లాక్ డౌన్ వేళ… ఇసుక దందా జోరు

దిశ, వరంగల్: లాక్ డౌన్ లో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోన్నది. యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు.‌‌ మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ఆకేరు వాగుపై కన్నేసిన అక్రమార్కులు ఇసుక లూటీ చేస్తున్నారు. మండలంలోని కొమ్ములవంచ, జయపురం, కౌసల్యాదేవిపల్లి గ్రామాలను ఆనుకుని ఉండే ఆకేరు వాగు నుంచి రాత్రి పూట ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతీ రోజు రాత్రి వేళల్లో వందల ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా […]

Update: 2020-05-07 06:50 GMT

దిశ, వరంగల్: లాక్ డౌన్ లో అక్రమార్కుల ఆగడాలకు అడ్డు లేకుండా పోతోన్నది. యథేచ్ఛగా తమ దందాను కొనసాగిస్తున్నారు.‌‌ మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులపేట మండలం ఆకేరు వాగుపై కన్నేసిన అక్రమార్కులు ఇసుక లూటీ చేస్తున్నారు. మండలంలోని కొమ్ములవంచ, జయపురం, కౌసల్యాదేవిపల్లి గ్రామాలను ఆనుకుని ఉండే ఆకేరు వాగు నుంచి రాత్రి పూట ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ప్రతీ రోజు రాత్రి వేళల్లో వందల ట్రిప్పుల ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికీ గుట్టు చప్పుడు కాకుండా ఈ దందా కొనసాగుతూనే ఉంది.

అధికారుల నిర్లక్ష్యం..!

నర్సింహులపేట వయా చిన్నగూడూర్ నుంచి మహబూబాబాద్, కురవికి, నర్సింహులపేట నుంచి తొర్రూర్ కి నిత్యం ఇసుక రవాణా జరుగుతోన్నది. లాక్ డౌన్ అమలులో ఉన్నప్పటికీ అక్రమార్కులు పట్టించుకోవడం లేదు. పదుల సంఖ్యలో ట్రాక్టర్లు, కూలీలు, నిత్యం తిరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం పట్ల విమర్శలు వినిపిస్తున్నాయి. ద్విచక్రవాహనంపై ఇద్దరు ప్రయాణిస్తే పట్టుకొని కేసులు పెట్టె అధికారులకు ట్రక్కులు, ట్రాక్టర్లు కనిపించడం లేదా అనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రజలు సమాచారం ఇస్తేగానీ అష్టకష్టంగా సంఘటనా స్థలానికి వెళ్తున్న అధికారులు అంతా ఓకే అన్నట్లుగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లా స్థాయి అధికారులు సైతం ఈ విషయంపై దృష్టి సారించకపోవడం పట్ల అనుమానాలు లేకపోలేదు.

సర్కార్ ఆదాయానికి గండి…..

ఆకేరు వాగు నుంచి ఇసుకను తరలించుకుపోతున్నా అక్రమార్కులు సర్కార్ ఆదాయానికి గండి కొడుతున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా దర్ఙాగా ఇసుక రవాణా చేస్తుండటం పట్ల ప్రజలు ఆశ్చర్యపోతున్నారు. ప్రజలు అధికారులకు సమాచారం ఇస్తే… అక్రమార్కులతో కుమ్ముక్కై నేరుగా వారి వివరాలు తెలియజేస్తూ కొత్త వివాదాలకు తెరతీస్తున్నట్లు తెలుస్తోన్నది. ఈ మేరకు సమాచారం అందించిన ప్రజలను టార్గెట్ చేసి ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ప్రచారంలో ఉంది. అంతేకాకుండా ఉన్నతాధికారులు చిత్తశుద్ధితో ఉన్నప్పటికీ వారిని బాద్నాం చేసే కార్యక్రమాలకు ఒడిగడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా జిల్లా యంత్రాంగం స్పందించి ఇసుకాసురుల భరతం పట్టాలని ప్రజలు కోరుతున్నారు.

Tags: Warangal, Sand, Smuggling, Tractors, Officers, Lockdown

Tags:    

Similar News