ఆడుతూనే కుప్పకూలిపోయాడు.. యువ షట్లర్ మృతి

ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది.

Update: 2024-07-01 13:26 GMT

దిశ, స్పోర్ట్స్ : ఇండోనేషియాలో జరుగుతున్న బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో ఊహించని ఘటన చోటుచేసుకుంది. చైనా యువ షట్లర్ జాంగ్ ఝీ జీ హఠాత్తుగా కోర్టులోనే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని బాడ్మింటన్ ఆసియా సోమవారం ధ్రువీకరించింది. బ్యాడ్మింటన్ ఆసియా జూనియర్ చాంపియన్‌షిప్స్‌లో టీమ్ ఈవెంట్‌లో భాగంగా ఆదివారం రాత్రి చైనా, జపాన్ జట్ల మధ్య జరిగింది.

ఆ మ్యాచ్‌లో మెన్స్ సింగిల్స్ గేమ్‌లో 17 ఏళ్ల జాంగ్ ఝీ జీ జపాన్ షట్లర్ కజుమా కవానోతో తలపడ్డాడు. తొలి గేమ్‌లో 11-11 స్కోరు వద్ద జాంగ్ ఝీ జీ హఠాత్తుగా కిందపడిపోయాడు. టోర్నమెంట్ మెడికల్ టీమ్ అతన్ని వెంటనే హాస్పిటల్‌కు తరలించింది. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి అతను మరణించినట్టు బాడ్మింటన్ ఆసియా పేర్కొంది.

ఈ ఏడాది జాంగ్ ఝీ జీ డచ్ జూనియర్ ఇంటర్నేషనల్ సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకున్నాడు. గతేడాది అతను చైనా జాతీయ యూత్ జట్టులో చేరాడు. జాంగ్ మృతి పట్ల భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ఎక్స్‌ వేదికగా సంతాపం తెలిపింది. ‘ఈ ఘటన హృదయ విదారకమైనది. ప్రపంచం అద్భుతమైన ప్రతిభను కోల్పోయింది. జాంగ్ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా.’ అని పేర్కొంది. 

Similar News