‘పోటాష్’ కొరత తీరేదెలా..? దిగుబడిపై రైతుల ఆందోళన
దిశ, కరీంనగర్ సిటీ : వానాకాలంలో సాగు చేసిన వరి, పత్తి దిగుబడికి ఆయువు పట్టైన ఎరువు మ్యురేట్ ఆఫ్ పోటాష్ కొరత తీవ్రంగా నెలకొంది. అవసరం మేరకు పోటాష్ సరఫరా చేయటంలో యంత్రాంగం కనబరుస్తున్న నిర్లక్ష్యం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా వరి పంటకు మూడో విడత అందించేందుకు గత పక్షం రోజులుగా రైతాంగం వేచి చూస్తున్నా ఇప్పటివరకు అందుబాటులోకి […]
దిశ, కరీంనగర్ సిటీ : వానాకాలంలో సాగు చేసిన వరి, పత్తి దిగుబడికి ఆయువు పట్టైన ఎరువు మ్యురేట్ ఆఫ్ పోటాష్ కొరత తీవ్రంగా నెలకొంది. అవసరం మేరకు పోటాష్ సరఫరా చేయటంలో యంత్రాంగం కనబరుస్తున్న నిర్లక్ష్యం పంటల దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపే అవకాశాలు కనపడుతున్నాయి. దీంతో జిల్లా రైతాంగం తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తోంది. ప్రధానంగా వరి పంటకు మూడో విడత అందించేందుకు గత పక్షం రోజులుగా రైతాంగం వేచి చూస్తున్నా ఇప్పటివరకు అందుబాటులోకి రాకపోవడంతో తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు.
దీంతో రైతులు ఇతర ప్రాంతాలకు వెళ్లి పోటాష్ కొనుగోలు చేస్తున్నారు. దీనిని ఆసరాగా చేసుకుని ఫెర్టిలైజర్ వ్యాపారులు అసలు ధరకు మించి అధికంగా వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ వర్షాకాలంలో జిల్లాలో 3.50 లక్షల పైచిలుకు ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు చేయగా 1,65, 254 ఎకరాల్లో వరి, 1,42,046 ఎకరాల్లో పత్తి, 25,0 15 ఎకరాల్లో మొక్కజొన్న సాగుచేశారు. ఈ మూడు పంటలకు పోటాష్ వినియోగిస్తారు. ఇందుకు అవసరమైన ఎంఓపి 8,076 టన్నులు అవసరమని అధికారులు అంచనా వేశారు. అయితే, 3 వేల పైచిలుకు టన్నుల నిల్వ మాత్రమే ఉండగా, ఇది మొదటగా నాట్లు వేసిన వారికే సరిపోయినట్లు తెలుస్తుంది.
ప్రధానంగా వరి పంటకు రెండు విడతల్లో వాడుతారు. నాటు వేసే సమయంలో అడుగు మందులు డీఏపీ, 20:20:18, యూరియా, తదితర ఎరువులు వాడుతారు. అనంతరం 15 నుంచి 20 రోజుల మధ్య రెండో డోస్, మరో 25 రోజుల తర్వాత చిరుపొట్ట దశలో మూడో డోసు అందిస్తారు. ఈ రెండు దశల్లో యూరియాతో కలిపి పోటాష్ వాడుతారు.దీని వినియోగంతోనే అధిక దిగుబడి రావడంతో పాటు, గింజ తాలు పోకుండా బలంగా ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా మూడో డోసు ఫెర్టిలైజర్ వరికి అందించాల్సి ఉంది. అయితే, జిల్లాలో ఉన్న ఎంఓపీ నిల్వలు నిండుకోగా.. ఇరవై నుంచి నెల రోజుల తేడాతో నాట్లు వేసిన వారికి, మూడవ దశలో వినియోగించేందుకు అవసరమైన మేరకు అందుబాటులో లేదు. దీంతో వారం రోజులుగా రైతులు యంవోపి కోసం వేచి చూస్తున్నారు. అధికారులు ముందుగానే ఎరువుల కోసం ఇండెంట్ పెట్టగా పోటాష్ మినహా మిగతా ఎరువులన్నీ అందుబాటులోకి వచ్చాయి. అదనపు సాగుకు అవసరమైన ఎరువులపై జిల్లా యంత్రాంగం రెండోసారి ఇండెంట్ పెట్టినా అవసరమైన మేరకు సరఫరా లేదని తెలుస్తోంది. దీంతో అటు అధికారులు, ఇటు రైతాంగం ఆందోళన చెందుతున్నారు. ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసి తేవటం కష్టసాధ్యమవుతుండగా, ఉన్నతాధికారులు స్పందించి జిల్లాకు అవసరమైన మేరకు పోటాష్ సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.