విజయ్ హజారే ట్రోఫీలో శతక్కొట్టిన సిరిసిల్ల కుర్రాడు.. టోర్నీలో హైదరాబాద్ శుభారంభం
విజయ్ హజారే ట్రోఫీని హైదరాబాద్ విజయంతో ఆరంభించింది.
దిశ, స్పోర్ట్స్ : విజయ్ హజారే ట్రోఫీని హైదరాబాద్ విజయంతో ఆరంభించింది. తొలి మ్యాచ్‌లో నాగాలాండ్‌ను చిత్తు చేసి శుభారంభం చేసింది. అహ్మదాబాద్‌లో శనివారం జరిగిన మ్యాచ్‌లో 42 పరుగుల తేడాతో విజయం సాధించింది. సిరిసిల్ల కుర్రాడు ఆరవెల్లి అవినీశ్(100, 82 బంతుల్లో 14 ఫోర్లు, ఓ సిక్స్) సెంచరీతో రెచ్చిపోయి హైదరాబాద్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 48.1 ఓవర్లలో 276 పరుగులు చేసి ఆలౌటైంది. అవనీశ్ శతకానికితోడు వరుణ్ గౌడ్(57), తన్మయ్ అగర్వాల్(51) హాఫ్ సెంచరీలతో సత్తాచాటారు. అనంరతం ఛేదనలో నాగాలాండ్ పోరాటం ఫలించలేదు. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 234 పరుగులకే పరిమితమైంది. యుగాంధర్ సింగ్(80), జగదీశ సుచిత్(66) రాణించినప్పటికీ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో మిగతా బ్యాటర్లు తేలిపోయారు. హైదరాబాద్ బౌలర్లలో మహ్మద్ ముద్దస్సిర్, శరణు నిశాంత్ రెండేసి వికెట్లు పడగొట్టారు.
ఆంధ్ర కూడా విజయంతో..
టోర్నీని ఆంధ్ర జట్టు కూడా గెలుపుతోనే మొదలుపెట్టింది. తొలి మ్యాచ్‌లో రైల్వేస్ జట్టుపై 91 పరుగుల తేడాతో భారీ విజయం అందుకుంది. మొదట అశ్విన్ హెబ్బర్(132) భారీ శతకం నమోదు చేయడంతో ఆంధ్ర 49.2 ఓవర్లలో 294 పరుగులు చేసింది. ఇక, ఛేదనలో రైల్వేస్ 41.5 ఓవర్లలో 203 పరుగులకే ఆలౌటైంది. ఉపేంద్ర యాదవ్(64), మహ్మద్ సైఫ్(46), సురాజ్ అహుజా(40) రాణించారు. ఆంధ్ర బౌలర్లలో బోధల కుమార్ 4 వికెట్లు, శశికాంత్ 3 వికెట్లతో ప్రత్యర్థి పతనాన్ని శాసించి ఆంధ్ర విజయంలో కీలక పాత్ర పోషించారు.