PKL 2024 : సెమీస్‌కు దూసుకెళ్లిన పాట్నా, యూపీ

ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో పాట్నా పైరేట్స్, యూపీ యోధాస్ సెమీస్‌లో అడుగుపెట్టాయి.

Update: 2024-12-26 17:55 GMT

దిశ, స్పోర్ట్స్ : ప్రొ కబడ్డీ లీగ్(పీకేఎల్) 11వ సీజన్‌లో పాట్నా పైరేట్స్, యూపీ యోధాస్ సెమీస్‌లో అడుగుపెట్టాయి. గురువారం ఎలిమినేటర్ మ్యాచ్‌ల్లో యు ముంబాపై పాట్నా, జైపూర్ పింక్ పాంథర్స్‌పై యూపీ విజయాలు నమోదు చేశాయి. మొదట ఎలిమినేటర్-1లో యూపీ 46-18 తేడాతో జైపూర్‌ను చిత్తుగా ఓడించింది. రైడర్ భవానీ రాజ్‌పుత్ 12 పాయింట్లతో చెలరేగాడు. అలాగే హితేశ్(6), సుమిత్(5), గంగన్ గౌడ(5) మెరవడంతో యూపీ మొదటి నుంచి చివరి వరకూ ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రేక్షక పాత్రకే పరిమితమైన జైపూర్ నాలుగుసార్లు ఆలౌటైంది. యూపీకి వరుసగా ఇది ఐదో విజయం. మరోవైపు, ఆసక్తికరంగా సాగిన ఎలిమినేటర్-2లో పాట్నా 31-23 తేడాతో యు ముంబాపై గెలుపొందింది. ఫస్టాఫ్‌లో 17-11తో ఆధిక్యం సాధించిన పాట్నా.. సెకండాఫ్‌లో యు ముంబా నుంచి ప్రతిఘటన ఎదుర్కొన్నప్పటికీ లీడ్ కాపాడుకుంది. రైడర్లు అయాన్(10), దేవాంక్(8) పాట్నా విజయంలో కీలక పాత్ర పోషించారు. పాయింట్స్ టేబుల్‌లో టాప్-2లో నిలిచిన హర్యానా స్టీలర్స్, దబాంగ్ ఢిల్లీ కేసీ ఇప్పటికే సెమీస్‌కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. నేడు సెమీస్ మ్యాచ్‌ల్లో హర్యానాతో యూపీయ ఢిల్లీతో పాట్నా తలపడనున్నాయి.


Tags:    

Similar News