కేసీఆర్ లక్ష్యానికి పెద్ద గండిపడుతోంది

ధరణి వెబ్​సైట్​… తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భూక్రయ విక్రయాలను పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ప్రాజెక్టు. ఏండ్లు గడుస్తున్నా ఒక పబ్లిక్ డొమైన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేక పోతోంది. దీంతో రైతులు, కొనుగోలుదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాస్తవంగా ఉన్న భూమికి, వెబ్​సైట్​లో నమోదు చేసిన భూవివరాలకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ఒక చిన్న సమస్యను పరిష్కరించమని అడిగినా సాఫ్ట్​వేర్​ సమస్యను కారణాలుగా అధికారులు చెబుతున్నారు. దీంతో సర్కారు ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టిందో ఆ […]

Update: 2020-07-01 20:32 GMT

ధరణి వెబ్​సైట్​… తెలంగాణ సర్కారు ప్రతిష్టాత్మకంగా భూక్రయ విక్రయాలను పారదర్శకంగా నిర్వహించేందుకు చేపట్టిన ప్రాజెక్టు. ఏండ్లు గడుస్తున్నా ఒక పబ్లిక్ డొమైన్ ను ప్రజలకు అందుబాటులోకి తీసుకురాలేక పోతోంది. దీంతో రైతులు, కొనుగోలుదారులు నానా ఇక్కట్లు పడుతున్నారు. వాస్తవంగా ఉన్న భూమికి, వెబ్​సైట్​లో నమోదు చేసిన భూవివరాలకు ఎంతో వ్యత్యాసం ఉంటోంది. ఒక చిన్న సమస్యను పరిష్కరించమని అడిగినా సాఫ్ట్​వేర్​ సమస్యను కారణాలుగా అధికారులు చెబుతున్నారు. దీంతో సర్కారు ఏ ఉద్దేశంతో ఈ ప్రాజెక్టు చేపట్టిందో ఆ లక్ష్యమే నెరవేరడం లేదు.

దిశ, న్యూస్ బ్యూరో: రాష్ట్రం మొత్తం మీద దాదాపు 60 లక్షల ఎకరాల భూమి అదనంగా నమోదైంది. ఈ అదనపు భూమి రికార్డుల్లో ఉంది కానీ, భౌతికంగా లేదు. దీంతో గొడవలు, కొట్లాటలు, కోర్టు కేసులు పెద్ద తలనొప్పులుగా మారాయి. భూముల క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకత సాధించడం, అవినీతిని నిరోధించడం, నకిలీ పాసు పుస్తకాలను అరికట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం అమలు చేస్తోన్న ‘ధరణి’ వెబ్ సైటే దీనికి కారణం. రైతులు, కొనుగోలుదార్లను కార్యాలయాల చుట్టూ తిప్పించుకుంటోంది. ఏండ్లు గడుస్తున్నా సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ‘ధరణి’ని అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు. జాప్యానికి కారణం రెవెన్యూ ఉద్యోగులు, అధికారులేనంటూ దరఖాస్తుదారులు, రైతులు మండిపడుతున్నారు. సాంకేతిక సమస్యలతోనే మ్యుటేషన్లు నిలిచిపోయాయంటూ ఎంత చెప్పినా వినిపించుకోవడం లేదంటూ రెవెన్యూ వర్గాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. పాసు పుస్తకాలు కొనుగోలుదారుడికి కొరియర్ ద్వారా అందిస్తామని, ఒక్క రోజులోనే మొత్తం పని పూర్తి చేసి అవినీతికి ఆస్కారం లేకుండా చేస్తామని, నకిలీ పాసు పుస్తకాలు, ఇతర డాక్యుమెంట్లు లేకుండా ధరణి వెబ్‌సైట్‌ ను రూపొందించాలన్న సీఎం కేసీఆర్ లక్ష్యానికి పెద్ద గండిపడుతోంది. ఏండ్లు గడుస్తున్నా ఒక వెబ్ సైట్ ను పబ్లిక్ లోకి తీసుకు రాలేకపోతోంది.

అనేక సాంకేతిక సమస్యలు

– రైతు సేత్వార్ రిజిస్ట్రార్ లోని భూ విస్తీర్ణం కంటే పహాణీల్లోని భూమి ఎక్కువ. పాసు పుస్తకాల్లోని భూమి ఎక్కువన్న మాట. అయితే డేటా క్రోడీకరించేటప్పుడు ఇవేవీ సరిచేయలేదు. యథాతథంగా అప్ లోడ్ చేశారు. ఇప్పుడేమో కొత్త పాసు పుస్తకాల జారీకి సాఫ్ట్ వేర్ సహకరించడం లేదు.
– అన్నదమ్ములిద్దరూ వేరు పడినప్పుడు సర్వే నంబర్లలో ఎక్కువ తక్కువలుగా పంపిణీ చేసుకుంటారు. మొత్తానికి చెరి సగంగా ఉంటుంది. అయితే సాఫ్ట్ వేర్ ఈ పంపిణీకి నో అంటోంది. ప్రతి సర్వే నంబరులోనూ చెరిసగంగా విభజిస్తున్నది. దాని ద్వారా హద్దులు చెరిగిపోతాయి. పంపిణీ చేసుకున్నట్లుగా కాకుండా సాఫ్ట్ వేర్ ఇష్ట ప్రకారమే చేస్తోంది.
– ఏ రైతయినా తన భూమిలోని కొంత భాగం అమ్ముకుంటే సగం కట్ అవుతోంది. అంటే సర్వే నంబరులో ఐదెకరాలుంటే ఎకరం అమ్మారనుకోండి. కొనుగోలు చేసిన వ్యక్తికి సగం రాసేస్తోంది. దీన్ని మార్చడానికి సవాలక్ష సవాళ్లు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
– సర్వే నంబరులో రైతు సేత్వార్ రిజిస్ట్రార్ ప్రకారం 10 ఎకరాలు ఉంటే పహాణీల్లో 20 ఎకరాలు ఉంటుంది. దీంతో కొత్త పాసు పుస్తకాల జారీకి ఏండ్లు పట్టే అవకాశమే ఉంది.
– వికారాబాద్ జిల్లా పూడూరులో ఓ వ్యక్తికి 20 ఎకరాలు ఉంది. కొంత అమ్మేశాడు. అయితే ఆ సర్వే నంబరులో అంతకు మించిన పట్టాదారులు ఇంకా ఉన్నారు. దాంతో కొనుగోలు చేసిన వ్యక్తికి మ్యుటేషన్ ఆపేశారు.
– వికారాబాద్ డివిజన్ లో 900 ఫైళ్లు నిలిచిపోతే 25 శాతం సాంకేతిక సమస్యలతోనే పరిష్కారానికి నోచుకోవడం లేదు. సమస్య పరిష్కారానికి ఉన్నతాధికారులు మార్గాన్ని అన్వేషించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
– 2018 మే నుంచి జూన్ మధ్య కాలంలో ధరణి వెబ్ సైట్ మొరాయించింది. ఆ కాలంలోని పెండింగ్ ఫైళ్లకు సంబంధించిన పేర్లన్నీ ఎగిరిపోయాయి. అమ్మిన రైతు ఖాతా నుంచి కూడా అన్ని సర్వే నంబర్లు ఎగిరిపోయాయి. చాలా మందికి వాళ్ల పేరిట భూములు ఎగిరిపోయాయన్న విషయమే తెలియదు.

మీ సేవ కేంద్రాల్లో ఓపెన్ కావు..

వరంగల్ జిల్లాలో ఒకాయన 10 ఎకరాలు కొనుగోలు చేశాడు. అయితే అమ్మిన వ్యక్తి ఖాతా నుంచి కట్ చేశారు. మిగతా 10 ఎకరాలు కొనుగోలు చేసిన వ్యక్తి ఆచూకీ లేని కారణంగా దాన్ని నాన్ డిజిటల్ సైన్ గా పేర్కొన్నారు. పార్ట్ బి కింద నమోదైంది. రికార్డుల్లో సోల్డ్ అవుట్ అని వస్తోంది. అలాంటి భూములన్నీ ఆర్డీవో లాగిన్ లోకి వెళ్లాయి. మీ సేవ కేంద్రంలో ఓపెన్ కావు. ఒకే ల్యాండ్​పై అనేక లావాదేవీలు జరిగితే ఆ వివాదాలను పరిష్కరించుకోవడం ఇప్పుడిప్పుడే తేలేటట్లు కనిపించడం లేదని ఓ డిప్యూటీ కలెక్టర్ ‘దిశ’కు చెప్పారు. పేరులో దీర్ఘం, కొమ్ము వంటివి పొరపాట్లు జరిగినా.. దానికి 45 రోజుల సమయం పడుతోంది. స్పెల్లింగ్ మిస్టేక్ సరిచేసే అవకాశం కూడా తహసీల్దార్ కు ఇవ్వలేదు. వీఆర్వో నుంచి జాయింట్ కలెక్టర్ల వరకు ఫైల్ వెళ్లాల్సిందే. దాంతో పెండింగ్ దరఖాస్తుల సంఖ్య నానాటికీ పెరిగిపోతోంది.

పాస్​బుక్​కు రెండు నెలలు

‘ధరణి’తో క్షణాల్లో మ్యుటేషన్ ప్రక్రియ పూర్తవుతుందన్నారు. కానీ ఇప్పుడు ఫైళ్లు, డాక్యుమెంట్లు, రిపోర్టులన్నీ అప్ లోడ్ చేసిన తర్వాత డిజిటల్ సంతకానికి ఆర్డీవో నుంచి వీఆర్వోకు చేరే సరికి నెల పడుతుంది. సీసీఎల్ఏలో ‘ధరణి’ సాంకేతిక టీంకు ఏ సమస్య చెప్పినా టెక్నికల్ ప్రాబ్లం.. ఫైల్ పంపండి. చూస్తామంటూ తప్పించుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

చెల్లింపులతోనే సర్టిఫికెట్లు

సమీకృత రికార్డుల భూ యాజమాన్యం విధానం (ధరణి) వెబ్‌సైట్‌ను ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లీజింగ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ (ఐఎల్‌ఎఫ్‌ఎస్) రూపొందిస్తున్నది. రూ.116.05 కోట్లతో ప్రాజెక్టు పనులు కొనసాగుతున్నాయి. 55 లక్షల కమతాలు, 71 లక్షల వ్యవసాయ ఖాతాలకు పాస్​బుక్స్​ అందించడం, 1.24 కోట్ల ఎకరాల భూముల వివరాలను ధరణి వెబ్‌సైట్‌లో పొందుపరిచారు. ఇది అందుబాటులోకి రాకపోవడంతో భూ రికార్డులు కావాల్సిన వారు మీ సేవ కేంద్రాల్లో రుసుం చెల్లించి సర్టిఫైడ్ కాపీని పొందాల్సి వస్తోంది.

ఇది కేవలం ఒక్క డివిజన్ లో పేరుకుపోయిన పెండింగ్ ఫైళ్ల దరఖాస్తుల సంఖ్య మాత్రమే. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 71 రెవెన్యూ డివిజన్లలో పెండింగ్ ఫైళ్ల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేసుకోవచ్చు. వీటిలో అత్యధికం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయినవే. ఇటీవల సీసీఎల్ఏ అధికారులు పెండింగ్ జాబితాను తెప్పించుకున్నారు. అయితే ఈ సమస్యల పరిష్కారానికి ఎలాంటి విధానాలను ప్రకటిస్తారో వేచి చూడాల్సిందే.

Tags:    

Similar News