BWF World Junior Championship : చైనీస్ తైపీ చేతిలో పరాజయం.. 6వ స్థానంతో సరిపెట్టిన భారత్
వరల్డ్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో భారత్ 6వ స్థానంతో సరిపెట్టింది.
దిశ, స్పోర్ట్స్ : చైనాలో జరిగిన వరల్డ్ బ్యాడ్మింటన్ మిక్స్‌డ్ టీమ్ చాంపియన్‌షిప్స్ టోర్నీలో భారత్ 6వ స్థానంతో సరిపెట్టింది. శనివారం 5వ స్థానం కోసం జరిగిన పోరులో భారత్ 110-87 తేడాతో చైనీస్ తైపీ చేతిలో పరాజయం పాలైంది. మొదటి నుంచి చైనీస్ తైపీ షట్లర్లు ఆధిక్యంలో కొనసాగారు. ఏ దశలోనూ భారత యువ షట్లర్లు ప్రత్యర్థిని నిలువరించలేకపోయారు. బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్(బీడబ్ల్యూఎఫ్) ఈ ఏడాది టోర్నీలో తొలిసారిగా రిలే స్కోరింగ్ సిస్టమ్‌ను తీసుకొచ్చింది. ఈ స్కోరింగ్ సిస్టమ్ ప్రకారం.. 10 మ్యాచ్‌ల్లో 110 స్కోరు చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది. టోర్నీలో గ్రూపు దశలో అజేయంగా ముగించిన భారత్.. క్వార్టర్ ఫైనల్‌లో ఇండోనేషియా చేతిలో ఓడి ముందడుగు వేయలేకపోయిన విషయం తెలిసిందే. టోర్నీ చరిత్రలో 6వ స్థానంతో ముగించడం భారత్‌కు ఇది మూడోసారి. మరోవైపు, టోర్నీలో ఇండోనేషియా జట్టు చాంపియన్‌గా నిలిచింది. ఫైనల్‌లో డిఫెండింగ్ చాంపియన్ చైనాను 110-103 తేడాతో చిత్తుచేసి టైటిల్ సాధించింది. ఇండోనేషియాకు ఇది రెండో టీమ్ టైటిల్.