ఆ శాఖలో పదోన్నతుల గోల్‌మాల్.. ఎన్ని అర్హతలున్నా పక్కకే..!

దిశ, కరీంనగర్ సిటీ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఆ శాఖలోని కొంత మంది ద్వితీయ, ఉన్నత శ్రేణి అధికారులు.. అయినవారికీ ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో వడ్డిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని అర్హతలున్న సీనియర్లను కాదని జూనియర్లకు ప్రమోషన్లు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతుల జాబితాలో డొల్లతనాన్ని సాక్షాత్తూ జిల్లా సర్వోన్నతాధికారే ఎత్తి చూపినా తప్పుడు ఆధారాలతో తప్పుదారి పట్టిస్తున్న ఒకరిద్దరు దళారీ […]

Update: 2021-10-15 06:08 GMT

దిశ, కరీంనగర్ సిటీ : ఉమ్మడి కరీంనగర్ జిల్లా సంక్షేమ శాఖలో ఉద్యోగుల పదోన్నతుల్లో భారీ అక్రమాలు వెలుగుచూశాయి. ఆ శాఖలోని కొంత మంది ద్వితీయ, ఉన్నత శ్రేణి అధికారులు.. అయినవారికీ ఆకుల్లో.. కాని వారికి కంచాల్లో వడ్డిస్తూ అందినకాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అన్ని అర్హతలున్న సీనియర్లను కాదని జూనియర్లకు ప్రమోషన్లు కట్టబెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పదోన్నతుల జాబితాలో డొల్లతనాన్ని సాక్షాత్తూ జిల్లా సర్వోన్నతాధికారే ఎత్తి చూపినా తప్పుడు ఆధారాలతో తప్పుదారి పట్టిస్తున్న ఒకరిద్దరు దళారీ ఉద్యోగులు, తమ పనిని సజావుగా అయ్యేలా చూసుకుంటున్నట్టు తెలుస్తోంది.

ఏళ్ల తరబడి తాము ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తిస్తూ నిబద్ధత చాటుతున్నా తమను పట్టించుకోవటం లేదని వాపోతున్నారు. ప్రమోషన్ల కోసం ఎదురుచూసి చూసి విసిగిపోయిన వారంతా అక్రమ పదోన్నతులపై ప్రశ్నిస్తే, ఇంక్రిమెంట్లు ఇచ్చి దాంతోనే సరిపెట్టుకోవాలని సూచిస్తున్నట్టు బాధితులు ఆరోపిస్తున్నారు. జరుగుతున్న అక్రమాలపై సంక్షేమ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేసినా స్థానిక అధికారుల్లో మాత్రం చలనం లేకపోయింది. దీంతో బాధిత ఉద్యోగి ఒకరు సంక్షేమ శాఖ ఉపసంచాలకుల కార్యాలయం ఎదుట నిరసన తిగేందుకు సిద్ధమవుతున్నాడు.

ఉమ్మడి జిల్లా పరిధిలోని సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ -1 పదోన్నతి కోసం,
జిల్లా పరిధిలోని కొలనూరులో గత మూడేళ్ళుగా డిప్యూటేషన్ పై విధులు నిర్వహిస్తున్న ఎం. రాజయ్య దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, ఆయన్ను కాదని జూనియర్ అధికారి అప్సర్ పేరును ప్రతిపాదిస్తూ.. నాటి అప్పటి కలెక్టర్ శశాంకకు ఫైల్ పంపించారు. దీనిపై కలెక్టర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ, ప్రతిపాదిత వ్యక్తికన్నా సీనియర్లుగా ఉన్న వారినుంచి ఎన్ఓసీ తేవాలంటూ సూచించాడు.

దీంతో, అప్సర్ పేరు పక్కకు పోగా, సీనియర్ అయిన రవీంద్ర స్వామికి పదోన్నతి కల్పించారు. అనంతరం ఖాళీ అయిన పోస్టులో రాజయ్యకు అవకాశం కల్పించాల్సి ఉండగా, ఆయనకు బదులు తిరిగి అఫ్సర్ పేరునే జిల్లా అధికారులు ప్రతిపాదించారు. ఇది తెలుసుకున్న బాధిత ఉద్యోగి రాజయ్య కలెక్టర్, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కమిషనర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి కూడా ఫిర్యాదు చేశాడు. దీంతో దిగివచ్చిన అధికారులు 16 ఏళ్ళ ఇంక్రిమెంట్లు రాజయ్యకు విడుదల చేయాలంటూ మరో ఫైల్ కలెక్టర్‌కు పంపారు. అయితే, తాను అడగకున్నా ఇంక్రిమెంట్లు ఇచ్చేందుకు సిద్ధపడుతున్న అధికారులు.. పదోన్నతి మాత్రం కల్పించేందుకు వెనుకాడుతుండటంలో ఆంతర్యమేంటని ప్రశ్న అందరిలో తలెత్తుతోంది.

ఉద్యోగ ఉన్నతి కోసం సిఫారసు చేసిన సదరు వ్యక్తి కన్నా అదనంగా పలు అర్హతలున్నా ఎవరి ప్రోద్భలంతో పదోన్నతుల జాబితాలో తన పేరు చేర్చకుండా పక్కనబెడుతున్నారనేది అంతు చిక్కటం లేదని బాధిత ఉద్యోగి వాపోతున్నాడు. పదోన్నతికోసం దేహదారుడ్య, మెంటల్ టెస్టుల్లో సైతం ఉత్తీర్ణత సాధించినా తనను పరిగణలోకి తీసుకోకపోవడాన్ని బట్టి చూస్తే అక్రమంగా పదోన్నతి పొందిన వ్యక్తి , అధికారులపై ఎంత బలమైన ప్రభావం చూపుతున్నాడో స్పష్టమవుతోంది. అధికారుల తీరుతో న్యాయబద్ధంగా తనకు రావాల్సిన పదోన్నతి అందని ద్రాక్షగానే మారుతోంది. జరుగుతున్న అవినీతిపై కలెక్టర్ దృష్టి సారించి, ఇప్పటిైకైనా తమను తప్పుదారి పట్టించిన వారిపై చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.

Tags:    

Similar News