ఆసియా క్రీడల్లో యోగా?.. భారత్ ప్రతిపాదనకు ఆమోదం
2036 విశ్వక్రీడలకు ముందే ఆసియా క్రీడల్లో యోగాను పోటీ క్రీడగా చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి.
దిశ, స్పోర్ట్స్ : ఒలింపిక్స్ గేమ్స్-2036 ఆతిథ్య హక్కుల కోసం భారత్ ప్రయత్నాలు చేస్తోంది. ఆతిథ్యం ఇచ్చే అవకాశం దక్కితే ఆ విశ్వక్రీడల్లో యోగాను కాంపిటేటివ్ స్పోర్ట్స్‌గా చేర్చాలని ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐవోఏ) ప్రతిపాదనలను సిద్ధం చేసింది. అయితే, 2036 విశ్వక్రీడలకు ముందే ఆసియా క్రీడల్లో యోగాను పోటీ క్రీడగా చూసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఆసియా క్రీడల్లో యోగాను చేర్చాలన్న ఐవోఏ ప్రతిపాదనకు ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా(ఓసీఏ) ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించింది.
ఈ విషయాన్ని ఐవోఏ ప్రెసిడెంట్ పీటీ ఉష సోమవారం వెల్లడించింది. ‘యోగాకు గుర్తింపు ఇవ్వాలన్న భారత్ అభ్యర్థనను ఓసీఏ ఎగ్జిక్యూటివ్ బోర్డు అంగీకరించినందుకు సంతోషంగా ఉంది. ఇప్పుడు ప్రతిపాదన స్పోర్ట్స్ కమిటీ ద్వారా జనరల్ అసెంబ్లీకి వెళ్తుంది.’అని పేర్కొంది. ఓసీఏ జనరల్ అసెంబ్లీలో ఆమోదం లభిస్తే యోగా ఆసియా క్రీడల్లో చేరనుంది. అయితే, యోగాను పతక క్రీడా లేక ప్రదర్శన క్రీడా ఓసీఏ జనరల్ అసెంబ్లీ నిర్దారిస్తుంది. ప్రపంచం వ్యాప్తంగా గుర్తింపు పొందిన యోగాను పతక క్రీడాగా మారుతుందని ఐవోఏ ఆశాభావం వ్యక్తం చేసింది.