కోహ్లీ టెస్టు కెప్టెన్‌గా తప్పుకోవాల్సింది కాదు.. భారత మాజీ కోచ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సారథిగా సుదీర్ఘ కాలం కొనసాగాల్సిందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.

Update: 2024-08-25 13:03 GMT

దిశ, స్పోర్ట్స్ : టీమ్ ఇండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ టెస్టు సారథిగా సుదీర్ఘ కాలం కొనసాగాల్సిందని భారత మాజీ బ్యాటింగ్ కోచ్ సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు. టీ20 వరల్డ్ కప్-2021 తర్వాత విరాట్ టీ20 పగ్గాలను విడిచిపెట్టగా.. కొన్ని రోజులకే సెలెక్టర్లు వన్డే కెప్టెన్‌గా తప్పించారు. 2022 జనవరిలో కోహ్లీ టెస్టు కెప్టెన్సీకి కూడా వీడ్కోలు పలికి అందరికీ షాకిచ్చాడు. దీంతో రోహిత్ మూడు ఫార్మాట్ల కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

తాజాగా ఓ పాడ్ కాస్ట్‌లో సంజయ్ బంగర్ మాట్లాడుతూ.. విరాట్ 68 టెస్టుల్లో భారత్‌కు నాయకత్వం వహించాడని, మరికొంత కాలం అతను టెస్టు సారథిగా ఉండాల్సిందన్నాడు. టెస్టు జట్టును అతను అద్భుతంగా నడిపించాడని, కెప్టెన్సీ రికార్డు, నాయకత్వ లక్షణాలను దృష్టిలో పెట్టుకుని సుదీర్ఘ కాలం కెప్టెన్‌గా కొనసాగాల్సిందని అభిప్రాయపడ్డాడు. భారత టెస్టు క్రికెట్ విజయంలో గణనీయమైన సహకారం అందించేవాడని చెప్పాడు. కాగా, టెస్టు కెప్టెన్‌గా కోహ్లీ 68 టెస్టుల్లో భారత్‌కు 40 విజయాలు అందించాడు. విన్ పర్సంటేజ్ 58.82 ఉండటం విశేషం. అలాగే, విరాట్ నేతృత్వంలో భారత్ ఆసిస్ గడ్డపై తొలి టెస్టు సిరీస్ విజయం అందుకుంది. 2021లో వరల్డ్ టెస్టు చాంపియన్‌షిప్ ఫైనల్‌కు చేరింది. 

Tags:    

Similar News