గోదావరి రోడ్ కమ్ రైల్వే బ్రిడ్జికి 50 ఏళ్లు
ఉభయ గోదావరి జిల్లాలకు మణిహారంగా వారధిగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేసుకుంది.
దిశ, గోదావరి జిల్లాల ప్రతినిధి: ఉభయ గోదావరి జిల్లాలకు మణిహారంగా వారధిగా నిలిచిన రాజమండ్రి రోడ్ కం రైల్వే బ్రిడ్జి 50 వసంతాలను పూర్తి చేసుకుంది. 1974లో ప్రారంభోత్సవం జరుపుకున్న ఈ బ్రిడ్జి 50 ఏళ్లుగా సేవలందిస్తోంది. ఆసియా ఖండంలోనే అతి పొడవైన రెండవ రోడ్ కం రైల్వే బ్రిడ్జిగా చరిత్రకు ఎక్కిన దీనిపై నిత్యం పదివేలకు పైగా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. 60 ఏళ్ల సామర్థ్యంతో నిర్మించిన ఈ వంతెన మనుగడ మరో 20 ఏళ్లు ఉండేలా భారీ వాహనాల రాకపోకలను ప్రస్తుతం నిషేధించారు. బ్రిడ్జి శిథిలమైన చోట పునరుద్ధరణ పనులను చేపట్టారు. ఈ వంతెన గోదావరి నదిని ఉమ్మడి రైలు, రోడ్డు మార్గాల ద్వారా దాటుతుంది. రాజమహేంద్రవరం నగరానికి, ముఖ్యంగా రైలు, రోడ్డు ప్రయాణాన్ని సమర్థవంతంగా అనుసంధానం చేస్తూ, వాణిజ్య, ఇతర రవాణా అవసరాలను తీర్చడానికి ఈ వంతెన కీలకమైనది.
అద్భుతమైన ఇంజినీరింగ్
రాజమహేంద్రవరం రోడ్డు-రైలు వంతెన భారతదేశంలోని ప్రాచీన వంతెనల్లో ఒకటి. ఉభయ గోదావరి జిల్లాలను కలిపే ఆత్మీయ వారధిగా రాజమండ్రి, కొవ్వూరు మధ్య నిర్మించబడిన ఈ బ్రిడ్జిని 1974 నవంబరు 23న అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ అలీ అహ్మద్ జాతికి అంకితం చేశారు. ఈ వంతెన గోదావరి జిల్లాలను కలిపే అపురూపమైన ప్రాధాన్యత కలిగిన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జి. ఈ వంతెన ఇంజినీరింగ్ అద్భుతంగా పరిగణించవచ్చు. ముఖ్యంగా రాజమండ్రి వద్ద మలుపులను స్మార్ట్‌గా డిజైన్ చేశారు. ఇది భారతదేశంలో అతి పొడవైన రైల్ కమ్ రోడ్ బ్రిడ్జ్‌లలో మూడో స్థానంలో ఉంది. తొలి రెండు బ్రిడ్జిలు అస్సాంలో బ్రహ్మపుత్ర నదిపై, బీహార్‌లో సోన్‌పూర్ వద్ద ఉన్నాయి. 1964లో మూడో పంచవర్ష ప్రణాళికలో కొవ్వూరు, రాజమండ్రి మధ్య ఒక రైల్ బ్రిడ్జి నిర్మించడానికి నిర్ణయం తీసుకున్నారు. అప్పటికి గోదావరి జిల్లాల ప్రయాణీకులు లాంచీల ద్వారా మాత్రమే చేరుకునే ప్రాంతాలు. రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు మార్గాన్ని కూడా కలిపి వంతెన నిర్మించాలనుకునే ప్రతిపాదన కేంద్రానికి పంపింది. కేంద్ర ఆమోదం పొందిన తరువాత జెసోప్ కంపెనీ నిర్మాణం ప్రారంభించింది.
1974లో జాతికి అంకితం
1974 ఆగస్టులో వంతెన పూర్తయింది. రైలు మార్గం 2.8 కి.మీ కాగా రోడ్ మార్గం 4.1 కి.మీ పరిధిలో ఉంది. 1974 నవంబరులో అప్పటి రాష్ట్రపతి ఫక్రుద్దీన్ ఆలీ అహ్మద్ ఈ బ్రిడ్జిని ప్రారంభించారు. ఈ బ్రిడ్జి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రత్యక్ష ప్రసారం చేసింది, అందరికీ ఈ సాంకేతిక అద్భుతాన్ని చూపిస్తూ ఉషశ్రీ ప్రతి క్షణాన్ని వర్ణించారు. అప్పటి నుంచి లాంచీల ప్రయాణం నిలిచిపోయింది. కొవ్వూరు, రాజమండ్రి మధ్య షటిల్ బస్‌లు ప్రారంభించబడ్డా యి. ఈ బ్రిడ్జి గోదావరి జిల్లాలను ఒకటిచేసింది, అందుకే ఈ బ్రిడ్జి గోదారోళ్లకు ప్రత్యేకమైనది.