జయసూర్య రికార్డు బద్దలు కొట్టిన శ్రీలంక కెప్టెన్
శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టెస్ట్‌ల్లో రికార్డు సృష్టించాడు.
దిశ, వెబ్‌డెస్క్: శ్రీలంక కెప్టెన్ దిముత్ కరుణరత్నే టెస్ట్‌ల్లో రికార్డు సృష్టించాడు. టెస్ట్‌ల్లో 15వ సెంచరీ బాదాడు. స్వదేశంలో ఐర్లాండ్‌తో జరుగుతున్న మొదటి టెస్ట్‌లో కరుణరత్నే ఈ ఫీట్‌ను సాధించాడు. 139 బంతులను ఎదుర్కొన్న కరుణరత్నే..12 ఫోర్లు, సిక్సర్ సాయంతో సెంచరీ మార్కును అందుకున్నాడు. ఈ క్రమంలో అతను లంక దిగ్గజ బ్యాటర్ సనత్ జయసూర్య, స్టార్ ఆల్‌రౌండర్ ఏంజెలో మాథ్యూస్‌ల రికార్డులను అధిగమించాడు.
జయసూర్య, మాథ్యూస్‌లు తమ టెస్ట్ కెరీర్‌లలో 14 టెస్ట్ సెంచరీలు సాధించగా.. కరుణరత్నే వీరిని దాటి లంక తరఫున అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో 6 స్థానానికి ఎగబాకాడు. ఈ జాబితాలో సంగక్కర (38) తొలి స్థానంలో ఉండగా.. జయవర్ధనే (34), అరవింద డిసిల్వ (20), తిలకరత్నే దిల్షన్ (16), మర్వన్ ఆటపట్టు (16) వరుసగా 2 నుంచి 5 స్థానాల్లో నిలిచారు. ఇప్పటివరకు కెరీర్‌లో 85 టెస్ట్‌లు ఆడిన కరుణరత్నే 15 సెంచరీలు, 34 అర్ధసెంచరీల సాయంతో 40.66 సగటున 6,344 పరుగులు సాధించాడు. ఐర్లాండ్.. ప్రస్తుత లంక పర్యటనలో రెండు టెస్ట్ మ్యాచ్‌లు ఆడనుంది.