విపక్షాలను ఒక్కటి చేసిన కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారం
దేశంలోని విపక్షాలను కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారోత్సవం ఒక్కటి చేసింది.
దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక సీఎంగా సిద్ధరామయ్య ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో పాటు డిప్యూటీ సీఎంగా డీకే శివకుమార్, మంత్రులుగా మరో 8 మంది బాధ్యతలు తీసుకున్నారు. అయితే బెంగళూరులోని శ్రీ కంఠీరవ స్టేడియంలో జరిగిన ఈ కార్యక్రమం విపక్షాలను ఏకం చేసింది. మొన్నటి వరకు ఎవరికి వారే అన్నట్లు వ్యవహరించిన పలు పార్టీల నాయకులు కర్ణాటక ఎన్నికల ఫలితాలతో రూటు మార్చారు. దేశంలో బీజేపీని ఓడించడం కాంగ్రెస్ వల్ల కాదు అన్నవాళ్లంతా ఇప్పుడు కాంగ్రెస్ తో దోస్తీ కట్టడానికి ఉవ్విళ్లూరుతున్నారు. ఇక బీజేపీని ఓడించాలంటే బీజేపీ వ్యతిరేక పార్టీలను కలుపుకుపోవాలని కాంగ్రెస్ కూడా భావించింది. మోడీ అమిత్ షా ద్వయానికి దేశంలో ఎదురేలేదు అన్న సమయంలో కర్ణాటక ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ తో పాటు విపక్షాలకు కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇప్పుడు ఈ విషయమే వారందరినీ కాంగ్రెస్ తో కలిసేలా చేశాయి. కర్ణాటక సీఎం ప్రమాణ స్వీకారానికి కాంగ్రెస్ పార్టీ పలు బీజేపీయేతర సీఎంలు, విపక్ష పార్టీల నాయకులకు ఆహ్వానాలు పంపింది.
ఈ నేపథ్యంలోనే ఇవాళ బెంగళూరులో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవానికి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్, చత్తీస్గడ్ సీఎం భూపేశ్ భగల్, హిమాచల్ ప్రదేశ్ సీఎం సుక్ విందర్ సింగ్ వంటి కాంగ్రెస్ నాయకులతో పాటు బీహార్ సీఎం నితీశ్ కుమార్, తమిళనాడు సీఎం స్టాలిన్, జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్, మాజీ సీఎంలు ఫరూక్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, న్సీపీ చీఫ్ శరద్ పవార్, సీపీఎం అగ్ర నేత సీతారాం ఏచూరి, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్, మక్కల్ మీదీ మయ్యం అధినేత, సినీ నటుడు కమల్ హసన్ తదితరులు హాజరయ్యారు. త్వరలో రాజస్థాన్, మధ్యప్రదేశ్, చత్తీస్గడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందులో రాజస్థాన్, చత్తీస్గడ్ రాష్ట్రాల్లో కాంగ్రెస్ అధికారంలో ఉండగా మధ్యప్రదేశ్ లో బీజేపీ, తెలంగాణలో బీఆర్ఎస్, మిజోరాంలో మిజో నేషనల్ ఫ్రంట్ అధికారంలో ఉన్నాయి. ఈ క్రమంలోనే రానున్న ఎన్నికల్లో గెలిచి విపక్ష పార్టీలకు పెద్దన్నగా నిలవడానికి కాంగ్రెస్ పావులు కదుపుతోంటే.. బీజేపీని ఓడించడానికి విపక్ష పార్టీలు కాంగ్రెస్ తో జత కట్టడానికి సిద్ధమవుతున్నాయి.
Read more:
దేశంలో ద్వేషాన్ని పెంచేవారిని కర్నాటక ప్రజలు ఓడించారు: రాహుల్ గాంధీ