టీఆర్ఎస్‌కు జమ్మికుంట ‘రెడ్డి’ టెన్షన్.. కేసీఆర్ లొంగుతారా..?

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ టికెట్ ఎవరికి ఇస్తే వారి గెలుపు కోసం పార్టీ శ్రేణులన్ని పనిచేయడం కామన్. కానీ ఇక్కడ మాత్రం సరికొత్త నినాదం మొదలైంది. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆలోచించాలని సూచిస్తున్నారు వీరు. రాష్ట్రంలో మొదటిసారిగా జమ్మికుంట మండలం రెడ్డి కుల ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెడ్లకే ఉపఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇవ్వాలని సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కీలక మండలమైన జమ్మికుంటలోని నేతలకు […]

Update: 2021-08-06 10:14 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్ : టీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ టికెట్ ఎవరికి ఇస్తే వారి గెలుపు కోసం పార్టీ శ్రేణులన్ని పనిచేయడం కామన్. కానీ ఇక్కడ మాత్రం సరికొత్త నినాదం మొదలైంది. సీఎం కేసీఆర్ తీసుకునే నిర్ణయంపై ఆలోచించాలని సూచిస్తున్నారు వీరు. రాష్ట్రంలో మొదటిసారిగా జమ్మికుంట మండలం రెడ్డి కుల ప్రతినిధులు తమ ప్రాంతంలోని రెడ్లకే ఉపఎన్నికల్లో గులాబీ పార్టీ టికెట్ ఇవ్వాలని సరికొత్త వాదనను తెరమీదకు తెచ్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలోని కీలక మండలమైన జమ్మికుంటలోని నేతలకు ఇప్పటివరకు రాజకీయంగా సరైన ప్రాధాన్యం దక్కడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటివరకు కమలాపూర్, హుజురాబాద్ నియోజకవర్గాలకు ప్రాతినిథ్యం వహించిన ఎమ్మెల్యేలు వీణవంక, కమలాపూర్, హుజురాబాద్ మండలాలకు చెందిన నాయకులే ఎక్కువగా ఉన్నారని సంఘం ప్రతినిధులు చెప్పారు. ఈసారి జమ్మికుంట మండలంలోని రెడ్డి కులస్తులకు ప్రాధాన్యం ఇవ్వాలని శుక్రవారం జరిగిన రెడ్డి కులస్తులు ఆత్మీయ సమ్మేళనంలో టీఆర్ఎస్ రెడ్డి నేతలు డిమాండ్ చేశారు. ఇటీవల కేటాయించిన నామినేటెడ్ పదవుల్లోనూ ఎక్కువగా వీణవంక, హుజురాబాద్ మండలాల నాయకులకే ప్రాధాన్యత కల్పించారని వారు గుర్తు చేశారు.

వీణవంక మండలానికి చెందిన కౌశిక్ రెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇవ్వడం, హుజురాబాద్ మండలానికి చెందిన బండ శ్రీనివాస్‌కు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చారన్నారు. నియోజకవర్గంలో పెద్ద మండలమైన జమ్మికుంట మండల నాయకునికే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరుతున్నారు. వీణవంక మండలంలోని కౌశిక్ రెడ్డికి ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇచ్చారని, మళ్ళీ అదే మండలానికి చెందిన గెల్లు శ్రీనివాస్‌కు టికెట్ ఇస్తారన్న ప్రచారం జరుగుతోందని రెడ్డి నేతలు వ్యాఖ్యానించారు. ఒకవేళ అదే నిజమైతే అన్ని పదవులు వీణవంక మండలానికే ఇస్తారా..? అన్న వాదన లేవనెత్తుతారన్నారు. గతంలో కమలాపురం మండలానికి చెందిన ఈటల రాజేందర్ 18 ఏళ్ల పాటు, వీణవంక మండలం చెందిన ముద్దసాని దామోదర్ రెడ్డి 16 సంవత్సరాలు, హుజరాబాద్ మండలానికి చెందిన కెప్టెన్ లక్ష్మీకాంతరావు ఐదు సంవత్సరాలు ఎమ్మెల్యేలుగా వ్యవహరించారంటూ సరికొత్త లాజిక్ వినిపిస్తున్నారు. ఇక ఇల్లందకుంట, జమ్మికుంట మండలాల నుంచి ఇప్పటివరకు కీలక పదవుల్లో ప్రాధాన్యం లేనందున ఈ సారి టికెట్ ఈ మండలాల్లోని రెడ్డి కులస్తులకు ఇస్తే బాగుంటుందన్న డిమాండ్ చేశారు. ఇవాళ్టి రెడ్డి కులస్తుల ఆత్మీయ సమ్మేళనంలో అన్ని పార్టీలకు చెందిన నేతలు పాల్గొన్నప్పటికీ, టీఆర్ఎస్‌కు చెందిన మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ తుమ్మేటి సమ్మిరెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు వెంకట్ రెడ్డి, ధర్మారం ప్రాథమిక సహకార సంఘం అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి తమ గళాన్ని వినిపించారు.

గెల్లుకు చెక్ పెడ్తారా..?

జమ్మికుంటలో రెడ్డి సంఘం ప్రతినిధులు కొత్తగా తెరపైకి తీసుకొచ్చిన ఈ అంశం ఇప్పుడు అధిష్టానానికి తలనొప్పిగా మారనుందని చెప్పక తప్పదు. స్థానికత, తమ సామాజికవర్గం అన్న అంశాన్ని లేవనెత్తడం వల్ల సీఎం కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనన్న చర్చ సాగుతోంది. బీసీ అభ్యర్థి, ఉద్యమకారుడు, టీఆర్ఎస్వీ నాయకుడు అన్న విషయాలను పరిగణనలోకి తీసుకుని గెల్లు శ్రీనివాస్ యాదవ్ అభ్యర్థిత్వాన్ని దాదాపుగా ఖరారు చేశారు. అయితే రెడ్డి కుల సంఘం చేస్తున్న డిమాండ్‌ను పరిగణనలోకి తీసుకోకుండా గెల్లు అభ్యర్థిత్వాన్నే ఖరారు చేస్తే జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత వచ్చే అవకాశాలు లేకపోలేదు. దీంతో అధిష్టానం ఎలాంటి వ్యూహాన్ని ప్రదర్శిస్తుందోనన్న ఉత్కంఠ మొదలైంది. గెల్లును ప్రకటించకపోతే యాదవ సామాజిక వర్గంతో పాటు బీసీల్లో వ్యతిరేకత వచ్చే అవకాశాలు ఉంటాయి. ఆయనకే ఇస్తే రెడ్డి సామాజిక వర్గంతో పాటు జమ్మికుంట, ఇల్లందకుంట మండలాల వాసులు స్థానికత అంశాన్ని టీఆర్ఎస్ పట్టించుకోలేని వ్యతిరేకతను మూటగట్టుకోక తప్పని పరిస్థితి ఎదురుకాక తప్పదు. దీంతో టీఆర్ఎస్ అధిష్టానం పరిస్థితి ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్న చందంగా మారింది.

 

 

Tags:    

Similar News