విద్యా వ్యవస్థపై కొరవడుతున్న పర్యవేక్షణ

దిశ ప్రతినిధి, కరీంనగర్: విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే సంకల్పంతో కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనల వర్షం కురిపిస్తూనే ఉన్నా.. ఇప్పటికే అమలవుతున్న పాఠశాల వ్యవస్థను మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గురుకులాలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటు గురించి చెబుతున్న పాలకులు పాఠశాల విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఉన్నా, అజామాయిషీ చేసేందుకు పై స్థాయి అధికారులు లేని దుస్థితి. ఎంఈఓ, డిప్యూటీ […]

Update: 2021-02-04 20:35 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: విద్యా వ్యవస్థను పటిష్టం చేయాలనే సంకల్పంతో కేజీ టు పీజీ ఉచిత విద్య అందిస్తామని ప్రభుత్వం ఓ వైపు ప్రకటనల వర్షం కురిపిస్తూనే ఉన్నా.. ఇప్పటికే అమలవుతున్న పాఠశాల వ్యవస్థను మాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. గురుకులాలు, మోడల్ స్కూళ్ల ఏర్పాటు గురించి చెబుతున్న పాలకులు పాఠశాల విద్యపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టు అర్థమవుతోంది. చదువు చెప్పేందుకు ఉపాధ్యాయులు ఉన్నా, అజామాయిషీ చేసేందుకు పై స్థాయి అధికారులు లేని దుస్థితి. ఎంఈఓ, డిప్యూటీ డీఈఓ, డీఈఓ ఇలా అన్నీ స్థాయిల్లో ఇన్చార్జిలతో నడుస్తుండడంతో పాఠశాలల విద్యా సాగుతున్న తీరును పరిశీలించే వారు నామమాత్రం అయ్యారు.

విధానం లేని నిర్ణయాల ఫలితం

సర్వీసు రూల్స్ అంశంపై రాష్ట్ర విద్యా వ్యవస్థలో స్తబ్దత నెలకొంది. రిక్రూట్ మెంట్ సమయంలో ప్రభుత్వాలు చేసిన తప్పిదాలు టీచర్లను వెంటాడుతున్నాయి. డీఎస్సీ ద్వారా రిక్రూట్ అయిన టీచర్లకు కౌన్సెలింగ్ నిర్వహించి పోస్టింగ్ ఇస్తారు. ఇందులో స్థానిక సంస్థల ద్వారా ఏర్పాటు చేసిన జిల్లాపరిషత్ హైస్కూళ్లు, ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైస్కూళ్లు ఉంటాయి. రెండు చోట్లా డీఎస్సీ ద్వారా రిక్రూటైన వారికి ఏక కాలంలో పోస్టింగ్ ఇస్తారు. అయితే లోకల్ బాడీలో నియామకం అయిన వారి కన్నా తామే ప్రమోషన్లకు అర్హులమని జీహెచ్ఎస్ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు అంటుండగా, తామంతా డీఎస్సీ ద్వారా ఏకకాలంలో రిక్రూట్ అయ్యామని లోకల్ బాడీల పరిధిలో పనిచేస్తున్నంత మాత్రాన ఈ వేరియేషన్​ ఎందుకని మిగతా వర్గం వాదిస్తోంది.

అప్పటి తప్పుడు నిర్ణయంతో

1992లో అప్పటి సర్కారు చేసిన తప్పుడు నిర్ణయం ఇప్పుడు పదోన్నతులకు అడ్డంకిగా మారింది. ఏపీపీఎస్సీ ద్వారా 1992 నుంచి 1998 వరకు పలుమార్లు టీచర్ల నియామకం చేపట్టారు. జోనల్ లెవల్లో జరిగిన ఈ ప్రక్రియ ద్వారా ఎంపికైన వారు తామే పదోన్నతులకు అర్హులమంటున్నారు. అదే సమయంలో కోర్టును ఆశ్రయించడంతో జీహెచ్ఎస్ టీచర్లకు అనుకూలంగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ విషయాన్ని సర్కారు పెద్దలు పట్టించుకోకపోవడంతో కోర్టు ధిక్కరణ వరకూ వెళ్లింది. అప్పటికప్పుడు విద్యాశాఖ ఉన్నతాధికారులు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టినప్పుడు కోర్డు ఉత్తర్వులు అమలు చేస్తామని లేఖ ఇచ్చారు. అప్పటి నుంచి ఈ అంశాన్ని పరిష్కరించేందుకు చొరవ చూపడం లేదు. రిక్రూట్ మెంట్ తీరు, నిబంధనల గురించి కోర్టుకు తెలియజేసి ప్రమోషన్లపై క్లియరెన్స్ తీసుకునే అవకాశం ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఏపీపీఎస్సీ ద్వారా నియామకం అయిన వారు జోనల్ స్థాయిలో అయినందున వారికి ప్రమోషన్లలో ప్రాధాన్యం కల్పిస్తామని ప్రభుత్వం నిర్ణయించి వారందరికి అవకాశం కల్పించినా ఇంకా ఖాళీలే ఉండే అవకాశం ఉంది. కోర్టులో రాసిచ్చామన్న కారణంలో అధికారులు పదోన్నతుల విషయంలో పట్టించుకోకపోవడం విస్మయం కల్గిస్తోంది. అధికారులు తమను తాము కాపాడుకునేందుకు కోర్టుకు రాసిచ్చిన లేఖ ఇప్పుడు విద్యాశాఖలో వివిధ కేడర్ ల ఖాళీలకు ప్రధాన కారణమైంది.

రాష్ట్రంలో ఖాళీలు

33 జిల్లాలను ఏర్పాటు చేసిన ప్రభుత్వం 12 డీఈఓ పోస్టులను మాత్రమే మంజూరు చేసింది. 7 జిల్లాల్లో మాత్రమే రెగ్యులర్​ డీఈఓలు ఉండగా, అదనపు బాధ్యతల్లో 26 మంది పనిచేస్తున్నారు. ఇందులో ఐదుచోట్ల ఏడీలు, 12 చోట్ల లెక్చరర్లు, ప్రొఫెసర్లు, 5 జిల్లాల్లో రెండు జిల్లాలకు ఒకరే బాధ్యతలు నిర్వర్తించడం, 8 జిల్లాల్లో డిప్యూటీ డీఈఓలు, జీహెచ్ఎం-1 లు ఇన్​చార్జిలుగా పనిచేస్తున్నారు. 66 డిప్యూటీ డీఈఓ పోస్టులకు ఆరుగురు మాత్రమే పని చేస్తుండగా 60 ఖాళీగా ఉన్నాయి. జీహెచ్ఎం 18 పోస్టులకు ఒక్కటి మాత్రమే భర్తీ కాగా 17 ఖాళీగానే ఉన్నాయి. 591 మండలాలు ఉండగా గతంలో మంజురైన 443 పోస్టులకు కొత్తగా 85 పోస్టులు మంజూరు చేసిన సర్కారు ఇంకా 47 పోస్టులను సాంక్షన్ చేయాల్సి ఉంది. సర్కారు మంజూరు చేసిన 85 ఎంఈఓ పోస్టులు కూడా నేటికీ మండలాలకు కేటాయించడపోవడం విడ్డూరం. మండల విద్యాధికారుల ఖాళీలు వెలవెలబోతున్నందున అధికారులు ఇన్​చార్జిగా బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. రాష్ట్రంలో మెజార్టీ మండలాల్లో ఇన్​చార్జిలతోనే విద్యా వ్యవస్థను నడిపిస్తున్నారు.

Tags:    

Similar News