తిరుమలలో సిట్ దూకుడు.. శ్రీవారి బూందీ పోటులో తనిఖీలు
తిరుమల లడ్డూలో కల్తీ నెయ్యి ఘటనపై సిట్ అధికారులు దూకుడు పెంచారు..
దిశ వెబ్ డెస్క్: తిరుమల లడ్డూ(Tirumala Laddu)లో కల్తీ నెయ్యి(Adulterated Ghee) ఘటనపై సిట్ అధికారులు(SIT officials) దూకుడు పెంచారు. శ్రీవారి ఆలయంలో తనిఖీలు నిర్వహించారు. లడ్డు బూందీ పోటులో సోదాలు చేశారు. ఆలయం వెలుపలున్న లడ్డూ బూందీకి వినియోగించే నెయ్యిని పరిశీలించారు. గత జగన్ ప్రభుత్వం(Jagan Government)లో వాడిన నెయ్యిపై ఆరా తీశారు. ఆ సమయంలో అనుమానాలేమైనా తలెత్తాయా అని అడిగారు. అలాగే లడ్డూ తయారీ, ప్రస్తుత నెయ్యి వినియోగంపైనా ప్రత్యక్షంగా వివరాలు సేకరించారు. పలు రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు.
వారం రోజులుగా తిరుపతి(Tirupati)లో విచారణ జరిపిన అధికారులు తాజాగా తిరుమల(Tirumala)లో తనిఖీలు చేశారు. మరికొన్ని రోజులు కూడా ఈ తనిఖీలు కొనసాగనున్నాయి. పూర్తి నివేదిక రెడీ చేసి ప్రభుత్వానికి సిట్ అందించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే సీబీఐ(Cbi) అధికారుల బృందం కూడా తిరుమలలో విచారణ చేపట్టనుంది. మార్కెటింగ్ గోదాములు, లడ్డూ బూందీ పోటులోనూ సోదాలు చేయనున్నారు.