సారూ.. మా రోడ్డు తీరు చూడు జరా
గత రెండు సంవత్సరాలుగా రోడ్డు పనులు నిర్వహిస్తూ అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని దాసు తండా, రేగుల తండా గ్రామస్తులు అడ్డుకున్నారు

దిశ, టేకులపల్లి: గత రెండు సంవత్సరాలుగా రోడ్డు పనులు నిర్వహిస్తూ అసంపూర్తిగా ఉన్న రోడ్డు పనులు త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ వాహనాన్ని దాసు తండా, రేగుల తండా గ్రామస్తులు అడ్డుకున్నారు. టేకులపల్లి మండల పరిధిలో బోడు గ్రామంలో వివిధ పనులను పరిశీలించేందుకు టేకులపల్లి మండల కేంద్రం మీదుగా బోడు వెళ్తున్న జిల్లా కలెక్టర్ వాహనాన్ని దాస్ తండా గ్రామపంచాయతీ పరిధి రేగుల తండా దాస్ తండా గ్రామస్తులు రోడ్డుపై నిలబడి కలెక్టర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ తో మాట్లాడుతూ.. రెండు సంవత్సరాల క్రితం ప్రారంభించిన పనులు మధ్యలోనే అసంపూర్తిగా వదిలేశారని వాపోయారు. ఈ మార్గంలో కోయగూడెం ఓసి నుంచి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా ప్రతిరోజు క్రమం తప్పకుండా లారీలు, టిప్పర్లు నిరంతరం తిరుగుతుంటాయని, నిత్యం ప్రయాణాలు జరుగుతున్న రోడ్డును సైతం ఇలా మధ్యలో వదిలేయడం తో ప్రయాణం నరకప్రాయంగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాకుండా రోడ్డుపై ఉన్న దుమ్ము ధూళి ఇంట్లోకి చేరి అనారోగ్యానికి గురవుతున్నామని త్వరగా నిర్మాణ పనులు పూర్తి చేయాలని కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ వారితో మాట్లాడుతూ.. వారం రోజుల్లో తారు రోడ్డు నిర్మాణ పనులు పూర్తి చేపిస్తామని హామీ ఇచ్చారు. కలెక్టర్ హామీతో గ్రామస్తులు తప్పుకున్నారు.