రేపటి నుంచే ఐపీఎల్-17 షురూ.. ప్రత్యేకతలివే

ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-17కు సమయం ఆసన్నమైంది.

Update: 2024-03-21 17:41 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రికెట్ ఫ్యాన్స్‌ ఎంతగానో ఎదురుచూస్తున్న ఐపీఎల్-17కు సమయం ఆసన్నమైంది. 10 జట్లు టైటిల్ వేటలో పోటీపడేందుకు సిద్ధమయ్యాయి. నేటి నుంచే ఐపీఎల్ సంబురం. ఓపెనింగ్ మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ చెన్నయ్ సూపర్ కింగ్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు తొలి మ్యాచ్‌లో తలపడబోతున్నాయి. ఈ మ్యాచ్‌కు చెన్నయ్‌లోని ఎంఏ చిదంబరం స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న ఈ రెండు జట్ల మధ్య పోరుతో ఈ సీజన్ తొలి మ్యాచ్‌తోనే అభిమానుల్లో ఉత్సాహం నింపనుంది. శుక్రవారం రాత్రి 8 గంటలకు మ్యాచ్ ప్రారంభంకానుంది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో బీసీసీఐ పూర్తి షెడ్యూల్‌ను విడుదల చేయలేదు. తొలి దశ షెడ్యూల్‌ను మాత్రమే బీసీసీఐ రిలీజ్ చేసింది. నేటి నుంచి ఏప్రిల్ 7 వరకు 21 మ్యాచ్‌లు జరగనున్నాయి. ఇందులో ఈ నెల 23, 24, 31 తేదీలతోపాటు ఏప్రిల్ 7న డబుల్ హెడర్ మ్యా్‌చ్‌లు జరగనున్నాయి. ఏప్రిల్ 7న లక్నో, గుజరాత్ మధ్య తొలి దశలో చివరి మ్యాచ్ జరగనుంది. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రిలీజ్ కావడంతో త్వరలోనే రెండో దశ మ్యా్చ్‌ల వివరాలను బీసీసీఐ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

ప్రారంభ వేడుకల్లో రెహమాన్, అక్షర్ కుమార్

ఓపెనింగ్ మ్యాచ్‌కు ముందు ప్రారంభ వేడుకలను బీసీసీఐ ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేసింది. శుక్రవారం సాయంత్రం 6:30 గంటలకు ఓపెనింగ్ సెర్మనీ ప్రారంభమవుతుంది. ఎప్పటిలాగే బాలీవుడ్ స్టార్స్, ప్రముఖ గాయకులు తమ పర్ఫామెన్స్‌తో ఆడియన్స్‌ను ఉర్రూతలూగించనున్నారు. ఆస్కార్ అవార్డు విన్నర్ ఏఆర్ రెహమాన్‌తోపాటు సింగర్ సోనూ నిగమ్, బాలీవుడ్‌ హీరోలు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్ పర్ఫామ్ చేయనున్నారు. అలాగే, స్వీడన్‌కు చెందిన డీజే ఆక్స్‌వెల్ తొలి ఇన్నింగ్స్ తర్వాత ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేయనున్నాడు.

కెప్టెన్‌గా కాదు.. ఆటగాళ్లుగా

ఈ సీజన్‌లో ఎం.ఎస్ ధోనీ, రోహిత్ శర్మలను ఆటగాళ్లుగా మాత్రమే చూడబోతున్నాం. ధోనీ సీఎస్కే కెప్టెన్సీ నుంచి తప్పుకోగా.. ముంబై ఫ్రాంచైజీ రోహిత్‌‌ను పక్కనపెట్టి పాండ్యాకు పగ్గాలు అప్పగించింది. గత సీజన్ వరకు కెప్టెన్‌గా, ఆటగాడిగా రెండు బాధ్యతలు మోసిన వీరు ఈ సీజన్‌లో కేవలం ప్లేయర్లుగానే అలరించనున్నారు. కెప్టెన్సీ భారం లేకపోవడంతో రోహిత్ మైదానంలో మెరుపులు మెరిపిస్తాడని అభిమానులు అనుకుంటున్నారు.

వీళ్లు తిరిగొచ్చారు

గాయాల కారణంగా గత సీజన్‌కు దూరమైన పలువురు భారత స్టార్ క్రికెటర్లు ఈ సీజన్‌ ఆడబోతున్నారు. 2022 డిసెంబర్‌లో రోడ్డు ప్రమాదంలో తీవ్రం గాయపడిన ఢిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ రిషబ్ పంత్ గత సీజన్‌కు దూరమయ్యాడు. దాదాపు 14 నెలలపాటు అతను ఆటకు దూరయ్యాడు. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న అతను ఐపీఎల్‌తో పునరాగమనం చేయబోతున్నాడు. దీంతో అభిమానులు అతనిపై స్పెషల్ ఫోకస్ పెట్టనున్నారు. మరి, బ్యాటుతో అతను గత మెరుపులను గుర్తు చేస్తాడో లేదో చూడాలి. అలాగే, ముంబై ఇండియన్స్ పేసర్ జస్ప్రిత్ బుమ్రా, కోల్‌‌కతా నైట్‌రైడర్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ వెన్నెముక గాయాలతో గత సీజన్ ఆడలేదు. వీరు కూడా అందుబాటులోకి వచ్చారు. భీకర ఫామ్‌లో ఉన్న బుమ్రా తన పేస్‌తో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తాడో చూడాలి. అలాగే, కోల్‌కతా సారథిగానే కాకుండా అయ్యర్ ఆటగాడిగానూ నిరూపించుకోవాల్సి ఉంది. బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్ కోల్పోయిన అయ్యర్‌కు టీ20 వరల్డ్ కప్‌‌ జట్టులో చోటు దక్కాలంటే ఐపీఎల్ చాలా కీలకం కానుంది.

హైదరాబాద్‌లో, వైజాగ్‌లో రెండేసి మ్యాచ్‌లు

తొలి దశ షెడ్యూల్‌లో హైదరాబాద్, వైజాగ్ వేదికలుగా ఎంపికైన విషయం తెలిసిందే. హైదరాబాద్, వైజాగ్‌లో రెండేసి మ్యాచ్‌లు జరగనున్నాయి. ఉప్పల్ స్టేడియంలో ఈ నెల 27న ముంబైతో, ఏప్రిల్ 5న చెన్నయ్‌తో సన్‌రైజర్స్ హైదరాబాద్ తలపడనుంది. అలాగే, ఢిల్లీ క్యాపిటల్స్ వైజాగ్‌ను హోంగ్రౌండ్‌గా ఎంచుకున్న విషయం తెలిసిందే. దీంతో ఈ నెల 31న చెన్నయ్‌తో, ఏప్రిల్ 3న కోల్‌కతాతో ఢిల్లీ ఆడనుంది.

కొత్త రూల్స్ ఇవే

గత సీజన్‌లో ఇంపాక్ట్ ప్లేయర్ రూల్‌ను తీసుకొచ్చిన బీసీసీఐ ఈ సీజన్‌లో రెండు కొత్త రూల్స్‌ను అమలు చేయనుంది. ప్రతి ఓవర్‌కు రెండు బౌన్సర్లు, స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను తీసుకరానుంది. గతంలో ప్రతి ఓవర్‌కు ఒక్క బౌన్సర్ మాత్రమే వేయాలనే నిబంధన ఉండగా.. ఇక, నుంచి రెండు బౌన్సర్లకు అనుమతించనున్నారు. ఇది బౌలర్లకు అనుకూలంగా మారనుంది. అలాగే, రివ్యూ సమయంలో సమయం వృథా అవడం, అంపైర్ తప్పిదాలకు చెక్ పెట్టేలా బోర్డు స్మార్ట్ రీప్లే సిస్టమ్‌ను అమలు చేయనుంది. ఈ పద్ధతి ప్రకారం.. టీవీ అంపైర్ నేరుగా హాక్ ఐ ఆపరేటర్స్ నుంచి సమాచారం తీసుకుంటారు. వీరు ఒకే రూంలో ఉంటారు. దీనిద్వారా టీవీ అంపైర్ స్ప్లిట్ స్కీన్ ఇమేజెస్, అత్యంత స్పష్టంగా ఉండే విజువల్స్, కావాల్సిన యాంగ్‌లో చూడొచ్చు. దీంతో నిర్ణయాలు వేగంగా, కచ్చితత్వంతో తీసుకోవడానికి వీలు ఉంటుంది.

Tags:    

Similar News