మీ సీఎం క్యాండిడేట్ ఎవరో చెప్పండి.. బీజేపీకి ఢిల్లీ సీఎం ఆతిషి సూటి ప్రశ్న

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీని సీఎం ఆతిషి శుక్రవారం డిమాండ్ చేశారు.

Update: 2025-01-10 13:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ సీఎం అభ్యర్థి ఎవరో ప్రకటించాలని బీజేపీని సీఎం ఆతిషి శుక్రవారం డిమాండ్ చేశారు. ఢిల్లీలోని కల్కాజీ అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్న సీఎం ఆతిషి.. ప్రజలు బీజేపీ సీఎం క్యాండిడేట్ ఎవరో తెలుసుకోవాలనే ఉత్సాహంతో ఉన్నారని చెప్పారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికల్లో ఆప్ గెలిస్తే అర్వింద్ కేజ్రివాల్ మరోసారి ముఖ్యమంత్రి అవుతారని ప్రకటించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో నిరుడు అర్వింద్ కేజ్రివాల్‌ తీహార్ జైలుకు వెళ్లారు. ఆ సమయంలో ఆతిషి ఢిల్లీకి సీఎంగా పగ్గాలు చేపట్టారు. తాజాగా ఆమె మరోసారి కల్కాజీ సెగ్మెంట్ నుంచి పోటీ చేస్తున్నారు. ఆతిషికి ప్రత్యర్థిగా బీజేపీ నుంచి సౌత్ ఢిల్లీ మాజీ ఎంపీ రమేష్ బిదురి పోటీ చేస్తున్నారు.

'ఇవ్వాళ, ఢిల్లీ మొత్తం బీజేపీ సీఎం అభ్యర్థి ఎవరని అడుగుతోంది. ఆప్‌కు ఓటేస్తే అర్వింద్ కేజ్రివాల్ సీఎం అవుతారని వారికి తెలుసు. కానీ బీజేపీ ఓటేస్తే ఎవరు సీఎం అనేది వారికి అర్థం కాక అడుగుతున్నారు' అని ఆతిషి వ్యాఖ్యానించారు. అయితే బీజేపీ సీఎం అభ్యర్థిగా నా ప్రత్యర్థి రమేష్ బిదురి అవ్వొచ్చేమో అని వ్యంగ్య వ్యాఖ్యలు చేశారు. మాజీ ఎంపీ రమేష్ బిదురి ఇటీవల వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. తాను గెలిస్తే ప్రియాంక గాంధీ బుగ్గల్లా రోడ్లను నిర్మిస్తానని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర దుమారం రేపాయి. కాంగ్రెస్ పార్టీ కూడా రమేష్ బిదురి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.


Tags:    

Similar News