సోషల్ మీడియా పోస్ట్‌లపై పొలిటికల్ హీట్..! పార్టీల మధ్య మాటల యుద్ధం

సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది.

Update: 2024-11-27 01:36 GMT

దిశ, పల్నాడు: సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై రాష్ట్రంలో రాజకీయ దుమారం రేగింది. అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం మొదలైంది. అధికారంలో ఉన్నప్పుడు వైసీపీ సోషల్ మీడియా హద్దులు దాటి ప్రవర్తించిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. తమను టార్గెట్ చేశారంటూ వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ఈ క్రమంలోనే తమ పార్టీ నేతలపై పోస్టింగ్స్ పెట్టిన ఐటీడీపీ కార్యకర్తలపై కూడా కేసులు నమోదు చేసేలా ఒత్తిడి చేసేందుకు వైసీపీ ప్రయత్నాలు ప్రారంభించింది. చినికిచినికి గాలివానలా మారుతున్న ఈ వ్యవహారం ఇపుడు చర్చనీయాంశంగా మారింది.

సర్కార్ సీరియస్..

సోషల్ మీడియా పోస్టింగ్స్‌పై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా ఉంది. రాజకీయ నేతలను, వారి కుటుంబాలను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరమైన పోస్టింగ్స్ పెడుతున్న వారిపై పోలీసులు కొరడా ఝళిపిస్తున్నారు. వ్యక్తిగతంగా దూషిస్తున్నా.. చూస్తూ ఊరుకోవాలా అని అధికార పార్టీ నేతలు ప్రశ్నిస్తుంటే.. ఒక్క వైసీపీ నేతలే కనిపిస్తున్నారా అని ఆ పార్టీ నేతలు అంటున్నారు. దీనిపై గుంటూరు జిల్లా స్థాయిలో పోరాటానికి వైసీపీ నేతలు సిద్ధమయ్యారు. జిల్లాలో ఎక్కడెక్కడ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారో తెలుసుకుంటున్నారు. జైల్లో ఉన్న కార్యకర్తలను పరామర్శిస్తున్నారు. మరోవైపు ఐటీడీపీ పెడుతున్న కేసులపై పోరాటాలకు సిద్ధం అవుతున్నారు.

రజిని, అంబటి ఫిర్యాదులు..

గుంటూరు జిల్లా జైల్లో ఉన్న సుధారాణితో పాటు ఇతర కార్యకర్తలను పరామర్శించి అంబటి ఇతర నేతలు ఆ తరువాత జగన్ కుటుంబంపై పోస్టింగ్స్ పెడుతున్న వారిపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాజీ మంత్రి విడదల రజిని కూడా ఇప్పటికే తనపై అసభ్యకర పోస్టింగ్స్ పెడుతున్న వారితో పాటు యూట్యూబ్ ఛానల్స్‌పై కూడా ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అందుకు ప్రతిగా టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతిస్పందిస్తున్నారు. సోషల్ మీడియాలో హద్దులు దాటి ప్రవర్తించవద్దని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కాగా, వైసీపీ నేతలు చేస్తున్న ఈ కార్యక్రమాలు ఎంత మేరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాల్సిందే.


Similar News