, నగునూరి శ్రావణి, నగునూరి లక్ష్మీ, నగునూరి చిన్న రామగౌడ్, నర్సాగౌడ్, తిరుపతి గౌడ్ తదితరులు పాల్గొన్నారు.