బాధ్య‌తుండ‌క్క‌ర్లే.?!

బాధ్య‌త‌గా ఉండి భావి త‌రాన్ని కాపాడదామా.? వీళ్ల‌లా ఉందామా.?

Update: 2025-01-06 07:13 GMT

బాధ్య‌త.. బ‌తుకును న‌డిపించే ఇంధ‌నం.

సమాజ ప్ర‌గ‌తికి ఆయుధం లాంటిది.

ఎవ‌రికి వాళ్లు బాధ్య‌త‌గా ఉంటే..

ఆటోమేటిగ్గా స‌మాజం ప‌ట్ల బాధ్య‌త పెరుగుతుంది.

కానీ..

ఎవ‌రుంటున్నారండీ బాధ్య‌త‌గా.?

ఎక్క‌డ క‌నిపిస్తున్నారండీ బాధ్య‌తాయుత పౌరులు.?

స‌రే.. ఎవ‌రి వ్య‌క్తిగ‌తం వాళ్ల‌దనుకుందాం.

మ‌రి.. సొసైటీమీద చూపించే ప్ర‌భావం ప‌ట్ల బాధ్య‌తెవ‌రిదండీ.? 

దిశ, ఫీచర్స్

The price of greatness is responsibility అంటారు. కానీ, The world is being filled by irresponsible spoiled brats అన్న‌ట్లు త‌యార‌వుతోంది దునియా. కామ‌న్‌మ్యాన్‌కు బాధ్య‌తంటే బ‌రువైపోతోంది. ఆఫీస‌ర్ల‌యితే బాధ్య‌తారాహిత్యాన్ని అలుముకొని పులుముకుంటున్నారు. ఇక ప్ర‌జాప్ర‌తినిధులంటారా.. వారి గురించి చెప్పుకోవ‌డ‌మే దండ‌గ‌. Life is a gift Bros. The more responsibly we deal with it, the better society will be. సో.. బాధ్య‌త‌గా ఉండి భావి త‌రాన్ని కాపాడదామా.? వీళ్ల‌లా ఉందామా.? 

దీన్నేమ‌నాలి.?

ఛి.. ఛీ.. మ‌నుషులు మ‌రీ మృగాల‌కంటే హీనంగా త‌యార‌వుతున్నార‌బ్బా. క‌ర్నాట‌క‌లో ఒక పోలీసు చేసిన ప‌నికి స‌మాజం త‌ల‌దించుకునే ప‌రిస్థితి ఏర్ప‌డింది. ఆయ‌నొక పోలీసాఫీస‌ర్‌. డీఎస్పీ రేంజ్ ఆఫీస‌రంటే ఎంత బాధ్య‌త‌గా ఉండాలి. సామాన్యుల‌కు ఎంత భ‌రోసానివ్వాలి. అవ‌న్నీ మ‌ర్చిపోయి ఛీ కొట్టించుకుంటున్నాడు. భూ వివాదం గురించి ఫిర్యాదు చేయ‌డానికి ఒక మ‌హిళ మ‌ధుగిరి డీఎస్పీ ఆఫీస్‌కు వెళ్లింది. స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రిస్తా అని చెప్పి కొద్దిసేపు ఏదో న‌ట‌నం స్టార్ వేషాల‌న్నీ వేశాడు ఆఫీస‌ర్ రామ‌చంద్ర‌ప్ప‌. అంతా చూసుకుంటాన‌ని న‌మ్మించాడు. త‌ర్వాత ఆమెను ఒక గ‌దిలోకి తీసుకెళ్లి మాట‌ల్లో చెప్ప‌లేని ప‌నుల‌న్నీ చేశాడు. ఎంత దుర్మార్గ‌మండీ.? ఆయ‌నో ఆఫీసర్‌.. 58 ఏళ్ల వ‌య‌సుంటాడ‌ట‌. ఇంత‌టి బాధ్య‌తారాహిత్యాన్ని ఏమ‌నాలి.?

ఇదేం ప‌నిరా బాబూ.?

ద‌రిద్ర‌మేందంటే.. చేయాల్సిన ప‌నిని స‌క్ర‌మంగా చేసే మ‌హానుభావుడు ఒక్క‌డూ ఉండ‌డు. కానీ ప‌నికిమాలిన ప‌నులు చేయ‌డానికి మాత్రం ఒక‌రికొక‌రు పోటీలు ప‌డ‌తారు. ఎవ‌ర్నీ న‌మ్మే ప‌రిస్థితి లేదు. ఎవ‌డెక్క‌డ సీక్రెట్ కెమెరాలు పెట్టాడో అని అమ్మాయిలు భ‌య‌ప‌డాల్సి వ‌స్తోంది. ఉండాల్సిన‌వాడు బాధ్య‌త‌గా ఉంటే ఎవ‌రికే భ‌య‌మూ అవ‌స‌రం లేదు. కానీ మ‌న సొసైటీలో అలాంటివి జ‌ర‌గ‌వు క‌దా.? సీఎంఆర్ ఇంజినీరింగ్ కాలేజీ హాస్ట‌ల్ బాత్రూముల్లో సీక్రెట్ కెమెరాలు పెడుతున్నారు మొర్రో అని విద్యార్థినులు ఆందోళ‌న చేయాల్సిన ప‌రిస్థితేంటి.? పోలీసులు అనుమానిస్తున్న మెస్‌లో ప‌నిచేసేవాళ్లో.. హాస్ట‌ల్ సిబ్బందో.. కాలేజీ సిబ్బందో.. ఎవ‌డో ఒక‌డు.. ఎవ‌డైనా స‌రే.. బాధ్య‌త‌గా ఉంటే ఈ స‌మ‌స్య‌లొస్తాయా.? మంచి చెయ్య‌డానికి ఒక్క‌డురాడుగానీ.. చెడుప‌నుల‌కు ఇలా పోటీలు ప‌డి చ‌స్తున్నారేంట్రా బాబూ.?

ఇదేంటి మ‌ధ్య‌లో.?

అదొక గ‌వ‌ర్న‌మెంట్ స్కూల్‌. విద్యార్థుల బాధ్య‌త టీచ‌ర్లది. టీచ‌ర్‌కు స‌హ‌క‌రించి చ‌దువుకోవాల్సిన బాధ్య‌త విద్యార్థుల‌ది. మ‌ధ్య‌లో త‌న్నుకోవ‌డాలు.. కాళ్లు మొక్కించ‌డాలు అనేవి ఎందుకు చెప్పండీ.? ప్ర‌ధానోపాధ్యాయుడిచేత అయ్య‌ప్ప మాల ధ‌రించిన విద్యార్థి కాళ్లు మొక్కించార‌ని కొంద‌రు.. లేదు ప్ర‌ధానోపాధ్యాయుడు కాలితో త‌న్నాడు కాబ‌ట్టే ఆ ప‌ని చేయించామ‌ని కొంద‌రు పోటాపోటీ వ్యాఖ్య‌ల‌తో పెద్ద పంచాయితే పెట్టారు. ఇంత‌కూ త‌ప్పెవ‌ర‌ది.? ఇద్ద‌రూ బాధ్య‌తాయుతంగా ఉండాలి. గురువు.. విద్యార్థి కాళ్లు మొక్కేంత ఎదిగిపోయింది దేశం అని కొంద‌రంటే.. గురువు గురువుగా ఉండ‌క‌పోతే ఇలాగే ఉంటుంద‌ని కొంద‌రు వాదించి చాటంత స‌మ‌స్య‌ను చాపంత చేశారు. బాధ్య‌త‌గా ఆలోచించండీ.. ఇదంతా అవ‌స‌ర‌మా..?

అస‌లేంద‌యా నీ బాధ‌.?

ఎవ‌రికైనా నిద్రొస్తే ఇంట్లో మంచం మీద‌నో. నేల‌పైనో ప‌డుకుంటారు. కానీ ఒక మ‌హానుభావుడు ఏకంగా క‌రెంటు తీగ‌ల‌మీద ప‌డ‌కేసి కొత్త సంవ‌త్స‌ర సంబ‌రాలు చేసుకున్నాడు. సార్ గారికి మ‌రెక్క‌డా ప్లేస్ దొర‌క‌లేదేమో.. ద‌ర్జాగా స్తంభం ఎక్కేసి ఆకాశంలోకి చూస్తూ హాయిగా ప‌డకేశాడు. కిందికి దిగ‌వ‌యా అని ఎవ‌రెంత మొత్తుకున్నా మ‌నోడు ఉలుకు ప‌లుకు లేకుండా త‌మాషా చేశాడు. ఏపీలోని మ‌న్యంజిల్లా ఎం.సింగిపురంలో జ‌రిగింది ఈ క‌థ‌. చూడ‌టానికి ఇది తమాషాగానే అనిస్తుండొచ్చు. కానీ, అధికారులు ట్రాన్స్‌ఫార్మ‌ర్ బంద్ చెయ్య‌క‌పోతే ఏంటి ప‌రిస్థితి.? అదెంత ప్ర‌మాద‌మో ఊహించుకుంటేనే ప్రాణం జ‌ల‌ద‌రిస్తుంది. తాగడ‌మే త‌ప్పురా నాయ‌నా అంటే మ‌నోడు క‌రెంటు వైర్ల‌మీద వీరంగం చేయ‌డం.. బాధ్య‌త లేక‌పోవ‌డం వ‌ల్ల‌నే జ‌రిగిందని చెప్పొచ్చు. ఇలాంటి చిన్న చిన్న విష‌యాలే స‌మాజంపై పెద్ద ప్ర‌భావం చూపిస్తాయి.

చివ‌ర‌కు మిగిలిందేంటి.?

రైలును దూరం నుంచి చూస్తేనే అమ్మో అనిపిస్తుంట‌ది. రైలు ప‌ట్టాలు క్రాస్ చేయాల్సి వ‌చ్చిన‌ప్పుడు భ‌య‌ప‌డుకుంటూనే బాధ్య‌త‌గా అటూ ఇటూ చూసి జాగ్ర‌త్త‌గా వెళ్తుంటాం. కానీ బీహార్‌లో ఓ ముగ్గురు యువ‌కులు ఏకంగా ప‌ట్టాల‌పై కూర్చొని ప‌బ్జీ ఆడి ప్రాణాలు తీసుకున్నారు. అస‌లు ఆ ప‌బ్జీయే ఓ చెత్త‌రా నాయ‌నా అంటే.. పైగా దానిని రైలు ప‌ట్టాల‌పై కూర్చొని ఆడ‌ట‌మ‌నేది ప‌ర‌మ చెత్త‌. అదికూడా ముగ్గురికి ముగ్గురి ప్రాణాల్లో గాల్లో క‌లిసిపోయాయి. చెవిలో ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఇంత త‌మాషా చేస్తే బ‌య‌టి శ‌బ్ధాలు ఎలా వినిపిస్తాయి.? బ‌తుకంటే మ‌రీ ఇంత బాధ్య‌తారాహిత్య‌మా.? ఏం మిగిలింది చివ‌రికి.? ఒక్క ఈ ముగ్గురే కాదు.. సెల్పీ మోజులో ప‌డి.. వీడియో గేమ్స్‌లో మునిగిపోయి.. ఇంకా వేరే వేరే వాటికి బానిస‌యి జీవితాన్ని ఆగం చేసుకోవ‌ద్దు.. స‌మాజంపై చెడు ప్ర‌భావం చూపించొద్దు.

చివ‌ర‌గా.. There are two reasons why people fail. One is irresponsibility. The second is fear అనేది మెద‌ళ్ల‌లోకి ఎక్కించుకుంటే మంచిది. We live in an era of organized irresponsibility అని తెలిసినా కూడా ఇంకింత బాధ్య‌తారాహిత్యంగా ఎందుకుంటున్నామో ఆలోచించాలి. ఎవ‌రో చేశార‌ని మ‌నం చేయొద్దు. You never want to tie your responsibility to another's irresponsibility. బాధ్య‌త‌నే మ‌న‌ల్ని కాపాడుతుంది బాస్‌..!

Tags:    

Similar News