T20WorldCup2024: ‘అంపైర్‌ నిర్ణయాలపై గౌరవం ఉంది.. కానీ ఇది దారుణం’

టీ20 వరల్డ్ కప్ మహిళల టోర్నీలో భాగంగా ఇండియా, న్యూజిల్యాండ్ మధ్య జరిగిన మ్యాచ్‌లో భారత్ ఓటమికంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ని మరింతగా బాధపెట్టిన అంశం న్యూజిల్యాండ్ బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ వివాదం.

Update: 2024-10-05 08:31 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీ20 వరల్డ్ కప్ మహిళల టోర్నీలో భాగంగా ఇండియా, న్యూజిల్యాండ్ మధ్య శుక్రవారం తొలి మ్యాచ్ జరిగిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో ఇండియా దారుణంగా 58 పరుగుల తేడాతో ఓడిపోయింది. అయితే ఈ మ్యాచ్‌లో భారత్ ఓటమికంటే ఇండియన్ క్రికెట్ ఫ్యాన్స్‌ని మరింతగా బాధపెట్టిన అంశం న్యూజిల్యాండ్ బ్యాటర్ అమేలియా కెర్ రనౌట్ వివాదం. ఈ కాంట్రవర్సీపై టీమిండియా స్టార్ బ్యాటర్ జెమీమా రోడ్రిగ్స్ స్పందించింది. మ్యాచ్ అనంతరం మీడియాతో మాట్లాడిన జెమీమా.. తాము అంపైర్ నిర్ణయాలను గౌరవిస్తామని, కానీ ఈ మ్యాచ్‌లో అమేలియా రనౌట్ విషయంలో అంపైర్ల నిర్ణయం మాత్రం దారుణమని అన్నారు.

దీప్తికి అంపైర్ క్యాప్‌ ఇచ్చిన సమయంలో తాను దగ్గరగా లేకపోవడంతో చూడలేదని, న్యూజిలాండ్‌ ప్లేయర్ అమేలియా కెర్‌ కూడా ఓవర్‌ పూర్తి కాలేదని ఉద్దేశంతోనే ఉందని, అందుకే వాళ్లు రెండో రన్‌ కోసం పరుగుపెట్టారని, తాము కూడా అదే ఆలోచనలో రనౌట్ చేశామని జెమీమా పేర్కొంది. ‘‘అమెలియాని రనౌట్‌ చేసినట్లు భావించాం. అమేలియాకు కూడా ఔటైనట్లు తెలుసు కాబట్టే బయటకు డగౌట్ వైపు వెళ్లింది. కానీ అంపైర్లు ఆమెని వెనక్కి పిలిచి మరీ బ్యాటింగ్ చేయించడం ఇబ్బందిగా చాలా బాధ కలిగించింది. అంపైర్ల డెసిషన్‌ను గౌరవిస్తాం కానీ ఈ నిర్ణయం మాత్రం దారుణం’’ అంటూ జెమీమా చెప్పుకొచ్చింది.

ఇదిలా ఉంటే ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ ఇన్నింగ్స్‌ 14వ ఓవర్‌ చివరి బంతిని ఎక్స్‌ట్రా కవర్స్‌ వైపు తరలించి సింగిల్‌ తీసింది అమేలియా. బంతి కొంచెం దూరం వెళ్లడంతో బ్యాటర్లు అమేలియా, సోఫీ రెండో పరుగు కోసం ప్రయత్నించారు. కవర్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హర్మన్ ప్రీత్.. బంతిని అందుకుని నేరుగా వికెట్ కీపర్‌కు రిచా ఘోష్‌కు విసరడం.. అమేలియా క్రీజ్‌లోకి రాకముందే రిచా వికెట్లను గిరాటేయడం జరిగిపోయింది. అమేలియాకూడా తాను అవుటైపోయానని పెవిలియన్ వైపు నడిచింది.

కానీ ఇదంతా గమనించకుండా బంతి పూర్తయిందనే ఉద్దేశంతో షూ లేస్‌ కట్టుకుంటూ రిలాక్స్ అయిపోయిన స్క్వేర్‌ లెగ్‌ అంపైర్‌.. చివర్లో అమేలియా నాటౌట్ అంటూ వెనక్కి పిలిపించి బ్యాటింగ్ చేయించారు. దీంతో కెప్టెన్ హర్మన్‌ అంపైర్లతో వాగ్వాదానికి దిగింది. చివరిగా అంపైర్లు బంతిని డెడ్‌బాల్‌గా ప్రకటించి చేతులు దులుపుకున్నారు. విచిత్రం ఏంటంటే అమేలియా తర్వాతి ఓవర్లోనే అవుటైపోయింది.


Similar News