వైఎస్ వివేకా హత్యకేసులో పురోగతి.. కీలక నేత అరెస్ట్

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అనుమానితుడుగా భావిస్తున్న పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం అనంతరం సునీల్ కుమార్ యాదవ్ కుటుంబం పరారయ్యారు. అయితే సునీల్ కుమార్ యాదవ్ గోవాలో ఉండగా సీబీఐ అధికారులు ఆయనను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం గోవాలోని […]

Update: 2021-08-03 02:44 GMT

దిశ, ఏపీ బ్యూరో: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ హత్య కేసులో అనుమానితుడుగా భావిస్తున్న పులివెందులకు చెందిన వైసీపీ కీలక నేత సునీల్ యాదవ్‌ను సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. వివేకానందరెడ్డి ఇంటి వాచ్‌మెన్ రంగన్న వాంగ్మూలం అనంతరం సునీల్ కుమార్ యాదవ్ కుటుంబం పరారయ్యారు. అయితే సునీల్ కుమార్ యాదవ్ గోవాలో ఉండగా సీబీఐ అధికారులు ఆయనను సోమవారం అదుపులోకి తీసుకున్నారు. మంగళవారం ఉదయం గోవాలోని స్థానిక కోర్టులో హాజరుపరిచినట్లు తెలుస్తోంది.

గోవాలోని స్థానిక కోర్టు ద్వారా సునీల్ యాదవ్ ను ట్రాన్సిట్ రిమాండ్‌లోకి తీసుకున్నట్లు సీబీఐ ధృవీకరించింది. అనంతరం సునీల్‌ కుమార్ యాదవ్‌ను బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో మంగళవారం కడపకు తీసుకొచ్చారు. ప్రస్తుతం కడప నగరంలోని సెంట్రల్ జైల్ గెస్ట్‌హౌస్ లో సునీల్ కుమార్ యాదవ్ ఉన్నారు. మరికాసేపట్లో సునీల్ కుమార్ యాదవ్‌ను సీబీఐ అధికారులు జిల్లా కోర్టులో హాజరపరచనున్నారు. మరోవైపు ఇదే కేసులో వివేక సన్నిహితుడు ఎర్ర గంగిరెడ్డి, మాజీ డ్రైవర్ దస్తగిరిని సీబీఐ అధికారులు మంగళవారం విచారిస్తున్నారు.

కాగా ఈ కేసులో సునీల్ కుమార్ యాదవ్‌ను 30 రోజులపాటు సీబీఐ అధికారులు పలుమార్లు విచారించారు. అయితే రంగన్న వాంగ్మూలంలో సునీల్ కుమార్ యాదవ్ పేరు బయటకు రావడం సంచలనంగా మారింది. దీంతో వెంటనే సునీల్ కుమార్ యాదవ్ హైకోర్ట్ ను ఆశ్రయించారు. తనను ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నారని ఆరోపించారు. గతంలో విచారణ పేరుతో తనపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తమను విచారిస్తే మెజిస్ట్రేట్ ఎదుట విచారించాలని కోరారు. అయితే నిబంధనల మేరకే విచారిస్తున్నామని సీబీఐ హైకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది.

ఈ పరిణామాల నేపథ్యంలో పులివెందులలోని తన నివాసానికి తాళం వేసి సునీల్ కుమార్ యాదవ్‌తో పాటు అతడి కుటుంబ సభ్యులు పరారయ్యారు. దీంతో అతని ఆచూకి కోసం సీబీఐ అధికారులు గాలింపు చర్యలు చేపట్టగా గోవాలో ఉన్నట్లు తెలుసుకున్నారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడకు వెళ్లి అదుపులోకి తీసుకున్నారు. బుధవారం కోర్టులో హాజరుపరిచే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే గతంలో కూడా సునీల్‌కుమార్‌ను ఢిల్లీకి తీసుకెళ్లిన సీబీఐ అధికారులు లైడిక్టర్ పరీక్షలు నిర్వహించారు. ఆ సమయంలో తనపై థర్డ్ డిగ్రీ కూడా ఉపయోగించారని సునీల్ కుమార్ యాదవ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. సునీల్ కుమార్ వెనుక పెద్దల హస్తం ఉందని సీబీఐ అధికారులు అనుమానిస్తున్నట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News