నిర్మాణంలో ఉన్న భవనం కూలి ముగ్గురు మృతి
భద్రాచలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది.

దిశ, భద్రాచలం : భద్రాచలంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. నిర్మాణంలో ఉన్న ఆరు అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో.. శిధిలాల కింద చిక్కుకొని ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు . పాత భవనం పునాదుల మీదే ఆరు అంతస్థుల కొత్త భవనం నిర్మించడంతో.. ఈ సంఘటన చేసుకున్నట్లు తెలుస్తుంది. శ్రీపతి నేషనల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో విజయ కనక దుర్గా భవాని ఆలయం, అనుబంధ భవనాన్ని నాలుగు సంవత్సరాలుగా నిర్మిస్తూనే ఉన్నారు. మూడు సంవత్సరాల క్రితం ఈ భవన నిర్మాణానికి పంచాయతీ అధికారులు ఆటంకం తెలిపినా కాని, భవన యజమాని అధికారులను మేనేజ్ చేసి నిర్మాణం కొనసాగిస్తున్నట్లు తెలిసింది. ప్రత్యక్ష సాక్షుల సమాచారం మేరకు భవనం కూలిపోయే సమయంలో ముగ్గురు వ్యక్తులు ఉన్నారని తెలిసింది. వారిలో ఒకరు తాపీ మేస్త్రి ఉపేందర్ (40) కాగా, మరో ఇద్దరు కూలీలు అని తెలుస్తుంది. ఇప్పటివరకు ఒక్క మృతదేహం కూడా బయటకు తీయలేదు. శిధిలాలను తొలగిస్తే గాని ఎంతమంది మృతి చెందారనేది తెలిసే అవకాశం ఉంది. కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఎస్పీ రోహిత్ రాజ్ సంఘటన స్థలానికి చేరుకొని పరిస్థితి శిధిలాలు తొలిగించేందుకు చర్యలు చేపడుతున్నారు.