టీమ్ ఇండియా టీ20 కెప్టెన్ రేసు లిస్ట్ పెద్దదే.. పోటీలో ఉన్నది వీళ్లే

రోహిత్ శర్మ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేసి టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో రోహిత్ తర్వాత ఎవరు? అన్న ప్రశ్నలో అందరిలోనూ నెలకొంది.

Update: 2024-07-01 19:06 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా 17 ఏళ్ల నిరీక్షణకు తెరదించింది. టీ20 వరల్డ్ కప్‌ను సొంతం చేసుకుంది. రోహిత్ శర్మ భారత్‌ స్వప్నాన్ని సాకారం చేసి టీ20 ఫార్మాట్‌కు గుడ్ బై చెప్పాడు. దీంతో రోహిత్ తర్వాత ఎవరు? అన్న ప్రశ్నలో అందరిలోనూ నెలకొంది. టీ20 పగ్గాలు ఎవరికి దక్కుతాయోనన్న చర్చ జరుగుతుంది. రోహిత్ గైర్హాజరులో టీ20 జట్టును నడిపించిన స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాకే ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అయితే, కెప్టెన్సీ రేసులో చాలా మందే ఉన్నారు. స్టార్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్‌తోపాటు కేఎల్ రాహుల్, శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ యాదవ్ పేర్లు కూడా వినిపిస్తున్నాయి.

టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ వన్డే, టెస్టుల్లో కొనసాగుతానని చెప్పాడు. కెప్టెన్‌గా పొట్టి ప్రపంచకప్ అందించిన అతను.. ఇప్పుడు వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్, చాంపియన్స్ ట్రోఫీపై ఫోకస్ పెట్టాడు. చాంపియన్స్ ట్రోఫీ, డబ్ల్యూటీసీ ఫైనల్ రెండూ వచ్చే ఏడాదే జరగనున్నాయి. 37 ఏళ్ల రోహిత్ అన్ని సహకరిస్తే బహుశా మరో రెండేళ్లు ఆడొచ్చు. ఫిట్‌నెస్‌పరంగా, ఫామ్‌పరంగా ప్రస్తుతం అతను పీక్స్‌లో ఉన్నాడు. కాబట్టి, ఈ రెండు టోర్నీల వరకు అతను వన్డే, టెస్టు జట్లకు కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. ఈ రెండు టోర్నీలకు సీనియర్లు కూడా అందుబాటులో ఉంటారని బీసీసీఐ సెక్రెటరీ జై షా చెప్పారు. కాబట్టి, మరో ఏడాది వరకు రోహిత్ కెప్టెన్‌గా కొనసాగే అవకాశం ఉంది. అయితే, పరిమిత ఓవర్ల జట్లకు, టెస్టు జట్టుకు వేర్వేరు సారథులు నియమించాలన్న డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అయితే, ఆ టోర్నీల తర్వాతే ఆ ప్రతిపాదనను ముందుకు తీసుకొచ్చేలా బీసీసీఐ ఆలోచన చేయొచ్చు. లేదంటే, ఆ టోర్నీల అనంతరం మూడు ఫార్మాట్లకు ఒకే కెప్టెన్‌ను నియమించొచ్చు. మరోవైపు, 2026లో టీ20 వరల్డ్ కప్, 2027లో వన్డే వరల్డ్ కప్‌లను కూడా దృష్టిలో పెట్టుకుని బీసీసీఐ నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది.

ముందు వరుసలో పాండ్యా

వైస్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా టీ20 కెప్టెన్సీలో రేసులో ముందున్నాడు. ఐపీఎల్‌లో 2022లో గుజరాత్ టైటాన్స్‌ను విజేతగా నిలబెట్టడం, రోహిత్ గైర్హాజరులో పొట్టి జట్టును నడిపించిన అనుభవం అతన్ని ముందు వరుసలో నిలబెట్టాయి. ప్రస్తుతం అతను ముంబై ఇండియన్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. టీ20 వరల్డ్ కప్-2022‌ తర్వాత రోహిత్ టీ20 జట్టుకు దూరంగా ఉండగా.. పాండ్యానే టీమ్‌ను నడిపించాడు. అతని నాయకత్వంలో న్యూజిలాండ్, శ్రీలంకపై భారత్ సిరీస్ విజయాలు సాధించింది. చివరిసారిగా విండీస్‌‌ టూరులో కెప్టెన్‌గా వ్యవహరించగా.. ఆ సిరీస్‌ను భారత్ 2-3తో కోల్పోయింది. మొత్తం 16 టీ20ల్లో 12 విజయాలు అందించాడు. ఐపీఎల్‌లో 45 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 26 విజయాలు అందుకున్నాడు.

రేసులో రాహుల్, బుమ్రా, పంత్

కెప్టెన్సీ అంశం వచ్చినప్పుడులా స్టార్ బౌలర్ బుమ్రా పేరు ప్రస్తావనకు వస్తుంది. అయితే, అతనికి కెప్టెన్సీ అనుభవం తక్కువ. వైస్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఇంగ్లాండ్‌తో ఒక టెస్టుకు సారథిగా ఉన్నాడు. ఐర్లాండ్‌తో టీ20 సిరీస్‌కు నాయకత్వం వహించి గెలిపించాడు. భారత క్రికెట్‌లో బౌలర్లకు పగ్గాలు అందించిన సందర్భాలూ తక్కువే. ఆస్ట్రేలియాను పాట్ కమిన్స్ విజయవంతంగా నడిపిస్తున్నాడు. బుమ్రా కూడా అద్భుతాలు చేస్తాడన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అలాగే, కెప్టెన్సీ రేసులో వినిపిస్తున్న మరో పేరు రిషబ్ పంత్. రోడ్డు ప్రమాదం తర్వాత తిరిగొచ్చిన అతను అద్భుతంగా ఆడుతున్నాడు. ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌కు కెప్టెన్‌గా ఉన్నాడు. అలాగే, 2022లో సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు నాయకత్వం వహించాడు. ఆ సిరీస్ 2-2తో ముగిసింది. దేశవాళీలోనూ అతనికి కెప్టెన్సీ అనుభవం ఉంది. వికెట్ కీపర్ అవడం అతనికి ప్లస్. అలాగే, కేఎల్ రాహుల్ కూడా పోటీలో ఉన్నాడు. ఏడాది క్రితం వరకు అతను సారథి రేసులో ముందు ఉన్నా క్రమంగా వెనుకబడ్డాడు. 14 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించను 10 మ్యాచ్‌ల్లో విజయాలు అందించాడు.

వారిద్దరు సైతం

ఓపెనర్ శుభ్‌మన్ గిల్, సూర్యకుమార్ పేర్లు కూడా తెరపైకి వస్తున్నాయి. జింబాబ్వే టూరుకు గిల్ కెప్టెన్‌గా ఎంపికైన విషయం తెలిసిందే. ఐపీఎల్‌లో ఈ సీజన్‌లో గుజరాత్ టైటాన్స్‌ను నడిపించాడు. ప్రస్తుతం గిల్ జట్టులో కీలక ప్లేయరుగా ఉన్నాడు. రోహిత్, కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించడంతో అతని స్థానం మరింత సుస్థిరం కానుంది. మరోవైపు, సూర్యకుమార్ గతేడాది సొంతగడ్డపై ఆస్ట్రేలియా సిరీస్‌కు నాయకత్వం వహించి 4-1తో సిరీస్‌ను సాధించి పెట్టాడు. సౌతాఫ్రికా పర్యటనలోనూ టీ20 జట్టుకు సారథిగా ఉన్నాడు. ఆ సిరీస్ 1-1తో ముగిసింది. 

Similar News