US Open : యువ షట్లర్ మాళవిక సంచలనం.. మూడో సీడ్‌కు షాకిచ్చి సెమీస్‌లోకి

యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది.

Update: 2024-06-29 14:24 GMT

దిశ, స్పోర్ట్స్ : అమెరికాలో జరుగుతున్న యూఎస్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత యువ క్రీడాకారిణి మాళవిక బాన్సోద్ మహిళల సింగిల్స్‌లో సెమీస్‌కు దూసుకెళ్లింది. శనివారం జరిగిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌లో ఆమె 3వ సీడ్ కిర్స్టీ గిల్మర్(స్కాట్లాండ్)కు షాకిచ్చింది. 57 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో మాళవిక తన కంటే మెరుగైన ర్యాంకర్‌పై స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించింది. మొదట మ్యాచ్‌లో ఆమెకు శుభారంభం దక్కలేదు. తొలి గేమ్‌ను కిర్స్టీ గిల్మర్ గెలుచుకుంది. ఆ తర్వాత మాళవిక అద్భుతంగా పుంజుకుంది. 3వ సీడ్‌ను ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తూ దూకుడుగా ఆడింది. ఆ జోరులో వరుసగా రెండు గేమ్‌లను నెగ్గి విజేతగా నిలిచింది. సెమీస్‌లో 6వ సీడ్ నట్సుకి నిడైరా(జపాన్)ను ఎదుర్కోనుంది.

మరోవైపు, మహిళల డబుల్స్‌లో గాయత్రి గోపిచంద్-ట్రీసా జాలీ జంట పోరాటం ముగిసింది. క్వార్టర్స్‌లో జపాన్‌కు చెందిన రుయ్ హిరోకామి-యునా కాటో 21-17, 17-21, 21-19 తేడాతో పోరాడి ఓడి టోర్నీ నుంచి నిష్ర్కమించింది. మెన్స్ సింగిల్స్‌లో యువ ఆటగాడు ప్రియాన్షు రజావత్ కూడా ఇంటిదారిపట్టాడు. 4వ సీడ్, చైనా షట్లర్ లీ లాన్ క్సీ చేతిలో 15-21, 21-11, 21-18 తేడాతో పరాజయం పాలయ్యాడు.

Similar News