తైక్వాండోలో రూప బేయర్ చరిత్ర.. తొలి భారత అథ్లెట్‌గా ఘనత
అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన తైక్వాండో అథ్లెట్ రూప బేయర్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకుంది.
దిశ, స్పోర్ట్స్ : అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన తైక్వాండో అథ్లెట్ రూప బేయర్ రికార్డు పుస్తకాల్లో తన పేరును లిఖించుకుంది. వరల్డ్ ర్యాంకింగ్స్‌లో టాప్-10లో నిలిచిన తొలి భారత తైక్వాండో అథ్లెట్‌గా ఘనత సాధించింది. వరల్డ్ తైక్వాండో తాజాగా రిలీజ్ చేసిన పూమ్సే వరల్డ్ ర్యాంకింగ్స్‌లో రూప 9వ స్థానానికి చేరుకుంది.
కొంతకాలంగా రూప పూమ్సే విభాగంలో సత్తాచాటుతోంది. 2021లో 123వ ర్యాంక్‌లో ఉన్న ఆమె.. 2022లో 42వ స్థానానికి, గతేడాది 12వ స్థానానికి ఎగబాకింది. తాజాగా టాప్-10లోకి అడుగుపెట్టి భారత తైక్వాండోలో చారిత్రాత్మక మైలురాయిని చేర్చింది. తైక్వాండోలో ఏ విభాగంలోనైనా టాప్-10 ర్యాంక్ సాధించిన తొలి భారత అథ్లెట్‌గా రూప ఘనత సాధించింది.
ఆసియాలో ఆమె నం.1 ర్యాంక్‌లో ఉన్నది. ఈ ఏడాది మేలో జరిగిన ఏషియన్ తైక్వాండో పూమ్సే చాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న ఆమె.. సీనియర్ 1 వ్యక్తిగత పూమ్సే ఈవెంట్‌లో భారత్‌కు మొట్టమొదటి పతకాన్ని అందించిన అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.