కుప్పకూలిన గుండుగొలను వంతెన.. తాత్కాలిక ఇరుకు వంతెనతో జనం అవస్థలు
రహదారులే కాదు.. ఆఖరికి వంతెనలు శిథిలమవుతున్నా పట్టించుకునే నాథుడు కరవవుతున్నాడు.
దిశ ప్రతినిధి, ఏలూరు: రహదారులే కాదు.. ఆఖరికి వంతెనలు శిథిలమవుతున్నా పట్టించుకునే నాథుడు కరవవుతున్నాడు. ఏలూరు జిల్లా వ్యాప్తంగా రహదారులు అధ్వాన్నంగా తయారైతే... రెండేళ్ల క్రితం కుప్పకూలిన వంతెనను పునర్నిర్మాణం చేయకపోవడంతో పలు గ్రామాల ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఏలూరు జిల్లా దెందులూరు మండల పరిథిలోని గుండుగొలను వద్ద 16వ నెంబరు జాతీయ రహదారికి ఆనుకుని గోదావరి - ఏలూరు కాలువపై శతాబ్ధిన్నర కిందట వంతెన నిర్మించారు. అది రెండేళ్ల క్రితం కుప్పకూలడంతో దాని స్థానంలో పెద్ద వంతెన కడతామని హామీ ఇచ్చారు. అయితే, ఎవరూ పట్టించుకోకపోవడంతో ప్రజలే తాత్కాలికంగా ఇరుకుగా వంతెన నిర్మించుకున్నారు. ఇరుకు వంతెన కారణంగా తరచూ దానిపై ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. ఈ సమస్యను ఏ ప్రజాప్రతినిధి పట్టించుకున్న దాఖలాలు లేవు.
హైవేకు చేరడానికి ప్రధాన ఆధారం..
దెందులూరు, భీమడోలు, ఏలూరు గ్రామీణ మండలాలకు చెందిన ప్రజలు, చేపల చెరువుల యజమానులు ఈ వంతెనపై నిత్యం రాకపోకలు సాగిస్తుంటారు. భీమడోలు మండలంలోని లంక గ్రామాల ప్రజలు, ఏలూరు మండలంలోని ప్రజలు జాతీయ రహదారిని చేరడానికి ఈ వంతెనే ప్రధాన ఆధారం. అటువంటి వంతెన కూలిపోయిన తదుపరి స్థానికులు వ్యాపారాలు, పాదచారులు సంయుక్తంగా తాత్కాలిక వంతెనను నిర్మించుకొన్నారు. అది వ్యాపారులకు, భారీ వాహన రవాణాకు అనుకూలం కాకపోవడంతో అనేక ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.
కుంటిసాకులతో కాలక్షేపం..
కాంట్రాక్టర్లు, హైవే అధికారులు కాలువలో నీటి ప్రవాహం, భారీ క్రేన్లు దొరకటం లేదనే సాకు చూపెట్టడమే కాకుండా, వివిధ శాఖల సమన్వయ లోపం కారణంగా నిర్మాణం ఆలస్యం అవుతోందని స్థానికులు అంటున్నారు. రహదారికి ఇరువైపులా మార్జిన్ అంతంత మాత్రంగా ఉండడంతో ప్రమాదం పొంచి ఉంది. తాత్కాలిక వంతెన స్థానంలో కొత్తవంతెన పనులు వేగంగా పూర్తి చేయాలని పోతునూరు, లక్ష్మీపురం, గుండుగొలను, కొమిరేపల్లి, చెట్టున్నపాడు, తదితర లంక గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో అధికారులను వేడుకొంటున్నారు.
త్వరితగతిన పూర్తి చేయాలి..
వంతెన కూలిపోయి రెండేళ్లయినా శాశ్వత వంతెన నిర్మించడానికి అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారు. దీంతో లంక గ్రామాల ప్రజలు, ఏలూరు రూరల్ ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఎన్నిసార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఇప్పటికైనా ఏలూరు జిల్లా భీమడోలు మండలం గుండుగొలను ప్రధాన రహదారి వంతెన నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తిచేయాలి. - సుమన్ బాబు, గుండుగొలను వంతెన సాధన కమిటీ కన్వీనర్