కరోనా వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ నిలువు దోపిడి
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కరోనా వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులను నిలువు దోపిడికి గురి చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు బిల్లుల రూపంలో చెల్లించినా కొన్ని సందర్భాలలో పరిస్థితి విషమించి కొంత మంది చనిపోతున్నారు. మరికొంత మంది రికవరైనా వారికి అందించిన వైద్యానికి ఉన్న ఆస్థులు అమ్ముకోవాల్సి వస్తోంది. కొవిడ్‌తో హాస్పిటల్స్‌కు వచ్చిన రోగి కోలుకున్నా, చనిపోయినా హాస్పిటల్ బిల్స్ మాత్రం తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో రోగుల కుటుంబ సభ్యులకు ఏం […]
దిశ ప్రతినిధి , హైదరాబాద్ : కరోనా వైద్యం పేరుతో ప్రైవేట్ హాస్పిటల్స్ రోగులను నిలువు దోపిడికి గురి చేస్తున్నాయి. లక్షలాది రూపాయలు బిల్లుల రూపంలో చెల్లించినా కొన్ని సందర్భాలలో పరిస్థితి విషమించి కొంత మంది చనిపోతున్నారు. మరికొంత మంది రికవరైనా వారికి అందించిన వైద్యానికి ఉన్న ఆస్థులు అమ్ముకోవాల్సి వస్తోంది. కొవిడ్‌తో హాస్పిటల్స్‌కు వచ్చిన రోగి కోలుకున్నా, చనిపోయినా హాస్పిటల్ బిల్స్ మాత్రం తడిసి మోపెడు అవుతోంది. ఈ నేపథ్యంలో రోగుల కుటుంబ సభ్యులకు ఏం చేయాలో పాలు పోవడం లేదు. కరోనా చికిత్స బిల్లులు వసూలు చేయడంలో ఒక్కో ఆస్పత్రి ఒక్కో విధంగా దోపిడికి పాల్పడుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అధిక బిల్లులు వేయడం, గొడవకు దిగితే తగ్గించడం పరిపాటిగా మారింది.
అనుమతులు లేని ఆస్పత్రులే అధికం..
కరోనా రోగుల సంఖ్యకు తగ్గట్లుగా ప్రభుత్వ ఆస్పత్రులలో పడకలు అందుబాటులో లేకుండా పోవడం కార్పొరేట్, చిన్న చిన్న ఆస్పత్రులకు వరంగా మారింది. తమ వద్ద కొవిడ్ రోగులకు మెరుగైన వైద్యం అందిస్తామంటూ ప్రకటనలు గుప్పిస్తూ, ప్రచారం చేస్తూ రోగులను తమ వద్దకు వచ్చేలా చేస్తున్నారు. ఇలా వచ్చిన వారి నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి నిలువు దోపిడి చేస్తున్నారు. రోగికి చికిత్స ఒక్కటే మేం చేస్తాం, బతికేది, చచ్చేది మా చేతులలో లేదు, కేవలం బిల్లులు మాత్రమే మేం నిర్ణయిస్తామనేలా వ్యవహరిస్తున్నాయి ఆసుపత్రి యాజమన్యాలు. రోగిలో ఇమ్యూనిటీ ఉండి బతికితే మేమే బతికించాం, చనిపోతే పరిస్థితి విషమించాక మా దగ్గరికి తీసుకువచ్చారని చెప్పి బిల్లులు ఏ మాత్రం తగ్గించకుండా వసూలు చేస్తున్నాయి. బీఎన్ రెడ్డిలో అనుమతి లేని ఓ చిల్డ్రన్స్ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ ఓ టీవీ 9 రిపోర్టర్ మృతి చెందగా కేవలం వారం రోజుల వైద్య చికిత్సలకు రూ 7 లక్షలు వసూలు చేసింది. మరో 12 లక్షలు చెల్లించాలని యాజమాన్యం డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.
అదే కోవలో …
ఎల్బీ నగర్ చౌరస్తాకు సమీపంలో ఉన్న ఓ ప్రైవేట్ ఆస్పత్రికి గద్వాలకు చెందిన ఓ 45 ఏళ్ల రైతును కుటుంబ సభ్యులు ఆరు రోజుల క్రితం తీసుకువచ్చారు. కరోనాతో రోగి పరిస్థితి సీరియస్‌గా ఉందని ఠాగూర్ సినిమాను చూపించి ముందుగా రూ 90 వేలు కట్టించుకుని హాస్పిటల్‌లో చేర్చుకున్నారు. రెండు రోజులు ఐసియూలో ఉంచారు. అనంతరం కోలుకున్నాడని వార్డులోకి మార్చారు. టె స్టుల పేరుతో వేల రూపాయలు వసూలు చేశారు. డిశ్చార్జ్ సమయంలో లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నంలో ఉన్నారని, చేయని టెస్టులకు బిల్లులు కట్టమంటున్నారని రోగి కుమారుడు వాపోయాడు.