సమాధులనూ వదలని ఘనులు
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రామడుగు, మానేరు వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఫలితంగా వాగులో పాతిన శవాలు బయటపడుతున్నాయి. ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికార పార్టీనేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. సహజవనరులను దోచుకునే వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అడ్డుకునే వారు ఎవరూ లేరన్న ధీమాతో ఇసుక దందా […]
దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ లో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. ఎవరి పర్యవేక్షణ లేకపోవడంతో అక్రమ ఇసుక వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతోంది. రామడుగు, మానేరు వాగు నుంచి యథేచ్ఛగా ఇసుక రవాణా చేస్తున్నారు. ఫలితంగా వాగులో పాతిన శవాలు బయటపడుతున్నాయి. ఇసుక రవాణాను అడ్డుకోవాల్సిన అధికార పార్టీనేతలే కీలకంగా వ్యవహరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
సహజవనరులను దోచుకునే వారికి అడ్డూ అదుపు లేకుండా పోతోంది. అడ్డుకునే వారు ఎవరూ లేరన్న ధీమాతో ఇసుక దందా యథేచ్ఛగా సాగుతోంది. నియంత్రించే వారు కరువవడంతో మాఫియా రెచ్చిపోతోంది. కరీంనగర్ జిల్లాలోని రామడుగు మండల కేంద్రంలోని వాగులో జోరుగా ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ఏకంగా సమాధులను కూల్చి ఇసుక రవాణా చేస్తున్నారు. దీంతో వాగులో పూడ్చిన శవాలు బయట పడుతున్నాయి. గమనించిన స్థానికులు ఇసుక అక్రమ దందాను నిలురించాలని రామడుగు తహసీల్దారు, పోలీసులకు పిర్యాదు చేశారు. కుక్కలు శవాలను పీక్కుని వస్తున్న పరిస్థితి రామడుగు వాగులో కనిపించిందని స్థానికులు వాపోతున్నారు. అర్థరాత్రి వేళల్లో దర్జాగా ఇసుక దందా కొనసాగిస్తుండటంతోనే ఈ పరిస్థితి తయారైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అధికార పార్టీ నాయకులే దందాలో..
కరీంనగర్ సమీపంలోని మానేరు వాగు మీదుగా కూడా ఇసుక అక్రమ దందా కొనసాగుతోంది. అధికార పార్టీకి చెందిన నాయకులు దర్జాగ ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. పట్టణంలో ఇసుకకు డిమాండ్ ఉండటంతో మానేరు నది నుంచి రోజుకు 200 ట్రాక్టర్లలో ఇసుకను అక్రమంగా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టర్‌కు రూ. 3 వేల నుంచి రూ. 4వేలు మార్కెట్‌లో పలుకుతుండటంతో ఇసుక దందా చేస్తున్నారు. పది రోజుల క్రితం కరీంనగర్ సమీపంలోని తీగల వంతెన వద్ద ఇసుక మాఫియా గొడవ పడిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వ్యవహరంలో అధికారపార్టీ కార్పొరేటర్, మరో కార్పొరేట్ కొడుకు కూడా ప్రత్యక్ష్యంగా పాల్గొన్నా పట్టించుకునే వారు లేకుండా పోయారు.
లారీ ట్రిప్పుకు రూ.లక్ష..
కరీంనగర్ నుంచి హైదరాబాద్‌కు అక్రమంగా తరలివెళ్తున్న ఇసుకకు ఫుల్లు డిమాండ్ ఉంది. ఒక్కో లారీకి రూ.లక్ష వరకు ధర పలుకుతుండటంతో అక్రమ దందా చేసేవారికి కాసుల పంట పండుతున్నది. ట్రాక్టర్లలో మానేరు నది నుంచి ఇసుకను తరలించి సమీప గ్రామాల్లో డంప్‌లను ఏర్పాటు చేసుకుంటున్నారు. డంప్‌లకు చేరిన ఇసుకను యథేచ్ఛగా లారీల్లో హైదరాబాద్‌కు రవాణా చేస్తున్నారు. కరీంనగర్ నుంచి అక్రమంగా రోజుకు 500 లారీల వరకు ఇసుక హైదరాబాద్‌కు తరలి వెళ్తోందని ప్రచారం జరుగుతోంది. కరీంనగర్ సమీపంలోని మానేరు నది పరీవాహ ప్రాంతం అంతా కూడా ఇసుక రవాణా చేసే ట్రాక్టర్లతో బిజీబిజీగా ఉంటున్నా పట్టించుకునే వారు లేరు. మైనింగ్ అధికారులు ఇసుక మాఫియాపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.