తెరపైకి మళ్లీ బాల్ ట్యాంపరింగ్ వ్యవహారం

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తీవ్ర విమర్శల పాలైంది. ‘సాండ్‌పేపర్‌ గేట్’ గా తీవ్ర దుమారం రేపిన ఆ ఘటనలో ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఆనాడే ఈ విషయం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌కు కూడా తెలుసని చెప్పాడు. బాన్‌క్రాఫ్ట్ ఆ రోజు ఒక సాండ్ పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమేరాలకు చిక్కాడు. దీంతో ఐసీసీ […]

Update: 2021-05-15 07:40 GMT

దిశ, స్పోర్ట్స్ : దక్షిణాఫ్రికాలో పర్యటించిన ఆస్ట్రేలియా జట్టు కేప్‌టౌన్‌లో జరిగిన టెస్టులో బాల్ ట్యాంపరింగ్‌కు పాల్పడి తీవ్ర విమర్శల పాలైంది. ‘సాండ్‌పేపర్‌ గేట్’ గా తీవ్ర దుమారం రేపిన ఆ ఘటనలో ఆస్ట్రేలియా క్రికెటర్ కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ నేరానికి పాల్పడినట్లు ఒప్పుకున్నాడు. ఆనాడే ఈ విషయం కెప్టెన్ స్టీవ్ స్మిత్‌తో పాటు డేవిడ్ వార్నర్‌కు కూడా తెలుసని చెప్పాడు. బాన్‌క్రాఫ్ట్ ఆ రోజు ఒక సాండ్ పేపర్‌తో బంతిని రుద్దుతూ కెమేరాలకు చిక్కాడు. దీంతో ఐసీసీ విచారణ చేపట్టగా.. ఆనాటి వైస్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ ప్రోత్సహిస్తేనే బాల్ టాంపర్ చేశానని.. అది జరుగుతున్న సమయంలో స్టీవ్ స్మిత్‌ను సైలెంట్ గా ఉండమని ముందుగానే హెచ్చరించినట్లు కూడా కామెరూన్ చెప్పాడు. ఆనాటి విచారణ ఆధారంగా బాన్‌క్ట్రాఫ్ట్‌పై 9 నెలల నిషేధం విధించారు. అంతే కాకుండా స్టీవ్ స్మిత్, డేవిడ్ వార్నర్‌లపై ఏడాది పాటు నిషేధం విధించారు. ఏడాది తర్వాత వారిద్దరూ జట్టులోకి తిరిగి వచ్చినా కెప్టెన్సీ, వైస్ కెప్టెన్సీని మాత్రం క్రికెట్ ఆస్ట్రేలియా కట్టబెట్టలేదు. సాండ్ పేపర్ వివాదం ముగిసిందని భావిస్తుండగా.. ఆ తేనెతుట్టెను బాన్‌క్రాఫ్ట్ మరోసారి కదిలించాడు.

బౌలర్లకూ తెలుసు..!

సాండ్ పేపర్ వివాదం గురించి బాన్‌క్రాఫ్ట్ మరోసారి ఒక అంతర్జాతీయ పత్రికతో మాట్లాడాడు. తాను ట్యాంపరింగ్ చేస్తున్నట్లు స్టీవ్ స్మిత్, వార్నర్‌తో పాటు బౌలర్లకు కూడా తెలుసని అంగీకరించాడు. అయితే ఆనాటి వివాదానికి తానొక్కడినే బాధ్యత తీసుకోవాలని ముందు నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. బంతిని ట్యాంపరింగ్ చేస్తే లాభపడేది బౌలర్లే.. ఆ విషయం కచ్చితంగా వారికి తెలుసు. అది వివరంగా అందరికీ చెప్పాల్సిన అవసరం లేదని బాన్‌క్రాఫ్ట్ అన్నాడు. ఆ రోజు జట్టులోని అందరి చేత ప్రశంసలు పొందాలి.. నేనొక ముఖ్యమైన ఆటగాడిగా గుర్తింపు పొందాలనే తపనతోనే ఆ తప్పుడు పని చేశాను. కానీ తాను తప్పు చేయడానికి ఎంత లోతుల్లోకి దిగజారి పోయానో అన్న విషయం ఆ రోజు తెలియలేదు. ఒక వేళ ముందే గుర్తించి ఉంటే కచ్చితంగా ఆ పని చేసే వాడిని కాదని కామెరూన్ బాన్‌క్రాఫ్ట్ చెప్పుకొచ్చాడు. ‘బంతి ఆకారం మారినప్పుడు తొలుత తెలిసేది బౌలర్లకే. అలా జరిగితే ముందుగా కెప్టెన్‌తో మాట్లాడతారు. ఆ రోజు బంతి ఆకారం మారిన విషయం వారికి అర్దం అయ్యింది. స్టీప్ స్మిత్‌తో మాట్లాడినా.. అతడు కూడా కుట్రలో భాగమే కాబట్టి వారికి సర్ది చెప్పి ఉంటాడని’ బాన్ క్రాఫ్ట్ అన్నాడు.

మళ్లీ విచారణ..

ది గార్డియన్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాన్ క్రాఫ్ట్ పలు విషయాలు వెల్లడించడంతో క్రికెట్ ఆస్ట్రేలియా అప్రమత్తమైంది. ఈ వివాదం మరింత ముదరక ముందే విచారణ చేపట్టాలని నిర్ణయించింది. 2018లో బాల్ టాంపరింగ్ వ్యవహారం బయటకు రాగానే అందుకు కారణమైన ముగ్గురిపై వేటు పడింది. ఆ తర్వాత కాలంలో కోచ్ డారెన్ లీమాన్, హై పెర్ఫార్మెన్స్ బాస్ పాట్ హోవార్డ్, క్రికెట్ ఆస్ట్రేలియా బోర్డ్ డైరెక్టర్ మార్క్ టేలర్ కూడా రాజీనామా చేశారు. స్మిత్, వార్నర్ 2019 వన్డే వరల్డ్ కప్‌లో తిరిగి జట్టుతో చేరారు. కానీ బాన్‌క్రాఫ్ట్ ఇంకా జట్టులో స్థానం కోసం పోరాడుతూనే ఉన్నాడు. ఆ రోజు టెస్ట్ మ్యాచ్ ఆడిన ఆస్ట్రేలియా బౌలర్లు మిచెల్ స్టార్క్, జోష్ హాజెల్‌వుడ్, పాట్ కమిన్స్, నాథన్ లయన్, మిచెల మార్ష్‌లకు ఈ విషయం తెలుసని తాజాగా బాన్ క్రాఫ్ట్ వెల్లడించాడు. దీంతో క్రికెట్ ఆస్ట్రేలియా తాజా విచారణ ప్రారంభించింది. బాల్ ట్యాంపరింగ్ జరిగిందని తెలిసినా బంతులు విసరడం కూడా నేరమే. ఒక వేళ అదే తేలితే ఆ బౌలర్లందరిపై కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉన్నది.

Tags:    

Similar News