రైతులను ఉగ్రవాదుల్లా చూస్తున్నారు.. ఆర్.నారాయణ మూర్తి ఫైర్
దిశ, మహబూబాబాద్: దేశానికి అన్నం పెట్టే రైతన్నను గౌరవించాల్సిన ప్రభుత్వాలు వారిని ఉగ్రవాదుల్లాగా చిత్రీకరిస్తూ దాడులకు పాల్పడుతున్నాయని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి ధ్వజమెత్తారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతన్న సినిమా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రాకముందు రైతులు హక్కుల కోసం పోరాడితే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చిందని.. కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులు పోరాటాలు […]
దిశ, మహబూబాబాద్: దేశానికి అన్నం పెట్టే రైతన్నను గౌరవించాల్సిన ప్రభుత్వాలు వారిని ఉగ్రవాదుల్లాగా చిత్రీకరిస్తూ దాడులకు పాల్పడుతున్నాయని సినీ దర్శకుడు, నటుడు ఆర్.నారాయణ మూర్తి ధ్వజమెత్తారు. బుధవారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని సీపీఐ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రైతన్న సినిమా ప్రచారంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ.. స్వాతంత్ర్యం రాకముందు రైతులు హక్కుల కోసం పోరాడితే, అప్పటి బ్రిటిష్ ప్రభుత్వం డిమాండ్లను నెరవేర్చిందని.. కానీ, ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం మాత్రం రైతులు పోరాటాలు చేస్తున్నా పట్టించుకోవడం లేదంటూ మండిపడ్డారు.
దేశ రాజధాని ఢిల్లీలో 14 నెలలుగా చేస్తున్న రైతుల పోరాటాలను పట్టించుకోకుండా.. మౌనం పాటిస్తున్న బీజేపీ ప్రభుత్వానికి రైతులు గుణపాఠం చెప్పాలన్నారు. రైతులు చేస్తున్న శాంతియుత పోరాటంలో ఇప్పటికే ఆరు వందల మంది మరణించారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలను, విద్యుత్ సంస్కరణల బిల్లులను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను ప్రయివేట్ పరం చేస్తున్న మోడీ చివరకు వ్యవసాయ రంగాన్ని కూడా కార్పొరేట్‌కు కట్టబెట్టడం దారుణమన్నారు. ఈ నేపథ్యంలోనే అక్టోబర్ 22న రైతులకు మద్దతుగా ‘రైతన్న’ సినిమా విడుదల కానుందని.. దీనిని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీల నాయకులు పాల్గొన్నారు.