BGT 2024 : భారత్-ఆసీస్ జట్లకు ప్రధాని ఆంథోని ఆతిథ్యం
భారత్-ఆసీస్ జట్లకు ఆస్ట్రేలియా ప్రధాని అంథోని అల్బనిస్ బుధవారం ఆతిథ్యం ఇచ్చారు.
దిశ, స్పోర్ట్స్ : భారత్-ఆసీస్ జట్లకు ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోని అల్బనిస్ బుధవారం ఆతిథ్యం ఇచ్చారు. ఈ మేరకు ఆస్ట్రేలియా పీఎం రెండు జట్లతో కలిసి దిగిన ఫొటోలను సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ఎక్స్’ వేదికగా పంచుకున్నారు. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీలో ఇప్పటి వరకు 30 వికెట్లు తీసిన భారత ఫాస్ట్ బౌలర్ బుమ్రాను ప్రధాని అంథోని ప్రత్యేకంగా అభినందించినట్లు సిడ్నీ మార్నింగ్
హెరాల్డ్ కథనాలు తెలిపాయి. ఆస్ట్రేలియా యువ బ్యాట్స్‌మెన్ సామ్ కొన్‌స్టాస్ కోహ్లీతో ఫొటో దిగినట్లు ఆసీస్ మీడియా వెల్లడించింది. బుమ్రా ఎడమ చేతి వాటంతో లేదా ఒక్క అడుగు ముందుకు వేయకుండా బౌలింగ్ చేయాలని ఆస్ట్రేలియాలో చట్టం తేస్తాం అని ప్రధాని చమత్కరించారు. ప్రతిసారి అతని బౌలింగ్ చూస్తున్నప్పుడు తెలియని ఉత్తేజం కలుగుతోందని ఆంథోని అన్నారు. భారత స్టార్ ఆటగాడు కోహ్లీతో మాట్లాడుతూ నవ్వుతున్న ఫొటోను సైతం ఆయన షేర్ చేశారు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రెత్ ప్రధానికి పింక్ క్యాప్‌ను బహూకరించాడు. రెండు జట్ల మధ్య చివరి టెస్ట్ ఈ నెల 3 నుంచి సిడ్నీ వేదికగా ప్రారంభం కానుంది.