యూరో కప్-2024 : క్వార్టర్స్‌లోకి ఫ్రాన్స్, పోర్చుగల్

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌‌లో ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాయి.

Update: 2024-07-03 18:40 GMT

దిశ, స్పోర్ట్స్ : జర్మనీ వేదికగా జరుగుతున్న యూరో కప్-2024 ఫుట్‌బాల్ టోర్నమెంట్‌‌లో ఫ్రాన్స్, పోర్చుగల్ జట్లు క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టాయి. వరల్డ్ నెంబర్-2గా ఫ్రాన్స్, వరల్డ్ నెంబర్ -3 బెల్జియంతో తలపడింది. ఈ టోర్నీ ప్రారంభం నుంచి ఫ్రాన్స్ జట్టు ఆశించిన మేర ప్రదర్శన చేయలేకపోయింది. కానీ, నాకౌట్ దశలో మాత్రం ఎవరూ ఊహించని విధంగా పుంజుకుంది. అయితే, ఫ్రాన్స్ వర్సెస్ బెల్జియం మధ్య జరిగిన టోర్నీలో పెద్దగా గోల్స్ ఏమీ నమోదవ్వలేదు. కాగా, రౌండ్ ఆఫ్ 16లో 1-0 గోల్ తేడాతో బెల్జియంపై ఫ్రాన్స్ గెలుపొందింది. బెల్జియం సెల్ఫ్ గోల్‌ కారణంగా ఫ్రాన్స్ మొత్తానికి గట్టెక్కింది.టోర్నీ 85వ నిమిషంలో బెల్జియం డిఫెండర్ జాన్ వెర్టాంగెన్ సెల్ఫ్ గోల్ ఫ్రాన్స్ ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ టోర్నీలో ఫ్రాన్స్‌కు లభించిన రెండో సెల్ఫ్ గోల్ ఇది. యూరో 2024లో ఫ్రాన్స్ ఇప్పటివరకు ఓపెన్ ప్లే ద్వారా ఒక్క గోల్ కూడా సాధించలేకపోయింది.

రోనాల్డో కంటతడి..

మరో మ్యాచ్‌లో వరల్డ్ నెంబర్- 57 అయిన స్లోవేనియాతో వరల్డ్ నెంబర్ -6 పోర్చుగల్ తలపడింది.ఈ టోర్నీలో స్లోవేనియా పోర్చుగల్‌కు టఫ్ ఫైట్ ఇచ్చింది. నిర్ణీత టైం, అదనపు టైంలోనూ రెండు జట్లు 0-0గా నిలిచాయి. అయితే, అదనపు టైంలో పోర్చుగల్‌కు పెనాల్టీ షూటౌట్ దొరకగా దానిని క్రిస్టియానో రోనాల్డో వృథా చేశాడు. అతడు కొట్టిన గోల్‌ను స్లోవేనియా గోల్ కీపర్ జాన్ ఒబ్లాక్ అడ్డుకున్నాడు. దీంతో రోనాల్డో కంటతడి పెట్టుకోగా.. ఆ తర్వాత జరిగిన షూటౌట్‌లొ పోర్చుగల్ వరుసగా 3 గోల్స్ చేసింది. ఇక స్లోవేనియా చేసిన ప్రతి గోల్‌ను పోర్చుగల్ గోల్ కీపర్ డీగో కోస్టా అద్భుతంగా కట్టడి చేయడంతో 3-0 గోల్స్ తేడాతో పోర్చుగల్ క్వార్టర్‌లోకి దూసుకెళ్లింది. కాగా, శుక్రవారం జరిగే క్వార్టర్స్‌లో ‘ఫ్రాన్స్ VS పోర్చుగల్’ మధ్య టఫ్ ఫైట్ జరగనుంది.


Similar News