వింబుల్డన్‌లో పెను సంచలనం.. వరల్డ్ నం.1 స్వైటెక్‌కు షాకిచ్చిన అన్‌సీడ్ క్రీడాకారిణి

వింబుల్డన్‌ మరో సంచలనం నమోదైంది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ ఇంటిదారిపట్టింది.

Update: 2024-07-06 19:10 GMT

దిశ, స్పోర్ట్స్ : వింబుల్డన్‌ మరో సంచలనం నమోదైంది. ఉమెన్స్ సింగిల్స్ టైటిల్ ఫేవరెట్, వరల్డ్ నం.1 ఇగా స్వైటెక్ ఇంటిదారిపట్టింది. ఆమెకు అన్‌సీడ్ క్రీడాకారిణి, కజకస్థాన్‌కు చెందిన యులియా పుతింట్సేవా మూడో రౌండ్‌లో షాకిచ్చింది. శనివారం జరిగిన మ్యాచ్‌లో పుతింట్సేవా 3-6, 6-1, 6-2 తేడాతో స్వెటెక్‌ను చిత్తు చేసింది.

ఈ మ్యాచ్‌లో మొదట స్వైటెక్‌దే శుభారంభం. తొలి సెట్‌ను నెగ్గి మ్యాచ్‌ను దూకుడుగా ఆరంభించింది. ఆ తర్వాత పుతింట్సేవా పుంజుకున్న తీరు అద్భుతం. వరల్డ్ నం.1ను కేవలం ప్రేక్షక పాత్రకే పరిమితం చేస్తూ ఆమె చెలరేగింది. వరుసగా మిగతా రెండు సెట్లను నెగ్గి మ్యాచ్‌ను సొంతం చేసుకుని ప్రీక్వార్టర్స్‌కు చేరుకుంది. ఏస్‌లు, విన్నర్ల పరంగా పుతింట్సేవాతో పోలిస్తే స్వైటెకే ఎక్కువ బాదింది. కానీ, 2 డబుల్ ఫౌల్ట్స్, 38 అనవసర తప్పిదాలతో ఆమె మూల్యం చెల్లించుకుంది. స్వైటెక్ ఒక్కసారే ప్రత్యర్థి సర్వీస్‌ను బ్రేక్ చేయగా.. పుతింట్సేవా నాలుగు సార్లు స్వైటెక్ సర్వీస్‌ను బ్రేక్ చేసింది.

మరోవైపు, గతేడాది ఫైనలిస్ట్ ఒన్స్ జాబెర్(ట్యూనీషియా) ఆట కూడా మూడో రౌండ్‌లోనే ముగిసింది. ఆమెపై ఉక్రెయిన్ క్రీడాకారిణి స్విటోలినా పైచేయి సాధించింది. స్పష్టమైన ఆధిపత్యం ప్రదర్శించిన స్విటోలినా 6-1, 7-6(7-4) తేడాతో జాబెర్‌ను ఓడించింది. మెన్స్ సింగిల్స్‌లో టాప్ సీడ్ సిన్నర్, 4వ సీజ్ జ్వెరెవ్ ప్రీక్వార్టర్స్‌కు చేరుకున్నారు.

రెండో రౌండ్‌లో బోపన్న జోడీ ఓటమి

వింబుల్డన్‌లో భారత సీనియర్ ఆటగాడు రోహన్ బోపన్న పోరాటం ముగిసింది. పురుషుల డబుల్స్‌లో బోపన్న-మాథ్యూ ఎబ్డెన్(ఆస్ట్రేలియా) జోడీ నిష్ర్కమించింది. రెండో రౌండ్‌లో బోపన్న జోడీ 3-6, 6-7(4-7) తేడాతో జర్మనీకి చెందిన హెండ్రిక్స్ జెబెన్స్-ఫ్రాంజెన్ ద్వయం చేతిలో పరాజయం పాలైంది. గంటా 18 నిమిషాలపాటు సాగిన మ్యాచ్‌లో బోపన్న జంట వరుసగా రెండు సెట్లను కోల్పోయి ఓటమిని అంగీకరించింది. 


Similar News