ఢిల్లీని వీడటంపై పంత్ పోస్టు.. నన్ను అక్కున చేర్చుకున్నారంటూ ఎమోషనల్
ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బంధానికి తెరపడింది.
దిశ, స్పోర్ట్స్ : ఐపీఎల్‌లో ఢిల్లీ క్యాపిటల్స్‌తో భారత వికెట్ కీపర్, బ్యాటర్ రిషబ్ పంత్ బంధానికి తెరపడింది. వచ్చే సీజన్‌లో అతను లక్నో సూపర్ జెయింట్స్‌కు ఆడనున్నాడు. వేలంలో పంత్‌ను లక్నో రూ.27 కోట్ల భారీ ధర వెచ్చించి దక్కించుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఢిల్లీ జట్టును వీడటంపై పంత్ స్పందించాడు. ఎక్స్ వేదికగా మంగళవారం ఎమోషనల్ పోస్టు పెట్టాడు.
‘వీడ్కోలు అంత సులభమైనది కాదు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో ప్రయాణం అద్భుతం. మైదానంలో ఎన్నో ఉత్కంఠభరితమైన క్షణాలు, మరెన్నో మధుర జ్ఞాపకాలు ఉన్నాయి. ఇక్కడ ఎంతో నేర్చుకున్నా. టీనేజర్‌గా ఉన్నప్పుడు వచ్చా. ఇప్పుడు ఎంతో ఎదిగా.’ అని భావోద్వేగం చెందాడు. అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్ ఫ్యాన్స్‌కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపాడు. ‘ఈ ప్రయాణాన్ని ప్రత్యేకంగా మార్చింది అభిమానులే. నన్ను అక్కున చేర్చుకున్నారు. నన్ను ఉత్సాహపరిచారు. నా జీవితంలో కఠిన దశలో నాకు అండగా నిలిచారు. నేను ముందుకు సాగుతున్నప్పటికీ మీ ప్రేమను, మద్దతును నా గుండెల్లో ఉంచుకుంటాను. మైదానంలో మిమ్మల్ని ఎల్లప్పుడూ ఉత్సాహపరిచేందుకు ప్రయత్నిస్తూనే ఉంటా.’ అని పంత్ రాసుకొచ్చాడు.
కాగా, 2016-24 వరకు 9ఏళ్లపాటు పంత్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.మూడు సీజన్లకు(2021, 2022, 2024) కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే, ఢిల్లీ రిటైన్ చేసుకోకపోవడంతో వేలంలోకి వచ్చిన పంత్‌ను లక్నో కొనుగోలు చేసింది. లక్నో పగ్గాలను ఫ్రాంచైజీ పంత్‌కే అప్పగించే అవకాశాలు ఉన్నాయి.