ఇష్టారాజ్యంగా ‘స్మార్ట్’ నిధులు ఖర్చు

కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ నిధులు వృథాగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టవర్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల మేర స్మార్ట్ సిటీ కింద గుర్తించారు. కానీ నిధులు మాత్రం మూడు కిలో మీటర్ల అవతల ఖర్చు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వెనకాల రోడ్డు డ్యామేజీ కాకున్నా.. దానిని తొలిగించి మళ్లీ రోడ్డు వేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్న […]

Update: 2020-12-09 23:00 GMT

కరీంనగర్ పట్టణంలో స్మార్ట్ నిధులు వృథాగా ఖర్చు చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. టవర్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల మేర స్మార్ట్ సిటీ కింద గుర్తించారు. కానీ నిధులు మాత్రం మూడు కిలో మీటర్ల అవతల ఖర్చు చేస్తున్నారని స్థానికులు మండిపడుతున్నారు. ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వెనకాల రోడ్డు డ్యామేజీ కాకున్నా.. దానిని తొలిగించి మళ్లీ రోడ్డు వేస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ స్మార్ట్ సిటీ విషయంలో బల్దియా ఇంజినీరింగ్ అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై నగర ప్రజలు మండి పడుతున్నారు. స్మార్ట్ సిటీ నిధులు ఎలా ఖర్చు చేయాలో అర్థం కావడం లేదా.. లేక వాటిని సద్వినియోగం చేయాలన్న ఆలోచన లేదా అని ప్రశ్నిస్తున్నారు. పట్టుమని మూడేళ్లు కాకముందే వేసిన రోడ్డును తొలగించి మరీ స్మార్ట్ సిటీ నిధులతో మళ్లీ రోడ్డు వేసేందుకు సిద్ధం అవుతున్న తీరు కరీంనగర్ కార్పొరేషన్‌కే చెల్లింది. ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వెనక రోడ్డు నుంచి రాంనగర్ వరకు మూడేళ్ల క్రితమే వేసిన ఈ రోడ్డు డ్యామేజీ కాకపోయినా దానిని పెకిలించి మరీ కొత్త రోడ్డు వేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

స్మార్ట్ సిటీ పరిధిలో లేకున్నా..

కరీంనగర్ టవర్ సర్కిల్ నుంచి మూడు కిలోమీటర్ల పరిధిని మాత్రమే స్మార్ట్ సిటీగా గుర్తించారు. ఆ పరిధిలో మాత్రమే స్మార్ట్ సిటీ నిధులు వెచ్చించి ప్రజలకు మౌళిక సదుపాయాలు కల్పించాల్సి ఉంటుంది. కానీ స్మార్ట్ సిటీ పరిధిలో లేని ఉమెన్స్ డిగ్రీ కాలేజీ వెనుక రోడ్డుకు ఈ నిధులు కేటాయించడం నిబంధనలకు విరుద్దమని పలువురు ఆరోపిస్తున్నారు. కాగా, పటిష్టంగా ఉన్న రోడ్డును పెకిలించి మరీ కొత్త రోడ్డు నిర్మాణానికి శ్రీకారం చుడుతుండడం విస్మయం కలిగిస్తోంది. బల్దియా ఇంజినీరింగ్ అధికారులు స్మార్ట్ నిధులను ఖర్చు చేయడంలో ప్రణాళికలు సరిగా చేయలేదనే విమర్శలు ఉన్నాయి.

కేవలం రోడ్లేనా..?

మౌళిక వసతులు కల్పించాలన్న లక్ష్యంతో స్మార్ట్ సిటీ స్కీంను కేంద్రం ఏర్పాటు చేసింది. అయితే కరీంనగర్ బల్దియా అధికారులు మాత్రం ఈ స్కీం ద్వారా కేవలం రోడ్లను నిర్మించేందుకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇతరత్రా వసతులను ఏర్పాటు చేసే అవకాశం ఉన్నా ఇంజినీరింగ్ అధికారులు ఆ దిశగా ఎందుకు ఆలోచించడం లేదో అంతు చిక్కకుండా తయారైంది.

నిధులు వృథా చేస్తున్నరు

కరీంనగర్ కార్పొరేషన్ యంత్రాంగం స్మార్ట్ సిటీ నిధులను వృథా చేస్తున్నారు. ఎలా ఖర్చు చేయాలో ప్లాన్ వేసుకోనట్లు స్పష్టం అవుతోంది. బాగున్న రోడ్లను పెకిలించి మరీ కొత్త రోడ్లను వేయడం ఎందుకు?. నిధుల వినియోగంపై సమగ్ర దర్యాప్తు చేసి బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవాలి.

-వామన్ ప్రదీప్ రెడ్డి, కరీంనగర్

ఆ ఏరియాలో ఖర్చెందుకు?

స్మార్ట్ సిటీ స్కీం పరిధిలోకి రాని ఏరియాలో స్మార్ట్ సిటీ నిధులు ఎందుకు ఖర్చు చేస్తున్నారు. ఒకవేళ చేసినా పటిష్టంగా ఉన్న రోడ్డును తొలగించి మరీ కొత్త రోడ్డు వేయడం ఎందుకు. ఇష్టం వచ్చిన రీతిలో డబ్బులు ఖర్చు చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. పట్టణంలో ఉన్న సమస్యలపై దృష్టి సారించాలి.

-యువ క్రాంతి గౌడ్, కరీంనగర్

Tags:    

Similar News