వామ్మో కిరాణా షాపులు: డిస్కౌంట్స్ ఇస్తున్నారని కొంటున్నారా..?

విజయవాడలో కొందరు కిరాణా వ్యాపారులు దారుణానికి పాల్పడుతున్నారు...

Update: 2024-11-28 16:57 GMT

దిశ, వెబ్ డెస్క్: విజయవాడలో కొందరు కిరాణా వ్యాపారులు దారుణానికి పాల్పడుతున్నారు. ఉత్పత్తుల గడువు ముగిసినా విక్రయిస్తున్నారు. ఫుడ్ సేఫ్టీ అధికారుల ఆకస్మిక తనిఖీల్లో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. నగరంలో ఓ కిరాణా షాపులో చేసిన తనిఖీల్లో పది లక్షల రూపాయల విలువైన ఉత్పత్తులకు తేదీలు ముగిసినట్లు గుర్తించారు. దీంతో ఈ ఉత్పత్తుల మొత్తాన్ని స్వాధీనం చేసుకున్నారు. డిస్కౌంట్ పేరుతో గడువు ముగిసిన ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. కొన్ని నెలల క్రితం తేదీ ముగిసిన ఉత్పత్తులను ఇప్పటికే అమ్మకాలు జరిపినట్లు నిర్ధారించారు. తమకు అందించిన ఫిర్యాదుల మేరకు ఓ షాపులో తనిఖీలు చేశామని, చిన్న పిల్లలు తినే బిస్కట్ ప్యాకెట్ల తేదీల గడువు ముగిసినట్లు గుర్తించామని అధికారులు తెలిపారు. ఆరు నెలల క్రితం గడువు ముగిసిన నెయ్యి, తేనె, గోధుమ, మసాలాలు, సాసు, పిల్లల హెల్త్ మిక్స్ వంటి వాటిని యదేచ్చగా విక్రయించినట్లు పేర్కొన్నారు. 20 శాతం డిస్కౌంట్ ఇస్తూ విక్రయాలకు పాల్పడినట్లు చెప్పారు. శ్యాంపిల్స్ ను సేకరించామని, నివేదిక వచ్చిన వెంటనే క్రిమినల్ కేసులు పెడతామని, కఠిన శిక్షలు పడేలా చర్యలు చేపడతామని ఫుడ్ సేఫ్టీ అధికారులు హెచ్చరించారు. 


Similar News