దిశ, స్పోర్ట్స్: జపాన్ బ్యాడ్మింటన్ స్టార్, మాజీ వరల్డ్ నం.1 కెంటో మొమోటా సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 29ఏళ్ల వయసున్న అతను.. అప్పుడే ఆటకు వీడ్కోలు పలుకుతున్నట్టు ప్రకటించాడు. అంతర్జాతీయ స్థాయి టోర్నీల నుంచి రిటైర్ అవుతున్నట్లు గురువారం వెల్లడించాడు. రెండుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన కెంటో.. నాలుగేళ్ల క్రితం జరిగిన కారు ప్రమాదం నుంచి పూర్తిగా కోలుకోలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశాడు. గాయాలు వెంటాడుతున్నాయని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్‌లో ఇప్పటికే చోటు కోల్పోయిన కెంటో.. వచ్చే నెల చైనాలో జరగనున్న థామస్ కప్‌లో తన చివరి అంతర్జాతీయ టోర్నీ ఆడనున్నాడు. తాజా నిర్ణయంతో కెంటో ఇకపై జపాన్ దేశీయ టోర్నీల్లోనే ఆడనున్నాడు. 2019లో ఏకంగా 11 టైటిళ్లు సాధించిన కెంటో.. జపాన్ బ్యాడ్మింటన్‌లో సంచలనం సృష్టించాడు. కాగా, 2020 జనవరిలో మలేషియా మాస్టర్స్ టైటిల్ గెలిచిన గంటల వ్యవధిలోనే కౌలాలంపూర్ విమానాశ్రయానికి చేరుకునే క్రమంలో అతడు ప్రయాణిస్తున్న కారు ఘోర రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారు డ్రైవర్ మృతిచెందగా, కెంటోకు తీవ్రగాయాలయ్యాయి. తీవ్రగాయాల నుంచి కొంతవరకు కోలుకుని మరో రెండు టైటిళ్లు సాధించాడు. అయితే, బలమైన గాయంతో కంటిచూపు మందగిస్తూ రావడంతో ఫామ్ కోల్పోయాడు. ఈ క్రమంలోనే తాజా నిర్ణయం తీసుకున్నాడు.