అక్రమ నిర్మాణం వల్లే ప్రమాదం..ఆరుగురు కాదు.. ఇద్దరు మృతి..!
భద్రాచలంలో జరిగిన ఘోర ప్రమాదంలో ఇద్దరు చనిపోయినట్లు పోలీసులు తెలిపారు..

దిశ, వెబ్ డెస్క్: భద్రాచలం(Badrachalam) బోనాలవీధి(Bonal Street)లోని పంచాయతీ కార్యాలయం(Panchayat Office) సమీపంలో జరిగిన ప్రమాదంలో ఆరుగురు చనిపోయారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఇద్దరు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. శ్రీపాద శ్రీనివాసరావు అనే వ్యక్తికి చెందిన బిల్డింగ్ నిర్మాణ దశలో ఉండగా ఒక్కసారిగా కుప్పకూలింది. జీప్లస్+2కు పర్మిషన్ తీసుకుని ఐదంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు. ట్రస్టు పేరుతో విరాళాలు సేకరించి భవనాన్ని చేపట్టారు. ఈ అక్రమ కట్టడాన్ని గతంలోనే అధికారులు అడ్డుకున్నారు. సామాజిక కార్యకర్త చేసిన ఫిర్యాదుతో అధికారులు అడ్డుకునేందుకు ప్రయత్నం చేశారు.
అయితే యాజమాని శ్రీనివాసరావు బెదిరింపులకు దిగారు. ఖబడ్దార్ అంటూ హెచ్చరించారు. దీంతో కొంతకాలం ఈ నిర్మాణం ముందుకు సాగలేదు. తాజాగా శ్రీపాద శ్రీనివాసరావు మళ్లీ నిర్మాణం చేపట్టారు. దీంతో ఘోర ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఘటన జరగడంతో శ్రీపాద శ్రీనివాసరావు పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఘటనా స్థలంలో ప్రొక్లెయిన్లతో శిథిలాలు తొలగిస్తున్నారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.