HMPV virus : కొత్త వైరస్ ప్రాణాంతకమా..? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
HMPV virus : కొత్త వైరస్ ప్రాణాంతకమా..? ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త!
దిశ, ఫీచర్స్ : కరోనా మహమ్మారి ప్రపంచాన్ని ఎంతగా వణికించిందో చెప్పాల్సిన అవసరం లేదు. దీని కారణంగా ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. ఇక లాక్‌డౌన్ సమయంలో ఎదుర్కొన్న ఇబ్బందులు గుర్తుకు వస్తే మాత్రం ఇప్పటికీ గుండె గుబేల్ మంటుంది జనాలకు. అక్కడక్కడా కోవిడ్ కేసులు ఇప్పటికీ నమోదవుతూనే ఉన్నాయి. ఈ మహమ్మారి సృష్టించిన అల్లకల్లోలాన్ని ఇంకా మర్చిపోకముందే చైనాలో మరో ప్రాణాంతక వైరస్.. హ్యూమన్ మెటాన్యూమో(HMPV) పుట్టుకొచ్చి ప్రపంచాన్ని భయపెడుతోంది. నిన్నమొన్నటి వరకూ ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన కేసులు చైనాలోనే నమోదయ్యాయి. కానీ ప్రస్తుతం ఇండియాలోకి ప్రవేశించిందన్న వార్తలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. రీసెంట్‌గా బెంగుళూరులో ఓ 8 నెలల చిన్నారికి హెచ్ఎంపీవీ పాజిటివ్ తేలడంతో అక్కడి ప్రభుత్వం అలర్ట్ అయింది. ఈ నేపథ్యంలో ఈ వైరస్ సోకితే కనిపించే లక్షణాలేమిటి? ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏం చెబుతోంది? తదితర వివరాలు తెలుసుకుందాం.
డబ్ల్యుహెచ్‌ఓ హెచ్చరిక
హ్యూమన్ మెటాన్యూమో వైరస్(HMPV) ఆందోళనల నేపథ్యంలో ప్రజలు, ప్రభుత్వాలు అలర్ట్‌గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ అన్ని దేశాలను హెచ్చరించింది. కాగా చైనాలో ఈ వైరస్ వ్యాప్తి అధికంగా ఉందని, ప్రజలు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతున్నారని వార్తలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న నేపథ్యంలో అనవసర ఆందోళనకు గురికావద్దని, జాగ్రత్తలు మాత్రం తీసుకోవాలని సూచించింది. అయితే మొదటిసారి చైనాలో డిసెంబర్ మూడవ వారంలో శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందిపడుతున్నవారి సంఖ్య పెరుగుతున్నట్లు అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అయితే 14 ఏండ్లలోపు వారిపైనే దీని ప్రభావం అధికంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా అలర్ట్‌గా ఉండాల్సిన అవసరమైతే ఉందని ఆరోగ్య నిపుణులు సూచిస్తు్న్నారు.
లక్షణాలు, జాగ్రత్తలు
*హ్యూమన్ మెటాన్యూమో వైరస్ (HMPV) సోకిన వారిలో దగ్గు, జలుబు, జ్వరం, గొంతు నొప్పి, ముక్కు దిబ్బడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు తలెత్తుతాయి. అలాగనీ ఈ లక్షణాలున్నంత మాత్రాన కచ్చితంగా హెఎంపీవీనే అని అనుకోవాల్సిన అవసరం లేదు. వైద్య నిర్ధారణ పరీక్షల్లో తేలితేనే తెలుస్తుంది. ఎందుకంటే కోవిడ్ లక్షణాలు, సీజనల్ వ్యాధుల లక్షణాలు కూడా దాదాపు ఇలాగే ఉంటాయి.
*లక్షణాలు ఎక్కువగా ఉండి, శ్వాసలో సమస్యలు తలెత్తితే ఏమాత్రం నిర్లక్ష్యం చేయవద్దు. ఎందుకంటే.. క్రమంగా బ్రాంకైటిస్, న్యుమోనియా బారిన పడవచ్చు. ఈ ఇన్‌ఫెక్షన్లు కొద్ది రోజులు లేదా ఎక్కువరోజులు ఉండవచ్చు. ఇక హెచ్‌ఎంపీవీ వైరస్ కూడా కోవిడ్ 19 వైరస్ మాదిరి ఒకరి నుంచి మరొకరికి సోకుతుంది. దగ్గు, తుమ్ములు, లాలాజలం వంటి మార్గాల ద్వారా ఇతరులకు వ్యాపిస్తుంది. అందుకే వైరస్ సోకిన లక్షణాలు కనిపిస్తే షేక్ హ్యాండ్ ఇవ్వడం, హగ్ చేసుకోవడం, ఎదురెదురుగా ఉండి మాట్లాడటం వంటివి చేయకూడదని, మాస్క్ ధరించాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
ట్రీట్మెంట్ ఉందా?
హెచ్‌ఎంపీవీకి ప్రత్యేక చికిత్స అంటూ ఇప్పటి వరకైతే ఏదీ లేదు. శాస్త్రవేత్తలు గానీ, డబ్ల్యుహెచ్ఓ గానీ దానికి ప్రత్యేక చికిత్స అవసరమని ప్రకటించలేదు. కాకపోతే కోవిడ్ 19కు తీసుకున్న విధంగా జాగ్రత్తలు తీసుకోవాలని డబ్ల్యుహెచ్ఓ సహా వైద్య నిపుణులు సూచిస్తున్నారు. వైరస్ సోకినట్లు అనుమానం వస్తే దగ్గరలోని ఆస్పత్రికి వెళ్లి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలి. రెస్ట్ తీసుకోవడం, శరీరం డీహైడ్రేషన్‌కు గురికాకుండా చూసుకోవడం ద్వారా, జ్వరానికి తీసుకునే సాధారణ చికిత్స ద్వారానే ఇది నయమవుతుంది. అవసరాన్ని, తీవ్రవతను, ఆయా వ్యక్తుల్లోని రోగనిరోధక పరిస్థితిని బట్టి చికిత్స విధానాలు ఉంటాయని నిపుణులు వైద్య నిపుణులు చెబుతున్నారు. కాగా హెచ్ఎంపీవీ వైరస్ ఇప్పటికిప్పుడు కొత్తగా పుట్టుకొచ్చింది కాదు, 2001లోనే నెదర్లాండ్‌లో దీనిని గుర్తించినట్లు అమెరికన్ లంగ్ అసోసియేషన్ పేర్కొన్నది. వైరస్ సోకినప్పటికీ జాగ్రత్తలు తీసుకుంటూ సాధారణ చికిత్స తీసుకోవడం ద్వారా తగ్గిపోతుందని వెల్లడించింది. పిల్లలు, వృద్ధులు మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
*నోట్:పైవార్తలోని సమాచారం ఇంటర్నెట్ ఆధారంగా సేకరించడింది. ‘దిశ’ ధృవీకరించలేదు. అనుమానాలు ఉంటే వైద్య నిపుణులను సంప్రదించగలరు.