యువతకు స్ఫూర్తి.. అర్జున దీప్తి.!
అర్జున అవార్డుకు ఎంపికైన పారా అథ్లెట్ దీప్తి జీవాంజి
ఆమెకు ఐక్యూ లెవల్ తక్కువ.
ఐతేనేం.. దేశం గర్వించదగ్గ ప్రతిభ ఆమె సొంతం.
కనీసం బస్సు చార్జీలకు పైసల్లేనంత పేదరికం.
అయినా.. పరిస్థితులకు భయపడి పారిపోలేదు.
అవమానాలను పట్టించుకోలేదు.. అవహేళలను లెక్కచేయలేదు.
వాటిని జయించాలంటే పరుగెత్తాలి అనుకుంది.
2016లో మొదలుపెట్టిన ఆ పరుగు ఎన్నో మైలురాళ్లను దాటుతూ సాగిపోతోంది.
అత్యున్నత క్రీడా పురస్కారమైన అర్జున అవార్డుకు ఎంపికై తెలంగాణకు కీర్తి కిరీటాలు తొడిగిన ఆ పల్లె ఆణిముత్యమే దీప్తి జీవాంజి.!
- దాయి శ్రీశైలం
కేంద్రప్రభుత్వం తాజాగా క్రీడా పురస్కారాలు ప్రకటించింది. అందులో అర్జున అవార్డులు.. ఖేల్‌రత్న అవార్డులు.. ద్రోణాచార్య అవార్డులు ఉన్నాయి. 32 మందికి అర్జున అవార్డులు ప్రకటిస్తే తెలంగాణ నుంచి ఏకైక క్రీడాకారిణిగా దీప్తి జీవాంజి ఆ ఘనతను సొంతం చేసుకొని ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తోంది. దీప్తి జర్నీ గురించి ఆమె మాటల్లోనే...
ఐక్యూ తక్కువ
మాది పేద కుటుంబం. తల్లిదండ్రులు కూలీ పనిచేస్తేనే పూట గడిచే పరిస్థితులుండేవి. వరంగల్‌లోని పర్వతగిరి మండలం కల్లెడ మా ఊరు. అదొక మారమూల గ్రామం. మా నాన్న పేరు యాదగిరి, అమ్మ ధనలక్ష్మీ. నాకు పుట్టుకతోనే చిన్న హెల్త్ సమస్య ఉండేది. దానికి తోడు ఐక్యూ సమస్య ఉందని అంటుంటారు. మిగతా వాళ్లలా నేను ఉండను అని బయటివాళ్లు చెప్తేనే నాకు తెలిసింది. కల్లెడ ఆర్డీఎఫ్ స్కూల్లో చదువుతున్నప్పుడు నాకు క్రీడల పట్ల ఇంట్రెస్ట్ ఏర్పడింది. ముందే మాది పేదకుటుంబం. ఇవన్నీ అవసరమా అనిపించింది. కానీ ఇంట్రెస్టయితే తగ్గలేదు.
గుర్తించిన రమేష్ సార్
అది 2016. అప్పుడు నేను ఎనిమిదో తరగతి. స్కూల్లో రెగ్యులర్ స్పోర్ట్స్ జరుగుతుంటే నేనూ పాల్గొన్నాను. నేనెక్కువగా పరుగుపందెంలో హుషారుగా పాల్గొనేదాన్ని. మరి రమేష్ సార్ ఎక్కడి నుంచి గమనించారోగానీ, నా పరుగు వేగాన్ని చూశారట. ఇలాగే ప్రాక్టీస్ చేస్తే మంచి భవిష్యత్ ఉంటదని చెప్పారు. ఏం చేయాలో అర్థంకాలేదు. సార్ ఇక మా పేరెంట్స్‌తో మాట్లాడారు. పాపం.. కూలీపని చేసుకునేవాళ్లకు ఈ ఆటలూ అవీ అంటే ఎలా ఉంటుందో తెలుసు కదా? ఆలోచనలో పడ్డారు. వాళ్లను రమేష్ సారే మొత్తానికి కన్విన్స్ చేసి ఒప్పించారు.
కిరాయికి డబ్బుల్లేవ్
సరైన శిక్షణ ఇస్తే దీప్తి పెద్ద స్పోర్ట్స్ పర్సన్ అవుతుంది అని రమేష్ సార్ మా పేరెంట్స్‌తో చెప్తుంటే విన్నాను. హైదరాబాద్‌లో శిక్షణ కేంద్రం ఉంటుంది.. అక్కడ అకామిడేషన్ కూడా ఫ్రీగానే ఉంటుంది.. ఎలాగైనా వచ్చేయండీ అని నచ్చజెప్పారు. అయితే హైదరాబాద్‌కు పంపాలన్నా మా దగ్గర బస్సు కిరాయిలకు డబ్బుల్లేవు. సారేమో హైద్రాబాద్‌లో ఉన్నారప్పుడు. ఫోన్‌పేలు.. గూగుల్‌పేలు లేవు కాబట్టీ రమేష్ సారే ఫోన్ చేసి కండక్టర్‌తో మాట్లాడారు. టికెట్ ఇష్యూ చేయండీ నేను హైదరాబాద్‌లో డబ్బులు ఇచ్చేస్తా అంటే మొత్తానికి కండక్టర్ ఓకే అని బస్సెక్కించుకున్నారు. 130 కిలోమీటర్ల మేర సాగిన నా ఆ ప్రయాణంలో చాలా నేర్చుకున్నాను.
పారాలంపిక్ వైపు
హైదరాబాదైతే వచ్చాను కానీ.. అందరితో కలిసిపోవాలంటే భయంగా ఉండేది. దూరంగా ఉండేదాన్ని. అలా ఐదారు రోజులు గడిచిపోయాయి. అప్పుడు నాకొక టెస్ట్ చేయించారు. మూడ్రోజులు పట్టింది దానికి. దీప్తికి మామూలు పిల్లల్లా కాకుండా కొంచెం ఐక్యూ లెవల్ తక్కువగా ఉంది అని అప్పుడు చెప్పారట డాక్టర్లు. నాకు అప్పుడే తెలిసింది నేను మిగతా వాళ్లలా కాదు అనీ. కానీ ఏనాడూ బాధపడలేదు. ఐక్యూ తక్కువగా ఉంది కాబట్టీ నాకు పారా అథ్లెట్ వైపు కోచింగ్ ఇప్పించాలనుకున్నారు. టీ20 కేటగిరీకి ఎంపికయ్యాను. ఐతే ఇంటర్నేషనల్ స్థాయిలో పాల్గొనాలంటే వేరే దేశాల్లో పాల్గొన్న సర్టిఫికేట్లు ఉండాలట. అప్పుడు మొరాకో, ఆస్ట్రేలియాకు వెళ్లాలని ప్లాన్ చేశారు.
అర్హత సాధించా
మొరాకో, ఆస్ట్రేలియాలో పారాలంపిక్‌లో పాల్గొనడానికి వెళ్లాలంటే డబ్బు చాలా అవసరం. కానీ అంత డబ్బు ఎక్కడది? మళ్లీ రమేష్ సార్‌వాళ్లే ఎంతో ప్రయత్నం చేసి దాతల సహకారంతో ఆ రెండు దేశాలకు పంపించారు. మొరాకో, ఆస్ట్రేలియాలో పోటీలు పూర్తిచేసుకున్న తర్వాత ఇంటర్నేషనల్ పారాలో పార్టిసిపేట్ చేయడానికి ఎలిజిబిలిటీ ఇచ్చారు. అలా 2022 ఏషియన్ గేమ్స్‌లో బంగారు పతకం, రికార్డు రెండూ సాధించాను. ఆసియా పారా గేమ్స్‌లో 400 మీటర్ల టీ20 విభాగంలో బంగారు పతకం గెలిచాను. 56.69 సెకన్లలో లక్ష్యం ఛేదించాను కాబట్టీ ప్రపంచ రికార్డులో కూడా ఇది నమోదైంది. తర్వాత 2023 గ్లోబల్ గేమ్స్‌లో 200మీ, 400మీలో రెండు రజతాలను గెలిచాను.
మరింత స్ఫూర్తితో
మే 20, 2024న, జపాన్‌లోని కోబ్‌లో జరిగిన పారా అథ్లెటిక్స్ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 400 మీటర్ల రేసులో 55.07 సెకన్లతో టీ20 ప్రపంచ రికార్డును బద్దలు కొట్టిన. పారిస్‌లో జరిగిన పారా ఒలంపిక్స్ లో 400 మీటర్ల టీ20 విభాగం ఫైనల్ లో 55.82 సెకన్లలో లక్ష్యాన్ని ఛేదించి మూడో స్థానంలో నిలిచాను. కాంస్య పతకం సాధించా. ఈ విభాగంలో తెలంగాణకు తొలిసారిగా ఒలంపిక్స్ పతకం తెచ్చాను. ఇప్పుడు అర్జున అవార్డు. 17న రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటాను. ఇది కేవలం వ్యక్తిగత విజయం మాత్రమే కాదు.. నాలాగ క్రీడలపై ఇంట్రెస్ట్ ఉండి.. ధైర్యమున్న ప్రతి ఒక్కరి విజయం. చాలా సంతోషంగా ఉంది. ఇంతే స్ఫూర్తితో మరింత ఉత్సాహంతో ముందుకెళ్లి మరిన్ని రికార్డులు, పతకాలు సాధిస్తా అనే ధీమా నాలో రెట్టింపయ్యింది.
దీప్తిలా తీర్చిదిద్దుతా: నాగపురి రమేష్, కోచ్
దీప్తికి ఏది చెప్పినా కాస్త నెమ్మదిగా అర్థం చేసుకుంటుంది. 2016లో నేను చూసిన దీప్తికి, ఇప్పటి దీప్తికి చాలా వ్యత్యాసం ఉంది. ఆమె అన్నింట్లోనూ మెరుగైంది. తనకు శిక్షణ ఇవ్వడం ఆశామాషీగా అయితే సాగలేదు. ఎన్ని సవాళ్లు ఎదరైనా దీప్తినొక గొప్ప క్రీడాకారిణిగా నిలబెట్టాలనుకున్నా. ఆ కల నిజమైంది. దాతల సపోర్ట్, దీప్తి కృషి, నా ప్రోత్సాహానికి సర్కారు మద్దతుకూడా దొరికింది కాబట్టీ ఆమెను ఇంకింత అభివృద్ధి పథంలో నడిపిస్తాను. ఇంకా దీప్తిలాంటి ఔత్సాహిక క్రీడాకారులను తీర్చిదిద్ది.. పద్మశ్రీలుగా, అర్జున పురస్కార గ్రహీతలుగా తయారుచేయాలన్నదే నా లక్ష్యం.!