పుట్టా మధు వెనుక ఏం జరుగుతోంది.. అనుచరుల్లో ఆందోళన!

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం తరువాత ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు మీడియాపై మాటలతో దాడి చేశారు. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియానే లక్ష్యంగా మంథని డివిజన్‌లోని పుట్టా అనుచరులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్టాడారు. ఓ దశలో పుట్ట మధు భార్య కూడా కొంతమందితో మాట్లడుతూ… మా ఆయనకు కోవిడ్ వచ్చింది, రెస్ట్‌లో ఉన్నాడు, పొలిటికల్ లీడర్లకు పర్సనల్ లైఫ్ ఉండదా, […]

Update: 2021-05-08 00:47 GMT

దిశ ప్రతినిధి, కరీంనగర్: పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధు అదృశ్యం తరువాత ఆయన అనుచరులు, కుటుంబ సభ్యులు మీడియాపై మాటలతో దాడి చేశారు. తప్పుడు వార్తలు రాస్తున్నారంటూ వార్నింగ్‌లు ఇచ్చారు. వాస్తవాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన మీడియానే లక్ష్యంగా మంథని డివిజన్‌లోని పుట్టా అనుచరులు కూడా ఇష్టం వచ్చినట్టుగా మాట్టాడారు. ఓ దశలో పుట్ట మధు భార్య కూడా కొంతమందితో మాట్లడుతూ… మా ఆయనకు కోవిడ్ వచ్చింది, రెస్ట్‌లో ఉన్నాడు, పొలిటికల్ లీడర్లకు పర్సనల్ లైఫ్ ఉండదా, తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటూ మండిపడినంత పని చేశారు. పోలీసులు కూడా పుట్ట మధు అదృశ్యం అయిన మాట కూడా నిజమేనని, అతన్ని విచారిస్తున్నామని ప్రకటించారు.

పుట్టా వెనక అసలేం జరుగుతోంది.?

పుట్టా మధు పోలీసుల అదుపులో ఉండడం వెనక కారణాలు ఏంటన్నదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. పోలీసులు కేవలం గట్టు వామన్ రావు హత్య కేసు గురించే ఆరా తీస్తున్నారా? లేక మరిన్ని విషయాలపైనా వివరాలు సేకరిస్తున్నారా? అన్నదే ఇప్పుడు మిస్టరీగా మారింది. 2018 ఎన్నికలకు ముందు మంథని మాజీ ఉప సర్పంచ్ ఇనుముల సతీష్ ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదులోని అంశాలపై కూడా పోలీసులు ఆరా తీస్తున్నట్టుగా సమాచారం. వైరల్ అయిన ఆడియో రికార్డుల ఆధారంగా కూడా ఆయన్ని ప్రశ్నించే అవకాశాలూ లేకపోలేదు.

అప్రూవర్‌గా వసంత్ రావ్..?

అడ్వకేట్ వామన్ రావు దంపతుల మర్డర్ కేసులో అరెస్టయిన రిటైర్డ్ ఇంజినీర్ వెల్ది వసంతరావును అప్రూవర్‌గా మార్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. ఈ కేసులో పుట్ట మధు పాత్ర ఎంతమేర ఉంది అన్న వివరాలు సేకరించే పనిలో నిమగ్నమైన పోలీసులు ఆయనచే 164 స్టేట్‌మెంట్ రికార్డ్ చేసే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతోంది. పోలీసులు మాత్రం వామన్ రావు తండ్రి కిషన్ రావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విచారిస్తున్నామని చెప్పినప్పటికీ అన్ని విషయాలను క్షుణ్ణంగా తెలుసుకునే పనిలో పోలీసు అధికారులు ఉన్నట్టు సమాచారం. ఈ కేసులో నిందితునిగా ఉన్న బిట్టు శ్రీను పుట్ట మధుకు స్వయాన మేనమామ కావడం, ఆయనకు విలువైన కారు ఎలా వచ్చింది, ఆయన సంపాదనలో పుట్ట మధు పాత్ర ఉందా? అన్న కోణంలోనూ విచారించే అవకాశాలు ఉన్నట్టు సమాచారం. ఇటీవల పోలీసు అధికారులకు అందిన ఓ లేఖ విషయం కూడా ప్రధాన అస్త్రంగా మారింది. వామన్ రావు మర్డర్ కేసులో రూ.2 కోట్ల సూపారి చేతులు మారిందన్న లేఖ గురించి కూడా పుట్టా మధును ప్రశ్నించే అవకాశాలు ఉన్నాయి. మర్డర్ కేసుకు రెండు మూడు రోజుల ముందు ఈ డబ్బు డ్రా చేసినట్టు ఇంటలిజెన్స్ వర్గాలు కూడా సమాచారం సేకరించినట్టుగా తెలుస్తోంది.

పోలీసుల పాత్ర..?

వామన్ రావు మర్డర్ కేసులో పోలీసుల పాత్రపై ఇప్పటికే ఉన్నతాధికారులు ఓ క్లారిటీకి వచ్చినట్టు సమాచారం. ఇందులో పోలీసులపై కూడా కేసులు నమోదు అయ్యే అవకాశాలు ఉన్నాయి.

శైలజపై కూడా…

పుట్ట మధు భార్య, మంథని మునిసిపల్ ఛైర్ పర్సన్ శైలజను కూడా పోలీసులు అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయి. వామన్ రావు మర్డర్ కేసులో నిందితులను ఇటీవల మంథని కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆవరణకు వచ్చిన శైలజ, మధు మేనల్లుడు బిట్టు శ్రీనుతో మాట్లడడమే కాకుండా ఆయన శైలజను వేరే ఫోన్‌లో మాట్లాడించారన్న అభియోగంపై మంథని పోలీస్ స్టేషన్‌లో కేసు కూడా నమోదయింది. ఈ కేసులో శైలజను కూడా అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేసుకున్నారని సమాచారం. దీంతో పుట్టా మధు కస్టడీ వెనుక ఏం జరుగుతుందో అని ఆయన అనుచరుల్లో ఆందోలన నెలకొంది.

Tags:    

Similar News