చరిత్ర సృష్టించిన హర్మన్‌ప్రీత్ సేన .. తొలి ఇన్నింగ్స్‌లో 603/6 డిక్లేర్డ్

Update: 2024-06-29 12:50 GMT

దిశ, స్పోర్ట్స్ : సౌతాఫ్రికాతో ఏకైక టెస్టును దక్కించుకునే దిశగా భారత మహిళల జట్టు‌ బలమైన పునాది వేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసి మ్యాచ్‌పై పట్టు సాధించింది. శనివారం ఓవర్‌నైట్ స్కోరు 525/4తో ఆట కొనసాగించిన భారత్ తొలి సెషన్‌లోనే 603/6 స్కోరు వద్ద డిక్లేర్డ్ ఇచ్చింది. ఓవర్‌నైట్ బ్యాటర్లలో హర్మన్‌ప్రీత్ కౌర్(69) హాఫ్ సెంచరీ పూర్తి చేయగా.. రిచా ఘోష్(86) తృటిలో సెంచరీని మిస్ చేసుకుంది. రిచా అవుటైన తర్వాత భారత్ తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్డ్ ఇచ్చింది.

తొలి రోజు షెఫాలీ వర్మ(205), స్మృతి మంధాన(149) రెచ్చిపోయిన విషయం తెలిసిందే. తొలి ఇన్నింగ్స్‌లో 603/6 స్కోరు చేసిన భారత్ చరిత్ర సృష్టించింది. మహిళల టెస్టు క్రికెట్ చరిత్రలో తొలి ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు చేసిన జట్టుగా రికార్డుకెక్కింది. ఈ రికార్డు ఈ ఏడాది దక్షిణాఫ్రికాపై ఆసిస్(575/9 డిక్లేర్డ్) నెలకొల్పగా తాజాగా భారత్ బద్దలుకొట్టింది.

రెండో రోజు తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన సౌతాఫ్రికా మహిళల జట్టు పోరాడుతోంది. శనివారం ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 72 ఓవర్లలో 236/4 స్కోరు చేసింది. సునె లూస్(65), మారిజన్నె కాప్(69 బ్యాటింగ్) హాఫ్ సెంచరీలతో రాణించారు. కాప్‌తోపాటు నాడిన్ డిక్లర్క్(27 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. తొలి ఇన్నింగ్స్‌లో సౌతాఫ్రికా ఇంకా 367 పరుగులు వెనుకబడి ఉన్నది. భారత బౌలర్లలో స్నేహ్ రాణా 3 వికెట్లతో సత్తాచాటింది. 

Similar News