AP News: జనం అభివృద్ధి వైపా..? అక్రమార్కుడి పక్షమా?

ధర్మవరం గురించి రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు.

Update: 2024-05-30 03:12 GMT

దిశ ప్రతినిధి, అనంతపురం: ధర్మవరం గురించి రాష్ట్ర ప్రజలకు కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఎన్టీ రామారావును 1984లో పదవీచ్యుతుడిని చేసినప్పుడు జరిగిన ఉద్యమంలో అది అగ్రభాగాన నిలిచింది. పరిటాల రవీంద్ర హయంలోనూ దానికి ప్రత్యేక స్థానముండేది. ఆయన ఎవరిని సపోర్ట్ చేస్తే వారే అక్కడ గెలుపొందే వారు. ఐదేళ్లుగా ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి కూడా దానికి ప్రత్యేక గుర్తింపు తీసుకువచ్చారు.

' గుడ్ మార్నింగ్ ధర్మవరం' పేరుతో సోషల్ మీడియాలో ఆయన చేసిన వీడియోలు తెగ వైరల్ అయ్యాయి. అలాంటి చోట టీడీపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ పోటీ చేస్తున్నారు. అధికార వైసీపీ అభ్యర్థిగా ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి తిరిగి బరిలో ఉన్నారు. ఇంతటి ప్రాధాన్యమున్న నియోజకవర్గంలో గెలుపు ఎవరిని వరిస్తుందనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది.

బీసీ కార్డు ఫలించేనా?

ధర్మవరం నియోజకవర్గం టీడీపీకి కంచుకోట అని చెప్పవచ్చు. ఆవిర్భవించి నప్పటి నుంచి ఇప్పటివరకు అత్యధిక సార్లు ఆ పార్టీయే అక్కడ గెలుపొందింది. ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి రెండుసార్లు, ఆయన తండ్రి కేతిరెడ్డి సూర్యప్రతాప్ రెడ్డి ఒకసారి మాత్రమే టీడీపీ అభ్యర్థులపై గెలుపు సాధించారు. ప్రస్తుతం వెంకట్రామిరెడ్డి తిరిగి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు.

ఆయనపై టీడీపీ కూటమి అభ్యర్థిగా బీజేపీ జాతీయ కార్యదర్శి సత్య కుమార్ రంగంలో ఉన్నారు. ఐదు దశాబ్దాల తర్వాత ఒక బీసీ అభ్యర్థికి అవకాశం రావడంతో ఆ వర్గం వారంతా ఆయనను సొంతం చేసుకున్నారు. నియోజకవర్గంలో చేనేతలు, కురబలు, యాదవులు అధిక సంఖ్యలో ఉన్నారు. వారిలో అత్యధికులు ఆయనకే ఓట్లు వేసి ఉంటారని భావిస్తున్నారు.

సత్యకుమార్‌కు కలిసొచ్చిన అంశాలివే..

అనుభవం, వాగ్దాటి, తెగువ, వేగం, కేంద్ర పెద్దలతో సంబంధాలు వంటి అంశాలు సత్యకుమార్‌ను ఓ స్థాయిలో నిలబెట్టాయి. పరిటాల శ్రీరామ్ కూడా మనస్ఫూర్తిగా సహకరించడంతో ఆ పార్టీ ఓట్లన్నీ బాగానే ట్రాన్స్ఫర్ అయి ఉంటాయని భావిస్తున్నారు. 'సత్యకుమార్‌నే కాదు.. ఆయన వెనుక ఉన్న పరిటాల శ్రీరాంను కూడా చూడండి..' అనే డైలాగ్‌తో టీడీపీ శ్రేణులంతా ఆయన వెంట నిలబడేలా శ్రీరామ్ చేశారు.

'ఎమ్మెల్యేగా మనమే పోటీ చేస్తున్నాం.. లక్ష మెజారిటీతో గెలుస్తున్నాం' అంటూ అప్పటివరకు ఊరిస్తూ వచ్చిన మాజీ ఎమ్మెల్యే గోనుగుంట్ల సూర్యనారాయణ రెబెల్‌గానో, ఇండిపెండెంటుగానో బరిలోకి దిగుతారని అందరూ భావించారు. చివరికి ఆయన కూడా పోటీ చేయకపోవడంతో సత్య కుమార్ గెలుపు ఇక నల్లేరు మీద నడకే అయిందనే చర్చ జరుగుతోంది.

కేతిరెడ్డి ' గుడ్ మార్నింగ్'కు మార్కులెన్ని?

ప్రస్తుత ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పేరు చెప్పగానే ఎవరికైనా 'గుడ్ మార్నింగ్ ధర్మవరం' గుర్తుకు వస్తుంది. సోషల్ మీడియా ద్వారా ఆయన కార్యక్రమాలు అంతగా ప్రజల్లోకి వెళ్లాయి. ఆ వీడియోలు చూసిన వారెవరైనా.. 'ఎమ్మెల్యే అంటే ఇలా ఉండాలి' అనుకుని ఉంటారు. కానీ, వాటిపై స్థానికంగా విమర్శలు వేరే ఉన్నాయి. అదొక రియాలిటీ షో అనేది ప్రధాన విమర్శ.

పొద్దున్నే వెళ్లేది ఖాళీ స్థలాలు, భారీ కట్టడాలను గుర్తించి కబ్జా చేయడానికో, కమీషన్లు గుంజడానికో అనేది రెండో విమర్శ. ఆ విమర్శల సంగతి ఎలా ఉన్నా.. నియోజకవర్గ అభివృద్ధికి ఆయన చేసింది దాదాపు శూన్యమనే చెప్పవచ్చు. చెరువు స్థలాన్ని కబ్జా చేసి విలాసవంతమైన అతిథి గృహం నిర్మించుకుని బోటింగు, గుర్రపు స్వారీ చేస్తూ రాజభోగాలు అనుభవిస్తున్నారనే విమర్శలున్నాయి. అలాంటి వ్యక్తిని తిరిగి ఎమ్మెల్యేగా ఎన్నుకుంటారో, అభివృద్ధి ఎజెండాతో దూసుకెళుతున్న సత్యకుమార్‌ను గెలిపిస్తారో చూడాల్సి ఉంది.


Similar News