అమ్మో.. ప్రైవేట్ హాస్పిటల్.. రక్షించాల్సిన వారే ఊపిరి తీస్తున్నారా..?
దిశ, సూర్యాపేట: ప్రతి ఒక్కరూ వైద్యుడిని దేవుడిలా భావిస్తారు.. అలాంటి వైద్యులే డబ్బులకు కక్కుర్తిపడి నిర్లక్ష్య వైద్యం చేస్తూ ఎంతో విలువైన ప్రాణాలను బలిగొని,సెటిల్మెంట్లు చేస్తూ బాధితులకు పైసలు కట్టి ఇవ్వడం పరిపాటిగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల మాతా శిశు మరణాలు వరుసగా జరుగుతున్నా అధికారులు అటుగా చూసిన పాపాన పోవడం లేదు. పోకపోవడం సరికదా పోలీస్ సహకారంతో దగ్గరుండి మరి సెటిల్మెంట్లు చేస్తూ బాధితులకు ప్రాణానికి బదులుగా పైసలు ఇస్తూ తమ తప్పులను […]
దిశ, సూర్యాపేట: ప్రతి ఒక్కరూ వైద్యుడిని దేవుడిలా భావిస్తారు.. అలాంటి వైద్యులే డబ్బులకు కక్కుర్తిపడి నిర్లక్ష్య వైద్యం చేస్తూ ఎంతో విలువైన ప్రాణాలను బలిగొని,సెటిల్మెంట్లు చేస్తూ బాధితులకు పైసలు కట్టి ఇవ్వడం పరిపాటిగా మారింది. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఇటీవల మాతా శిశు మరణాలు వరుసగా జరుగుతున్నా అధికారులు అటుగా చూసిన పాపాన పోవడం లేదు. పోకపోవడం సరికదా పోలీస్ సహకారంతో దగ్గరుండి మరి సెటిల్మెంట్లు చేస్తూ బాధితులకు ప్రాణానికి బదులుగా పైసలు ఇస్తూ తమ తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.
కొందరు వైద్యుల నిర్లక్ష్యం కాగా కొన్ని స్కానింగ్ సెంటర్ల మాయాజాలం కూడా వీరికి తోడుగా మారింది. అర్హత లేని వైద్యులు వైద్యం చేయడమా, అర్హత ఉన్నా నిర్లక్ష్యం చేయడమా ఇలాంటి ఘటనలకు సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఆపద వస్తే హాస్పిటల్ కి పోవాలంటే వేలల్లో ఫీజులు చెల్లిస్తున్నా ప్రాణాలు దక్కడం లేదని ఆందోళనలో సామాన్య ప్రజలు ఉన్నారు. చర్యలు తీసుకోవాల్సిన అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకుండా లంచాలకు కక్కుర్తి పడుతూ తమ శాఖ పరువును బజారుకీడుస్తున్నారు అని ఆరోపణలు ఉన్నాయి. సూర్యాపేట జిల్లా కేంద్రంలో వైద్యాన్ని వృత్తిగా భావించే డాక్టర్లు ఉండగా కొంతమంది వైద్యులు మాత్రం తమకు నచ్చిన నిర్లక్ష్య వైద్యం చేస్తూ ప్రాణాలను బలి గొంటున్నారు.
దీనికి ఉదాహరణ ఇటీవల జిల్లాలో వరుసగా జరుగుతున్న మాతా, శిశు మరణాలు. జిల్లా కేంద్రంలోని చైతన్య స్రవంతి హాస్పిటల్‌లో నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో వెంటనే పుట్టిన పాప చనిపోయిన విషయం అందరికి తెలిసిందే. ఇందుకుగాను రూ.1.3 లక్షలు నష్టపరిహారం చెల్లించి చేతులు దులుపుకున్నారు. అంతేకాకుండా నగరంలో పెద్ద హాస్పిటల్ గా పేరుపొందిన మాధవి హాస్పిటల్‌లో రూ.90 వేల రూపాయలు ఇచ్చారు.
తాజాగా నియో హాస్పిటల్‌లో వైద్యుల నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన శిశువు బంధువులకు రూ.40 వేలు ఇచ్చారు. గతంలో చైతన్య స్రవంతి హాస్పిటల్‌లో నిర్లక్ష్యంగా ఆపరేషన్ చేయడంతో అప్పుడే పుట్టిన పాప చనిపోయింది. బాధితులు హాస్పిటల్ ముందు ఆందోళన చేయగా రూ.1.30 లక్షలు ఇచ్చారు.
మాధవి హాస్పిటల్‌లో దారుణం..
పిల్లల కోసం ఏండ్ల తరబడి చూసిన ఆ దంపతులకు స్కానింగ్ రిపోర్ట్ తో వారి ఆశలన్నీ అడియాశలయ్యాయి. బిడ్డ కడుపులో చనిపోయినప్పటికీ బతికి ఉందంటూ తప్పుడు రిపోర్ట్ ఇవ్వడంతో ఆపరేషన్ చేసిన వైద్యులు మృతి చెందిన శిశువును బయటకు తీశారు. దీంతో డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే శిశువు చనిపోయిందంటూ హాస్పిటల్‌పై బంధువులు దాడి చేసిన ఘటన శనివారం జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల ప్రకారం. తిమ్మాపురం గ్రామానికి చెందిన మారి పెద్ది లావణ్యకు పురిటి నొప్పులు రావడంతో జిల్లా కేంద్రంలోని విద్యా నగర్‌లోని మాధవి హాస్పిటల్‌కి ఉదయం తీసుకొని వచ్చారు. లావణ్యకు స్కాన్ చేయాలని అన్నారు.
డాక్టర్ సలహా మేరకు దగ్గరలోని స్కానింగ్ సెంటర్‌లో స్కాన్ తీయించగా స్కానింగ్‌లో శిశువు హార్ట్ బీట్ లేదని రిపోర్ట్ ఇచ్చారు. లావణ్య భర్త శ్రీకాంత్ గౌడ్‌కి శిశువు మరణించిన విషయం తెలపడంతో మరోసారి స్కానింగ్ తీసుకుంటామని ఆపిల్ స్కానింగ్ సెంటర్‌లో మరోసారి స్కానింగ్ తీయించగా శిశువు హార్ట్ బీట్ ఉందంటూ రిపోర్ట్ ఇచ్చారు. లావణ్యకు ఆపరేషన్ చేయాలని భర్త తెలపడంతో ఆపరేషన్ చేసి మృతి చెందిన శిశువును బయటకు తీశారు.
దీంతో డాక్టర్ నిర్లక్ష్యం కారణంగానే శిశువు మృతి చెందిందంటూ బంధువులు ఆగ్రహంతో హాస్పిటల్‌పై దాడికి పాల్పడ్డారు. వారసత్వం కారణంగానే జన్యు సంబంధిత వ్యాధితో శిశువు మృతి చెందినట్లు డాక్టర్ మాధవి వివరణ ఇచ్చారు. స్కానింగ్ రిపోర్ట్ తప్పుగా ఇచ్చిన విషయం వాస్తవమేనని, ప్రింటింగ్ వల్ల శిశువు హార్ట్ బీట్ ఉన్నట్లు రిపోర్టులో వచ్చిందని చెప్పి స్టాన్నింగ్ సెంటర్ వ్యక్తి తప్పించుకున్నాడు. దీంతో మాధవి హాస్పిటల్ నిర్వాహకులు బాధితులకు రూ.90 వేలు ఇచ్చారు.
నియో హాస్పిటల్‌లో మరణించిన శిశువు
జిల్లా కేంద్రంలోని నియో హాస్పిటల్‌లో ఆదివారం నవజాత శిశువు మరణించగా డాక్టర్ నిర్లక్ష్యం కారణంతోనే మరణించినట్లు శిశువు బంధువులు డాక్టర్లతో వాగ్వాదానికి దిగారు. వివరాల ప్రకారం చివ్వెంల మండలం మున్య నాయక్ తండాకు చెందిన ధరావత్ శ్యామ్, నాగేశ్వరి మూడవ కాన్పులో జిల్లా కేంద్రంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్ బాబుకు జన్మనిచ్చింది. పురిటి సమయంలో కడుపులో ఉన్న శిశువు మలినాలను మింగింది. దీంతో ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం మెరుగైన చికిత్స కొరకు నియో హాస్పిటల్‌లో శనివారం ఉదయం అడ్మిట్ చేశారు.
చికిత్స సమయంలో శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని మెరుగైన చికిత్స చేయాలని అందుకు ఖరీదైన ఇంజక్షన్ వేయాలని డాక్టర్ సూచించడంతో రూ.30 వేలు ఖరీదు చేసే ఇంజక్షన్ వేయడం జరిగింది. తీరా శిశువు పరిస్థితి విషమంగా ఉందంటూ హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ హాస్పిటల్‌కి రిఫర్ చేశారు. దీనితో మెరుగైన చికిత్స కొరకు హైదరాబాద్‌లోని నిలోఫర్ హాస్పిటల్‌కి తీసుకెళ్లగా అప్పటికే శిశువు మరణించినట్లు డాక్టర్లు ధ్రువీకరించారు. దీంతో డాక్టర్ చేసిన ఇంజక్షన్ వికటించడంతోనే మరణించినట్లు భావించిన బంధువులు హాస్పిటల్ వద్ద ఆందోళన చేపట్టారు.
ఊపిరితిత్తులలో ఇన్ఫెక్షన్ అవ్వడంతో ఇంజెక్షన్ ఇచ్చామని, అయినప్పటికీ శిశువు ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు రిఫర్ చేశామని హైదరాబాద్‌కు వెళ్లే సమయంలో కూడా శిశువు బాగానే ఉందంటూ డాక్టర్లు తెలుపుతున్నారు. ఒక డాక్టర్ బదులు వేరే డాక్టర్ వైద్యం చేశారని బాధితులు ఆరోపిస్తున్నారు. నిర్లక్ష్యం కారణంగా చనిపోయిన శిశువు బంధువులకు రూ.40 వేలు ఇచ్చి తమ చేతులు దులుపుకున్నారు.